T20 World Cup: గేల్‌ రిటైర్‌ అయినట్లే..!

బౌలర్‌ ఎవరనేది సంబంధం లేకుండా అలవోకగా సిక్సర్లు బాదే క్రిస్‌గేల్‌ బ్యాట్‌ ఇక విశ్రాంతి తీసుకోనుందా? 42 ఏళ్ల వయసులోనూ యువకులతో పోటీపడుతూ పరుగుల

Updated : 07 Nov 2021 07:36 IST

అబుదాబి: బౌలర్‌ ఎవరనేది సంబంధం లేకుండా అలవోకగా సిక్సర్లు బాదే క్రిస్‌గేల్‌ బ్యాట్‌ ఇక విశ్రాంతి తీసుకోనుందా? 42 ఏళ్ల వయసులోనూ యువకులతో పోటీపడుతూ పరుగుల వరద పారించే అతని ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ముగిసిందా? ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో దృశ్యాలు చూశాక అందరిలో ఇవే సందేహాలు కలిగాయి. అతని కెరీర్‌ ముగిసిందనే సంకేతాలు కనిపించాయి. శనివారం ఆసీస్‌తో మ్యాచ్‌లో ఔటైన తర్వాత స్టాండ్స్‌లో అభిమానులకు బ్యాట్‌ చూపిస్తూ గేల్‌ పెవిలియన్‌ చేరాడు. అక్కడ బౌండరీ బయట సహచర ఆటగాళ్లు నిలబడి చప్పట్లు కొడుతూ కనిపించారు. బ్రావో, రసెల్‌ వచ్చి గేల్‌ను హత్తుకున్నారు. అనంతరం తన గ్లోవ్‌లను స్టాండ్స్‌లోని అభిమానులకు గేల్‌ ఇచ్చేశాడు. ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలోనూ కెమెరాలన్నీ అతనిపైనే దృష్టి పెట్టాయి. బౌలింగ్‌కు వచ్చిన గేల్‌ ఒక వికెట్‌ పడగొట్టడం విశేషం. మైదానంలో ఉన్నంత సేపు నవ్వుతూ.. ఉత్సాహంగా కనిపించాడు. మ్యాచ్‌ ముగిశాక ఇరు జట్ల ఆటగాళ్లు ఇప్పటికే రిటైర్మెంట్‌ ప్రకటించిన బ్రావోను చప్పట్లతో అభినందించగా.. గేల్‌ కూడా అదే బాటలో సాగాడు. రిటైర్‌మెంట్‌పై అతడు అధికారిక ప్రకటన చేసేస్తాడేమోనని అంతా ఎదురు చూశారు. అయితే తాను రిటైర్‌ అయినట్లే కానీ సొంత అభిమానుల ముందు చివరి మ్యాచ్‌ ఆడాలని కోరుకుంటున్నట్లు గేల్‌ తెలిపాడు. ‘‘ఇప్పుడు నేను పూర్తి స్థాయిలో రిటైర్‌ కాలేదు. ఇంకో మ్యాచ్‌ మిగిలుంది. చివరి ప్రపంచకప్‌ కావడంతో ఆటగాళ్లు, అభిమానులతో సరదాగా గడిపా. నాకు మరో ప్రపంచకప్‌ ఆడాలని ఉంది. కానీ మా బోర్డు అందుకు అంగీకరిస్తుందో లేదో తెలియదు. ఇప్పుడే రిటైర్‌మెంట్‌ ప్రకటించను. జమైకాలో నా సొంత అభిమానుల ముందు ఆఖరి మ్యాచ్‌ ఆడాలని అనుకుంటున్నా. ఒకవేళ అది జరగపోతే అప్పుడే ప్రకటిస్తా’’ అని గేల్‌ చెప్పాడు. రెండేళ్ల క్రితం భారత్‌తో వన్డేతోనే అతను అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతాడని అనుకున్నారు. కానీ విరామం తీసుకున్న అతను మళ్లీ మైదానంలో అడుగుపెట్టాడు. 2022లోనూ టీ20 ప్రపంచకప్‌ ఉండడంతో అందులోనూ అతనాడతాడనే ప్రచారం సాగుతోంది. మరోవైపు 45 ఏళ్లు వచ్చేంత వరకూ ఆడతానని ఇటీవల గేల్‌ చెప్పాడు. 1999లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన గేల్‌ రెండు దశాబ్దాలకు పైగా ఆటలో కొనసాగుతున్నాడు. విండీస్‌ తరపున 103 టెస్టుల్లో 7214 పరుగులు, 301 వన్డేల్లో 10480 పరుగులు, 79 టీ20ల్లో 1899 పరుగులు చేశాడు. మొత్తంగా టీ20ల్లో 445 ఇన్నింగ్స్‌ల్లో 14,321 పరుగులు చేశాడు. అందులో 22   సెంచరీలు ఉండడం విశేషం. 2013 ఐపీఎల్‌లో ఆర్సీబీ తరపున 66 బంతుల్లోనే 175 పరుగులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు.


అంతర్జాతీయ టీ20లకు రిటైర్‌మెంట్‌ ప్రకటించినా శరీరం సహకరించినంత కాలం ఫ్రాంఛైజీ క్రికెట్‌ ఆడతా. కొన్నేళ్ల క్రితమే వీడ్కోలు పలుకుదాం అనుకున్నా. కానీ బోర్డు అధ్యక్షుడు.. కెప్టెన్‌ మారడంతో మళ్లీ విండీస్‌కు ఆడాలని భావించా. ఎందుకంటే ఇంకా శారీరకంగా క్రికెట్‌ ఆడగల స్థితిలో ఉన్నా. వీడ్కోలు పలకడానికి ఇదే సరైన సమయం. యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నా. గేల్‌లో ఇంకా ఆడగల సత్తా ఉంది. కానీ అతడు ఏం నిర్ణయించుకున్నాడో నాకు స్పష్టత లేదు’’

- బ్రావో



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని