
Racism: ‘స్టీవ్’ అన్నందుకు పుజారాకు క్షమాపణలు
లండన్: ఇంగ్లాండ్ కౌంటీల్లో యార్క్‌షైర్ తరపున ఆడినప్పుడు భారత టెస్టు ఆటగాడు పుజారాను తన పేరుతో పిలవకుండా ‘స్టీవ్’ అని సంబోధించినందుకు సోమర్‌సెట్ సీమర్ జాక్‌బ్రూక్స్ గురువారం క్షమాపణలు తెలిపాడు. 2012లో జాత్యహంకారంతో కూడిన ట్వీట్లకు కూడా అతను మన్నించమని కోరాడు. యార్క్‌షైర్ జట్టులో జాతి వివక్ష అనేది అంతర్భాగంగా ఉందని మాజీ ఆటగాడు అజీమ్ రఫీక్ చేసిన ఆరోపణలపై విచారణ జరుగుతోంది. ఈ సందర్భంగా బ్రూక్స్ పేరు కూడా రఫీక్ వెల్లడించాడు. పుజారా 2015, 2018లో యార్క్‌షైర్ తరపున కౌంటీల్లో ఆడాడు. శ్వేత జాతీయులు కానివాళ్లపై జాతి వివక్ష చూపుతూ ఇంగ్లాండ్ ఆటగాళ్లు.. వాళ్ల సొంత పేర్లతో కాకుండా ‘స్టీవ్’ అని పిలుస్తారని, పుజారాను కూడా అలాగే పిలిచేవాళ్లని రఫీక్ ఆరోపించాడు. ‘‘మతం, జాతి అనే తేడా లేకుండా గతంలో డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లను ‘స్టీవ్’ అని పిలిచేవాళ్లం. కానీ అది తప్పని ఇప్పుడు తెలిసింది. అందుకే పుజారాను క్షమించమని కోరా’’ అని బ్రూక్స్ పేర్కొన్నాడు.
Advertisement