Dhoni-CSK: చెన్నైలోనే చివరి మ్యాచ్‌ : ధోనీ

ధోని వచ్చే ఐపీఎల్‌లో ఆడతాడా? సీఎస్కే జట్టుతోనే కొనసాగుతాడా? అనే ప్రశ్నలకు స్వయంగా అతనే సమాధానమిచ్చాడు. చెన్నైలోనే తన చివరి మ్యాచ్‌ ఆడతానని మరోసారి పునరుద్ఘాటించిన...

Updated : 21 Nov 2021 07:07 IST

చెన్నై

ధోని వచ్చే ఐపీఎల్‌లో ఆడతాడా? సీఎస్కే జట్టుతోనే కొనసాగుతాడా? అనే ప్రశ్నలకు స్వయంగా అతనే సమాధానమిచ్చాడు. చెన్నైలోనే తన చివరి మ్యాచ్‌ ఆడతానని మరోసారి పునరుద్ఘాటించిన ఈ టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌.. అది వచ్చే ఏడాది కావొచ్చు లేదా అయిదేళ్లలో కావొచ్చు అని తెలిపాడు. దీంతో అతను ఇప్పుడే ఐపీఎల్‌ నుంచి కానీ సీఎస్కే నుంచి కానీ తప్పుకోడని స్పష్టమైంది. ఈ ఏడాది ఐపీఎల్‌లో విజేతగా నిలిచిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ నాలుగో టైటిల్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా శనివారం ఆ జట్టు విజయ సంబరాలను నిర్వహించారు. ‘‘నా క్రికెట్‌ కోసం ఎప్పుడూ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటా. స్వదేశంలో నా చివరి వన్డేను సొంతగడ్డ రాంచీలోనే ఆడా. కాబట్టి నా చివరి టీ20 చెన్నైలోనే ఆడతాననే నమ్మకంతో ఉన్నా. అది తర్వాతి ఏడాదేనా లేదా అయిదేళ్లలోనా అనేది మాకు నిజంగానే తెలీదు. అభిమాన బలమే మమ్మల్ని నడిపిస్తోంది. కేవలం తమిళనాడుకే పరిమితం కాకుండా.. దేశాన్ని దాటి ఎక్కడ ఆడితే అక్కడికి వచ్చి మాకు మద్దతుగా నిలిచారు. అది బెంగళూరు కావొచ్చు.. జొహనెస్‌బర్గ్‌ లేదా దుబాయ్‌ కావొచ్చు. రెండేళ్ల పాటు లీగ్‌కు దూరమైనప్పుడు కూడా సామాజిక మాధ్యమాల్లో సీఎస్కే గురించే ఎక్కువగా మాట్లాడారు’’ అని ధోని తెలిపాడు. 2019 నుంచి ధోని చెన్నైలో ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడని సంగతి తెలిసిందే. సీఎస్కే యజమాని ఎన్‌.శ్రీనివాసన్‌ మాట్లాడుతూ.. ‘‘ప్రజలు ధోని వారసత్వం గురించి గొప్పగా మాట్లాడుకుంటారు. అతనెక్కడికి వెళ్లడం లేదు. ఇప్పటికీ మాతోనే ఉన్నాడు’’ అని పేర్కొన్నాడు. మెగా వేలం నేపథ్యంలో సీఎస్కే ధోనీతో పాటు జడేజా, రుతురాజ్‌ను అట్టిపెట్టుకుంటుందని సమాచారం. ఈ కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌, దిగ్గజం కపిల్‌ దేవ్‌, బీసీసీఐ కార్యదర్శి జై షా, ఐపీఎల్‌ ఛైర్మన్‌ బ్రిజేష్‌ పటేల్‌ తదితరులు పాల్గొన్నారు. సీఎస్‌కే జట్టుకు ప్రత్యేక అభినందలు తెలిపిన సీఎం స్టాలిన్‌, ధోనీ ప్రత్యేకతను కొనియాడారు. తాను ధోని అభిమానినని చెప్పారు.

వచ్చే ఏడాది భారత్‌లోనే: 2022 ఐపీఎల్‌ను భారత్‌లోనే నిర్వహిస్తామని బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించాడు. సీఎస్కే జట్టు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న అతను మాట్లాడుతూ.. ‘‘చెపాక్‌లో సీఎస్కే ఆడుతుంటే చూడాలని మీరందరూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. అదెంతో దూరంలో లేదు. ఐపీఎల్‌ 15వ సీజన్‌ భారత్‌లోనే జరుగుతుంది. రెండు కొత్త జట్లు చేరుతుండడంతో అది మరింత ఉత్తేజితంగా ఉంటుంది. త్వరలోనే జరిగే మెగా వేలంతో జట్ల కొత్త కూర్పు ఎలా ఉంటుందో చూడాలి. ధోని లాంటి కెప్టెన్‌ ఉన్న తర్వాత సీఎస్కేను ఎవరైనా ఎందుకు తేలిగ్గా తీసుకుంటారు. సీఎస్కే గుండె చప్పుడు, వెన్నెముక అతనే. భారత్‌ అందించిన అత్యంత విజయవంతమైన కెప్టెన్‌ మహీనే’’ అని తెలిపాడు. గత రెండు సీజన్లలో ఒక్క మ్యాచ్‌ కూడా చెన్నైలో జరగలేదు. 2020లో కరోనా కారణంగా సీజన్‌ మొత్తం యూఏఈలో జరగ్గా.. ఈ ఏడాది సగం మ్యాచ్‌లు భారత్‌లోని ఇతర వేదికల్లో, సగం మ్యాచ్‌లో మళ్లీ యూఏఈలోనే నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని