Virat Kohli : ముగిస్తున్నా..

‘‘జట్టును సరైన దిశగా నడిపించడానికి ఏడేళ్లు ఎంతో శ్రమించా. శక్తివంచన లేకుండా, నిజాయితీగా విధులు నిర్వర్తించా. ఏదైనా ఏదో ఒక దశలో ఆగిపోవాల్సిందే. టెస్టు కెప్టెన్‌గా ఇప్పుడు నా కథ ముగిసింది. ఈ ప్రయాణంలో ఎన్నో ఎత్తులను, కొన్ని పల్లాలను చూశా.

Updated : 17 Jan 2022 14:51 IST

టెస్టు కెప్టెన్సీకి కోహ్లి వీడ్కోలు

‘‘జట్టును సరైన దిశగా నడిపించడానికి ఏడేళ్లు ఎంతో శ్రమించా. శక్తివంచన లేకుండా, నిజాయితీగా విధులు నిర్వర్తించా. ఏదైనా ఏదో ఒక దశలో ఆగిపోవాల్సిందే. టెస్టు కెప్టెన్‌గా ఇప్పుడు నా కథ ముగిసింది. ఈ ప్రయాణంలో ఎన్నో ఎత్తులను, కొన్ని పల్లాలను చూశా. కానీ ప్రయత్నం లోపం ఎప్పుడూ లేదు. ఏ దశలోనూ నమ్మకాన్ని కోల్పోలేదు. ఎల్లప్పుడూ జట్టు కోసం 120 శాతం ఇవ్వాలనే అనుకున్నా. అలా అనుకోలేదంటే ఏదో తప్పు చేస్తున్నట్లే. ఇంత సుదీర్ఘకాలం జట్టును నడిపించే అవకాశమిచ్చిన బీసీసీఐకి కృతజ్ఞతలు. ముఖ్యంగా నా సహచరులకు కృతజ్ఞతలు. నా ఈ ప్రయాణం ఇంత అందంగా, ఎప్పటికీ గుర్తుండేదిగా సాగిందంటే కారణం వాళ్లే. టెస్టు క్రికెట్లో నిలకడగా ముందుకు సాగిన ఈ వాహనానికి ఇంజిన్‌గా ఉన్న రవి భాయ్‌, సహాయ సిబ్బందికీ నా కృతజ్ఞతలు. చివరగా ధోనీకి నా ధన్యవాదాలు. నాలో ఉన్న కెప్టెన్‌ను అతడు నమ్మాడు. భారత క్రికెట్‌ను నేను ముందుకు తీసుకెళ్లగలిగే వ్యక్తిగా అతడు నన్ను గుర్తించాడు’’

- విరాట్‌ కోహ్లి


‘‘జట్టుకు కోహ్లి చేసిన సేవలకు ధన్యవాదాలు. అతని సారథ్యంలో జట్టు అన్ని ఫార్మాట్లలోనూ అత్యుత్తమంగా ఎదిగింది. టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలన్నది అతని వ్యక్తిగత నిర్ణయం. దీన్ని బీసీసీఐ గౌరవిస్తోంది. ఆటగాడిగా భవిష్యత్‌లో జట్టును మరిన్ని శిఖరాలకు చేర్చేందుకు అతనెంతో ముఖ్యం’’

- సౌరభ్‌ గంగూలీ


‘‘కెప్టెన్‌గా విజయవంతమైన నీ (కోహ్లి) ప్రస్థానానికి అభినందనలు. జట్టు కోసం నువ్వెప్పుడూ వందశాతం కష్టపడ్డావు. ఇక ముందు అదే చేస్తావు. నీ భవిష్యత్‌ బాగుండాలని కోరుకుంటున్నా’’

- సచిన్‌


‘‘భారత కెప్టెన్‌గా నీ అద్భుతమైన ప్రయాణానికి అభినందనలు. ఇప్పటివరకూ సాధించిన ఘనతల పట్ల నువ్వు గర్వపడాలి. ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ నాయకుల జాబితాలో నీ పేరు కచ్చితంగా ఉంటుంది’’

- వివియన్‌ రిచర్డ్స్‌


‘‘ధోని టెస్టు క్రికెట్‌ నుంచి రిటైరవాలని నిర్ణయించుకున్నాడని, నువ్వు (విరాట్‌) టెస్టు కెప్టెన్‌ అయ్యావని 2014లో చెప్పిన రోజు ఇప్పటికీ గుర్తుంది. అప్పటి నుంచి నీ లోపల, చుట్టూ ఎదుగుదల చూస్తునే ఉన్నా. భారత జట్టు కెప్టెన్‌గా నీ ఎదుగుదల పట్ల ఎంతో గర్వపడుతున్నా. అంతకంటే ఎక్కువ నీ లోపల వచ్చిన మార్పుల పట్ల సంతోషంగా ఉన్నా. మైదానంలో విజయం కోసం నీ శక్తినంతా ధారబోశావు. కొన్నిసార్లు ఓటమి ఎదురైనపుడు పక్కనే ఉండి నీ కళ్లలో నీళ్లు చూశా’’

- అనుష్క శర్మ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు