IND vs NZ: కాన్పూర్‌ టెస్టు.. చేరువై.. దూరమై

ఓ సువర్ణావకాశం చేజారింది..! విజయం ఊరించి ఉస్సూరుమనిపించింది! బౌలర్లు చివరి ఒక్క వికెట్‌నూ   పడగొట్టలేకపోయిన వేళ.. రసవత్తర పోరులో టీమ్‌ఇండియాకు నిరాశ. కాన్పూర్‌లో తొలి టెస్టు డ్రా. పిచ్‌ నుంచి అంతగా సహకారం లభించకపోయినా స్పిన్నర్లు తొమ్మిది వికెట్లు పడగొట్టి భారత్‌ను విజయం అంచున నిలిపితే.

Updated : 30 Nov 2021 07:03 IST

టీమ్‌ ఇండియాకు నిరాశ
ఆఖరి జంట రచిన్‌, అజాజ్‌ల అద్భుత పోరాటం
రసవత్తర పోరులో డ్రాతో గట్టెక్కిన కివీస్‌

కాన్పూర్‌

ఓ సువర్ణావకాశం చేజారింది..! విజయం ఊరించి ఉస్సూరుమనిపించింది! బౌలర్లు చివరి ఒక్క వికెట్‌నూ   పడగొట్టలేకపోయిన వేళ.. రసవత్తర పోరులో టీమ్‌ఇండియాకు నిరాశ. కాన్పూర్‌లో తొలి టెస్టు డ్రా. పిచ్‌ నుంచి అంతగా సహకారం లభించకపోయినా స్పిన్నర్లు తొమ్మిది వికెట్లు పడగొట్టి భారత్‌ను విజయం అంచున నిలిపితే.. తీవ్ర ఒత్తిడిలో మేటి స్పిన్నర్లకు ఎదురొడ్డుతూ ఆఖరి జంట రచిన్‌ రవీంద్ర, అజాజ్‌ పటేల్‌లు 8.4 ఓవర్లు పోరాడి చిరస్మరణీయ రీతిలో న్యూజిలాండ్‌ను గట్టెక్కించారు. వెలుతురులేమి కారణంగా 12 నిమిషాల ముందే మ్యాచ్‌ ముగిసింది. అయిదు రోజులపాటు మ్యాచ్‌ ఆసక్తికరంగా సాగేలా స్పోర్టింగ్‌ పిచ్‌ను రూపొందించిన క్యురేటర్‌కు టీమ్‌ఇండియా కొత్త కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ రూ.35 వేల నగదు బహుమతిని ప్రకటించడం విశేషం.

ఎంతో శ్రమించినా టీమ్‌ఇండియాకు తొలి టెస్టులో నిరాశ తప్పలేదు. విజయం కొద్దిలో చేజారింది. క్లిష్టపరిస్థితుల్లో గొప్పగా పోరాడిన న్యూజిలాండ్‌, ఓటమిని తప్పించుకుని మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. 284 పరుగుల లక్ష్య ఛేదనలో ఓవర్‌నైట్‌ స్కోరు 4/1తో చివరి రోజు, సోమవారం రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన కివీస్‌.. ఆట చివరికి 9 వికెట్లకు 165 పరుగులు చేసింది. జడేజా (4/40), అశ్విన్‌ (3/35) విజృంభణతో కచ్చితంగా గెలిచేలా కనిపించిన భారత్‌.. విజయానికి ఒక్క వికెట్‌ దూరంలో నిలిచిపోయింది. దృఢ సంకల్పంతో ఆడిన అరంగేట్ర ఆటగాడు రచిన్‌ రవీంద్ర (18 నాటౌట్‌; 91 బంతుల్లో 2×4), ఆఖరి బ్యాట్స్‌మన్‌ అజాజ్‌ పటేల్‌ (2 నాటౌట్‌; 23 బంతుల్లో) భారత్‌కు విజయానికి మధ్య అడ్డుగా నిలిచారు. లేథమ్‌ (52; 146 బంతుల్లో 3×4), నైట్‌వాచ్‌మన్‌ సోమర్‌విలే (36; 110 బంతుల్లో 5×4) కూడా కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. శ్రేయస్‌ అయ్యర్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. చివరిదైన రెండో టెస్టు శుక్రవారం ఆరంభమవుతుంది.

