Dwayne Bravo: ఛాంపియన్‌ నిష్ర్కమణ

ముచ్చటగా మూడో టైటిల్‌ అందుకోవాలనే  వెస్టిండీస్‌ కల తీరలేదు. 2012, 2016లో పొట్టి కప్పును ముద్దాడిన ఆ జట్టు.. ఈ సారి సెమీస్‌లో అడుగుపెట్టలేకపోయింది.

Updated : 06 Nov 2021 07:38 IST

లంక చేతిలో ఓడిన వెస్టిండీస్‌
సెమీస్‌ రేసు నుంచి ఔట్‌
అబుదాబి

ముచ్చటగా మూడో టైటిల్‌ అందుకోవాలనే  వెస్టిండీస్‌ కల తీరలేదు. 2012, 2016లో పొట్టి కప్పును ముద్దాడిన ఆ జట్టు.. ఈ సారి సెమీస్‌లో అడుగుపెట్టలేకపోయింది. గ్రూప్‌- 1లో శ్రీలంక చేతిలో 20 పరుగుల తేడాతో ఓడి సెమీస్‌ రేసు నుంచి నిష్క్రమిచింది.. మొదట లంక.. 3 వికెట్లకు 189 పరుగులు చేసింది. ఫామ్‌లో ఉన్న నిశాంక (51; 41 బంతుల్లో 5×4), అసలంక (68; 41 బంతుల్లో 8×4, 1×6) అర్ధశతకాలతో చెలరేగారు. నిశాంక, అసలంక జోడీ విండీస్‌ బౌలర్లను ఏ మాత్రం లక్ష్యపెట్టలేదు. బౌండరీలతో చెలరేగిన వీళ్లిద్దరూ జట్టును భారీ స్కోరు దిశగా నడిపించారు. నిశాంక పెవిలియన్‌ చేరినా.. కెప్టెన్‌ శనక (25 నాటౌట్‌)తో కలిసి అసలంక బాదుడు కొనసాగించాడు. బ్రావో బౌలింగ్‌లో స్లాగ్‌ స్వీప్‌తో అసలంక కొట్టిన సిక్సర్‌ చూడాల్సిందే. అనంతరం ఛేదనలో విండీస్‌ తడబడింది. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్లోనే ఓపెనర్లను ఔట్‌ చేసిన ఫెర్నాండో (2/24) ఆ జట్టుకు షాకిచ్చాడు. పూరన్‌ (46; 34 బంతుల్లో 6×4, 1×6), హెట్‌మయర్‌ (81 నాటౌట్‌; 54 బంతుల్లో 8×4, 4×6) క్రీజులో నిలబడడంతో జట్టు గాడిన పడ్డట్లు కనిపించింది. కానీ పూరన్‌ ఔటవడంతో కథ అడ్డం తిరిగింది. ఓ వైపు హెట్‌మయర్‌ భారీషాట్లు ఆడినా.. అతనికి సహకరించే బ్యాటర్‌ కరవయ్యాడు. స్పిన్నర్‌ హసరంగ (2/19) రాణించాడు.  

సంక్షిప్త స్కోర్లు: శ్రీలంక: 189/3 (నిశాంక 51, అసలంక 68, రసెల్‌ 2/33), వెస్టిండీస్‌: 169/8 (హెట్‌మయర్‌ 81 నాటౌట్‌, పూరన్‌ 46, హసరంగ 2/19, ఫెర్నాండో 2/24, కరుణరత్నె 2/43)


బ్రావో వీడ్కోలు

క్యాచ్‌ పట్టగానే.. వికెట్‌ పడగొట్టగానే.. మ్యాచ్‌ గెలవగానే.. మైదానంలో కాళ్లు కదిపి క్రికెట్‌ అభిమానులను అలరించే డ్వేన్‌ బ్రావో చిందులు ఇక అంతర్జాతీయ క్రికెట్లో కనిపించవు. 17 ఏళ్లకు పైగా సుదీర్ఘ కెరీర్‌కు ఈ ఆల్‌రౌండర్‌ ముగింపు పలకనున్నాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్‌ తీసుకోనున్నాడు. ‘‘కరీబియన్‌ ప్రజల తరపున సుదీర్ఘ కాలం పాటు ప్రాతినిథ్యం వహించినందుకు గొప్పగా ఉంది. మూడు ఐసీసీ ట్రోఫీలు నెగ్గడం.. అందులో రెండు నా కెప్టెన్‌ సామి సారథ్యంలో గెలవడం విశేషం. దిగ్గజాల బాటలో సాగిన మేము మాకంటూ ఓ గుర్తింపు ఏర్పరచుకోవడం గర్వంగా ఉంది’’ అని  38 ఏళ్ల బ్రావో తెలిపాడు. గతంలో రిటైర్మెంట్‌  ప్రకటించిన బ్రావో 2019లో ఆ నిర్ణయాన్ని వెనక్కితీసుకున్నాడు. 2004లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అతను.. 40 టెస్టులాడి 2200 పరుగులు చేయడంతో పాటు 86 వికెట్లు తీశాడు. 164 వన్డేల్లో 2968 పరుగులు, 199 వికెట్లు.. 90 టీ20ల్లో 1245 పరుగులు, 78 వికెట్లు సాధించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని