
IND vs NZ: 135లోనే నా లయ బాగుంటుంది
రాంచి: ప్రస్తుతం ఫాస్ట్‌బౌలర్లలో చాలామంది 145 కిలోమీటర్ల వేగంతో బంతులేసేవాళ్లే. వేగం 140 కి.మీ.కి తగ్గితే బ్యాట్స్‌మెన్‌కు కళ్లెం వేయడం కష్టమని భావిస్తారు పేసర్లు. అయితే ఐపీఎల్‌లో హర్షల్ పటేల్ మాత్రం 135 కి.మీ వేగంతోనే ఐపీఎల్‌లో బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేస్తూ వస్తున్నాడు. నిలకడగా వికెట్లు తీస్తూ అతను భారత టీ20 జట్టులోనూ చోటు సంపాదించాడు. మరి తక్కువ వేగంతో ఎలా విజయవంతం అవుతున్నావని హర్షల్‌ను అడిగితే.. ‘‘ఒక ఫాస్ట్‌బౌలర్‌గా నేను కూడా వేగంగానే బంతులు వేయాలని కోరుకుంటా. కానీ 135 కి.మీ. వేగంతో బంతులేసినపుడే నా లయ బాగుంటోంది. మహా అయితే నేను 140 కి.మీ.ని అందుకుంటానేమో. దాన్ని మించిన వేగంతో మాత్రం బంతులు వేయలేను. అందుకే నేను వేగం గురించి పట్టించుకోకుండా ఇతర నైపుణ్యాలపై దృష్టిపెడుతున్నా’’ అని చెప్పాడు. ఇక టీమ్‌ఇండియాకు ఆడే అవకాశం ఆలస్యంగా వచ్చిందా అన్న ప్రశ్నకు జవాబిస్తూ.. ‘‘నేను ఏదో ఒక రోజు అత్యున్నత స్థాయిలో ఆడతానని తెలుసు. ఆ అవకాశం నాకు దక్కదని ఎప్పుడూ అనిపించలేదు’’ అని ఇంకో రెండు రోజుల్లో 31వ పుట్టిన రోజు జరుపుకోనున్న హర్షల్ చెప్పాడు. శుక్రవారం న్యూజిలాండ్‌తో రెండో టీ20లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన హర్షల్ 2 వికెట్లతో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అందుకున్న సంగతి తెలిసిందే.