మన ఆరాటం.. వాళ్ల పోరాటం: ఓ వైపు దుర్భేద్యమైన డిఫెన్స్‌తో డ్రా కోసం పోరాడుతున్న ఆఖరి జంట.. మరోవైపు ఫీల్డర్లనంతా బ్యాట్స్‌మెన్‌ చుట్టూ మోహరించి విజయాన్నిచ్చే ఆ ఒక్క వికెట్‌ కోసం ఆరాటపడుతున్న టీమ్‌ఇండియా. ఇంకోవైపు పదే పదే వెలుతురు చూస్తున్న అంపైర్లు. అంతా ఉత్కంఠ. అయిదో రోజు ఆఖరి అరగంట ఆట రసవత్తరంగా సాగింది. నిజానికి తొమ్మిదో వికెట్‌గా సౌథీని జడేజా వెనక్కి పంపడంతోనే భారత్‌ గెలవబోతోందని అనుకున్నారంతా! ఓ మంచి బంతి పడితే మ్యాచ్‌ ముగస్తుందన్న భావన. ఆ విషయంలో ఎవరికీ సందేహాలు లేవు. మరో 40 నిమిషాలకు పైగా ఆట మిగిలి ఉన్న నేపథ్యంలో స్పిన్నర్లు ఫలితం రాబట్టగలరని అనిపించింది. కానీ ఆ రోజు రచిన్‌ రవీంద్ర, అజాజ్‌ పటేల్‌లది. అశ్విన్‌, జడేజా, పరీక్షిస్తున్నా.. చుట్టూ ఫీల్డర్లే ఉన్నా ఏమాత్రం చలించక వాళ్లు పట్టుదలతో అసమాన పోరాట పటిమను ప్రదర్శించారు. ఉత్కంఠకు నిలుస్తూ 52 బంతులను సమర్థంగా ఎదుర్కొని న్యూజిలాండ్‌కు చిరస్మరణీయ డ్రాను అందించారు ఈ స్పిన్నర్లు. నిజానికి రచిన్‌ పోరాటం ఇంకా చాలా ముందే మొదలైంది. క్రీజులో చాలా సౌకర్యంగా కనిపించిన అతడు.. దుర్భేద్యమైన డిఫెన్స్‌తో భారత బౌలర్లకు ఎలాంటి అవకాశమూ ఇవ్వలేదు. స్పిన్నర్లెవరూ అతడి ఏకాగ్రతను దెబ్బతీయలేకపోయారు. ఎనిమిదో స్థానంలో వచ్చిన రచిన్‌ ఓపిగ్గా బ్యాటింగ్‌ చేస్తూ, ఓవర్లపై ఓవర్లు కరగదీస్తూ వచ్చాడు.   ఫ్లైటెడ్‌, క్వికర్‌ బంతులతో జడేజా.. ఓవర్‌ ద వికెట్‌ నుంచి అరౌండ్‌ ద వికెట్‌కు మారుతూ అశ్విన్‌ అతణ్ని పరీక్షించారు. కానీ అతడు చక్కని ఫుట్‌వర్క్‌తో పరీక్షకు నిలిచాడు.  అజాజ్‌ పటేల్‌ వచ్చేటప్పటికే రచిన్‌ 62 బంతులాడేశాడు. కనీసం అజాజ్‌నైనా ఔట్‌ చేయొచ్చనుకుంటే అతడు కూడా గొప్పగా డిఫెన్స్‌ ఆడాడు. అశ్విన్‌, జడేజా ఎంత ప్రయత్నించినప్పటికీ ఫలితం    లేకపోయింది. ఓవర్లు సాగుతున్నకొద్దీ కివీస్‌ ఆఖరి జంట మరింత ఆత్మవిశ్వాసంతో ఆడిందే కానీ.. ఇబ్బంది పడలేదు. ఎటాకింగ్‌ బౌలింగ్‌తో వికెట్లు సాధించగలిగారు కానీ.. నిజానికి భారత స్పిన్నర్లకు ఆఖరి రోజు పిచ్‌ అంతగా కలిసి రాలేదు.    బంతి తక్కువ ఎత్తే లేచినా.. స్లోగా టర్న్‌ కావడంతో బ్యాట్స్‌మెన్‌ పని తేలికైంది. వెలుతురు తగ్గకుండా ఉంటే మరో 12 నిమిషాల పాటు ఆట సాగేది.

రాణించిన లేథమ్‌, సోమర్‌విలే..: ఆఖర్లో రచిన్‌, అజాజ్‌ల అద్వితీయ పోరాటం అందరి మన్ననలు పొంది ఉండొచ్చు. కానీ లేథమ్‌, నైట్‌వాచ్‌మన్‌ సోమర్‌విలేలు కూడా కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. డ్రాపై మొదట ఆశలు రేకెత్తించిందే వీళ్లు. ఈ ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మెన్‌ ఉదయం సెషన్‌ అంతా ఆడారు. లంచ్‌ సమయానికి కివీస్‌ స్కోరు 82/1. అయితే రెండో సెషన్‌లో భారత్‌ పుంజుకుంది. లంచ్‌ తర్వాత తొలి బంతికే ఉమేశ్‌ కివీస్‌ను దెబ్బతీశాడు. ఓ షార్ట్‌ బంతితో సోమర్‌విలేను బోల్తా కొట్టించాడు. ముందుకు దూకుతూ శుభ్‌మన్‌ అందుకున్న చక్కని క్యాచ్‌కు సోమర్‌విలే నిష్క్రమించాడు. అయితే క్రీజులోకి వచ్చిన విలియమ్సన్‌ (24; 112 బంతుల్లో 3×4) ఎలాంటి తడబాటు లేకుండా బ్యాటింగ్‌ చేశాడు. లేథమ్‌ డిఫెన్సివ్‌ గేమ్‌ను కొనసాగించాడు. పరుగులు ఎక్కువ చేయకపోయినా.. ఈ జంట ఎక్కువ బంతులు ఆడేసింది. చివరికి లేథమ్‌ను బౌల్డ్‌ చేయడం ద్వారా ఈ భాగస్వామ్యాన్ని అశ్విన్‌ విడదీశాడు. రాస్‌ టేలర్‌ (2)ను జడేజా ఎక్కువసేపు నిలవనివ్వలేదు. అతణ్ని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అక్కడే జట్లు టీ విరామానికి వెళ్లాయి. అప్పటికి స్కోరు 125/4. స్పిన్నర్లు విజృంభించడంతో టీ తర్వాత కివీస్‌ పతనం కొనసాగింది.. నికోల్స్‌ (1)ను అక్షర్‌.. క్రీజులో నిలదొక్కుకున్న విలియమ్సన్‌ను జడేజా వికెట్లు ముందు దొరకబుచ్చుకున్నారు. అయితే బ్లండెల్‌ (38 బంతుల్లో 2), జేమీసన్‌ (30 బంతుల్లో 5) ఎక్కువ పరుగులేమీ చేయలేదు. కానీ విలువైన సమయం క్రీజులో గడిపారు. బ్లండెల్‌ను అశ్విన్‌ బౌల్డ్‌ చేయగా.. జేమీసన్‌ను జడేజా ఎల్బీగా వెనక్కి పంపాడు. వీళ్లిద్దరి ప్రతిఘటన తర్వాత కూడా భారత్‌కు మ్యాచ్‌లో విజయావకాశాలు మెరుగ్గానే ఉన్నాయి. సౌథీ (4)ని త్వరగా ఔట్‌ చేసి విజయానికి మరింత చేరువైంది ఆతిథ్య జట్టు.. కానీ రచిన్‌, అజాజ్‌ పోరాటంతో గెలుపు దూరమైంది. భారత స్పిన్నర్లు బాగానే బౌలింగ్‌ చేసినా.. పిచ్‌ నుంచి సరైన సహకారం లభించకపోవడం ప్రతికూలంగా మారింది.

అయిదో రోజు కీపింగ్‌కూ సాహా దూరం: భారత వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా మెడనొప్పి కారణంగా అయిదో రోజు ఆటకూ దూరమయ్యాడు. సోమవారం అతను మైదానంలో అడుగుపెట్టలేదు. మెడనొప్పితో శనివారం వికెట్‌ కీపింగ్‌కు దూరంగా ఉన్న సాహా.. ఆదివారం భారత్‌ కష్టాల్లో ఉన్నప్పుడు మంచి ఇన్నింగ్స్‌ (61 నాటౌట్‌)తో రాణించాడు. తొలి టెస్టులో సాహాకు సబ్‌స్టిట్యూట్‌గా  అత్యధిక సమయం మైదానంలో ఉన్న ఆంధ్ర వికెట్‌ కీపర్‌ శ్రీకర్‌ భరత్‌ వికెట్ల వెనుక అద్భుతంగా ఆకట్టుకున్నాడు.


2  

భారత్‌ గతంలో రెండు సందర్భాల్లో టెస్టు విజయానికి వికెట్‌ దూరంలో ఆగిపోయింది.


7 

 అరంగేట్ర టెస్టులోనే ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు అందుకున్న ఏడో భారత బ్యాట్స్‌మన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌ ఘనత సాధించాడు


10  

గత పది టెస్టుల్లో న్యూజిలాండ్‌ ఓడిపోలేదు. ఎనిమిది గెలిచి, రెండింటిని డ్రాగా ముగించింది.


భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 345
న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 296
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: 234/7 డిక్లేర్డ్‌

న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌: లేథమ్‌ (బి) అశ్విన్‌ 52; యంగ్‌ ఎల్బీ (బి) అశ్విన్‌ 2; సోమర్‌విలే (సి) గిల్‌ (బి) ఉమేశ్‌ 36; విలియమ్సన్‌ ఎల్బీ (బి) జడేజా 24; టేలర్‌ ఎల్బీ (బి) జడేజా 2; నికోల్స్‌ ఎల్బీ (బి) అక్షర్‌ 1; బ్లండెల్‌ ((బి) అశ్విన్‌ 2; రచిన్‌ రవీంద్ర నాటౌట్‌ 18; జేమీసన్‌ ఎల్బీ (బి) జడేజా 5; సౌథీ ఎల్బీ (బి) జడేజా 4; అజాజ్‌ పటేల్‌ నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 17 మొత్తం: (98 ఓవర్లలో 9 వికెట్లకు) 165
వికెట్ల పతనం: 1-3, 2-79, 3-118, 4-125, 5-126, 6-128, 7-138, 8-147, 9-155
బౌలింగ్‌: అశ్విన్‌ 30-12-35-3; అక్షర్‌ పటేల్‌ 21-12-23-1; ఉమేశ్‌ 12-2-34-1; ఇషాంత్‌ 7-1-20-0; జడేజా 28-10-40-4

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని