Updated : 23/11/2021 08:13 IST

Rohit Sharma: సారథీ.. సాగిపో..!

ఈనాడు క్రీడావిభాగం

టీమ్‌ఇండియా వన్డే ప్రపంచకప్‌ గెలిచి పదేళ్లు దాటిపోయింది.. అదే టీ20 ప్రపంచకప్‌ అయితే ఏకంగా 14 ఏళ్లు గడిచిపోయింది. ఆ తర్వాత ఇప్పటివరకూ మరో కప్పును ముద్దాడలేకపోయింది. ఈ ఏడాది పొట్టి కప్పును పట్టేస్తుందనే ఆశలు ఆవిరయ్యాయి. ఇక అందరి చూపు 2022 టీ20 ప్రపంచకప్‌పై పడింది. ఇప్పుడు ఆశలన్నీ కొత్త కెప్టెన్‌ రోహిత్‌ శర్మపైనే. ఆ దిశగా సారథిగా తొలి సిరీస్‌లోనే క్లీన్‌స్వీప్‌ విజయాన్ని అందించిన అతను.. నాయకత్వంతో ఆకట్టుకున్నాడు. ఇదే జోరు కొనసాగించి ఆ కప్పు ముచ్చట కూడా తీర్చాలని అభిమానులు కోరుకుంటున్నారు.

టీ20 ప్రపంచకప్‌లో పరాభవంతో డీలా పడ్డ అభిమానులకు.. న్యూజిలాండ్‌పై క్లీన్‌స్వీప్‌ విజయంతో టీమ్‌ఇండియా కాస్త ఉపశమనాన్ని కలిగించింది. మూడు మ్యాచ్‌ల్లోనూ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో మనవాళ్లు సత్తాచాటారు. కొత్త కెప్టెన్‌ రోహిత్‌, కొత్త కోచ్‌ ద్రవిడ్‌.. ఘనంగా బోణీ కొట్టారు. ఈ సిరీస్‌లో రోహిత్‌ తన నాయకత్వ లక్షణాలతో ఆకట్టుకున్నాడు. అతనికి కెప్టెన్సీ కొత్తేమీ కాదు. ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ సారథిగా ఏకంగా అయిదు టైటిళ్లు అందించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో కొన్ని మ్యాచ్‌ల్లో టీమ్‌ఇండియాకు తాత్కాలిక కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. ఒక్క సిరీస్‌తో కెప్టెన్సీలో రోహిత్‌కు తిరుగులేదని చెప్పలేం కానీ.. ఇప్పటికే ఐపీఎల్‌లో, టీమ్‌ఇండియాకు తాత్కాలిక సారథిగా వ్యవహరించినపుడు ఆకట్టుకున్న హిట్‌మ్యాచ్‌ కివీస్‌తో సిరీస్‌లో తన నాయకత్వంపై సానుకూల అభిప్రాయం కలిగించాడు.

ఆ దిశగా..: టీ20ల్లో జట్టు పగ్గాలు చేపట్టిన రోహిత్‌ ముందున్న లక్ష్యం వచ్చే ఏడాది ఇదే ఫార్మాట్లో జరిగే ప్రపంచకప్‌ను అందుకోవడం. ఆ దిశగా జట్టును ఇప్పటి నుంచే సన్నద్ధం చేయాల్సిన అవసరం ఉంది. ఆ టోర్నీకి ముందే అత్యుత్తమ కూర్పును సిద్ధం చేసుకోవాలి. సీనియర్లకు అండగా ఉంటూ.. యువ ఆటగాళ్లకు అవకాశమిస్తూ ముందుకు సాగాలి. తొలి సిరీస్‌లో రోహిత్‌ కూడా ఇదే చేశాడని, తన నాయకత్వ లక్షణాలతో మెప్పించాడనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అశ్విన్‌పై అతను పెట్టిన నమ్మకం వమ్ము కాలేదు. ప్రస్తుత క్రికెట్లో ఎక్కువగా ప్రత్యర్థి బలహీనతలను దృష్టిలో పెట్టుకుని అందుకు అనుగుణంగా మ్యాచ్‌ మ్యాచ్‌కూ తుదిజట్టును మారుస్తున్నారు. కానీ రోహిత్‌ ఆ రకం కాదు. నిలకడగా ఆటగాళ్లకు అవకాశాలిస్తూ ఏ సవాలునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండడమే అతని నైజం. తొలి మ్యాచ్‌లో బౌలర్లు మొదట ఎక్కువగా పరుగులిచ్చినా రోహిత్‌ వాళ్లకు మద్దతుగా నిలబడ్డాడు. దీంతో చివరి ఓవర్లలో మన బౌలర్లు ప్రత్యర్థిని కట్టడి చేశారు. ఆ మ్యాచ్‌లో విఫలమైన అక్షర్‌ చివరి రెండు మ్యాచ్‌ల్లో రాణించాడు. యువ ఆటగాడు వెంకటేశ్‌ అయ్యర్‌కు బ్యాటింగ్‌ అవకాశం కల్పించడం కోసం ముందు పంపించాడు. రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం కారణంగా ఛేదన తేలికగా ఉంటుందని తెలిసినప్పటికీ.. ప్రతికూల పరిస్థితులకు అలవాటు పడేందుకు మూడో మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. జట్టులో రోహిత్‌ అందరితో కలిసిపోతాడని, ఆటగాళ్లతో మాట్లాడేందుకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తాడని, అవతలి వాళ్లు చెప్పేది ధ్యాస పెట్టి వింటాడని.. ఇలా అతని  సారథ్యంలో ఆడిన ఆటగాళ్లు చెబుతున్నారు. జట్టు ప్రయోజనాల కోసం ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవడానికి వెనకాడడనే పేరు కూడా ఉంది. ఆటగాళ్లను సరిగ్గా వాడుకోవడం, సమస్య ఉంటే మాట్లాడటం, సీనియర్లను ఉపయోగించుకోవడం, జూనియర్లకు మార్గనిర్దేశనం చేయడం.. ఇవే కెప్టెన్‌గా రోహిత్‌ ప్రదర్శనకు కారణాలు. ఇప్పుడు టీమ్‌ఇండియా తరపున కూడా అతను ఆ లక్షణాలతోనే దూసుకెళ్లాలన్నది  అభిమానుల ఆకాంక్ష.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని