Ravichandran Ashwin: అశ్విన్‌ ఉంటే..

స్పిన్నర్‌ అశ్విన్‌ టీ20 క్రికెట్‌ మధ్య ఓవర్లలో ఎప్పుడూ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచడానికి ఉపయోగపడతాడని కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. నాలుగేళ్ల విరామంతో టీ20 ప్రపంచకప్‌తో పరిమిత ఓవర్ల ఫార్మాట్లో పునరాగమనం చేసిన

Updated : 23 Nov 2021 06:47 IST

కోల్‌కతా: స్పిన్నర్‌ అశ్విన్‌ టీ20 క్రికెట్‌ మధ్య ఓవర్లలో ఎప్పుడూ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచడానికి ఉపయోగపడతాడని కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. నాలుగేళ్ల విరామంతో టీ20 ప్రపంచకప్‌తో పరిమిత ఓవర్ల ఫార్మాట్లో పునరాగమనం చేసిన అశ్విన్‌.. ఆ టోర్నీలో గొప్పగా రాణించాడు.  కివీస్‌తో టీ20 సిరీస్‌లోనూ మెరుగైన ప్రదర్శన చేశాడు. మధ్య ఓవర్లలో వికెట్లు తీయడమే కాదు.. పరుగుల వేగానికి కళ్లెం కూడా వేశాడు. ‘‘అశ్విన్‌ ఎప్పుడూ కెప్టెన్‌కు ఆయుధమే. అతడిలాంటి బౌలర్‌ జట్టులో ఉంటే మధ్య ఓవర్లలో వికెట్లు తీయడానికి మంచి అవకాశం ఉంటుంది. అశ్విన్‌ గొప్పగా పునరాగమనం చేశాడు. అతడు చాలా నాణ్యమైన బౌలర్‌. మనందరికి ఆ విషయం తెలుసు. టెస్టు క్రికెట్లో బంతితో అతడు సత్తా చాటుకున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లోనూనూ అతడికి చెత్త రికార్డేమీ లేదు. దుబాయ్‌లో, ఇప్పుడు కివీస్‌తో సిరీస్‌లో బౌలింగ్‌ చేసిన తీరు అతడి నాణ్యతను చెబుతోంది’’ అని రోహిత్‌ అన్నాడు. ‘‘మధ్య ఓవర్లలో పరుగుల ప్రవాహానికి అడ్డుకట్ట వేయడం చాలా ముఖ్యం. రన్‌రేట్‌కు కళ్లెం వేస్తూనే వికెట్లు తీయడానికి ప్రయత్నించాలి. అక్షర్‌తో కలిసి అశ్విన్‌ ఆ పని చేయగలడు’’ అని చెప్పాడు. ఆటగాళ్లలో భద్రతాభావం కలిగించి, వారు నిర్భయంగా ఆడేలా చేయడం కోసం తాను, కోచ్‌ ద్రవిడ్‌ ప్రయత్నిస్తున్నామని రోహిత్‌ తెలిపాడు. ‘‘జట్టు కోసం ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తే.. దానికి తప్పక గుర్తింపు ఉంటుంది. మేం తొలి సమావేశంలోనే ఈ విషయాన్ని ఆటగాళ్లకు స్పష్టం చేశాం’’ అని చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని