PV Sindhu : సింధు టైటిళ్ల కరవు తీరేనా

రెండు సార్లు ఒలింపిక్‌ పతక విజేత, భారత స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధు మరో టోర్నీకి సిద్ధమైంది. ఇండియా ఓపెన్‌లో  ఊహించని ఓటమితో కంగుతిన్న ఆమె.. మంగళవారం ఆరంభమయ్యే సయ్యద్‌ మోదీ ఇంటర్నేషనల్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతోంది. అంతర్జాతీయ స్థాయిలో టైటిళ్ల కరవుకు తెరదించాలని భావిస్తోంది.

Updated : 18 Jan 2022 12:50 IST

సయ్యద్‌ మోదీ బ్యాడ్మింటన్‌ నేటినుంచే
వైదొలగిన సైనా, లక్ష్యసేన్‌, సాత్విక్‌ జోడీ

లఖ్‌నవూ: రెండు సార్లు ఒలింపిక్‌ పతక విజేత, భారత స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధు మరో టోర్నీకి సిద్ధమైంది. ఇండియా ఓపెన్‌లో  ఊహించని ఓటమితో కంగుతిన్న ఆమె.. మంగళవారం ఆరంభమయ్యే సయ్యద్‌ మోదీ ఇంటర్నేషనల్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతోంది. అంతర్జాతీయ స్థాయిలో టైటిళ్ల కరవుకు తెరదించాలని భావిస్తోంది. నిరుడు స్విస్‌ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచి, ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌లో ఫైనల్‌ చేరిన సింధు.. ఈ టోర్నీలో ఫేవరెట్‌గా బరిలో దిగుతోంది. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో తాన్యా హేమంత్‌తో టాప్‌ సీడ్‌ సింధు తలపడుతుంది. మరో స్టార్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ పూర్తి ఫిట్‌నెస్‌ సాధించని కారణంగా ఈ టోర్నీకి దూరంగా ఉంది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యంతో మెరిసి.. ఆదివారం ఇండియా ఓపెన్‌ టైటిల్‌ దక్కించుకున్న యువ షట్లర్‌ లక్ష్యసేన్‌ కూడా ఈ పోటీల నుంచి తప్పుకున్నాడు. ‘‘ఇండియా ఓపెన్‌ ముగిసిన తర్వాత బాగా అలసిపోయా. ఈ టోర్నీలో నా ఆటకు న్యాయం చేయలేనన్న భయంతో ఉన్నా. కోచ్‌లు,   ఫిజియోలు, కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత టోర్నీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా’’ అని లక్ష్యసేన్‌ తెలిపాడు. ఇండియా ఓపెన్‌లో టైటిల్‌ సాధించిన భారత అగ్రశ్రేణి డబుల్స్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజు-   చిరాగ్‌శెట్టి సైతం టోర్నీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఇండియా ఓపెన్‌లో పాజిటివ్‌గా తేలిన భారత స్టార్‌ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్‌ వారం రోజుల తప్పనిసరి క్వారంటైన్‌లో ఉండటంతో ఈ టోర్నీలో ఆడలేకపోతున్నాడు. కరోనా నుంచి కోలుకుంటున్న డబుల్స్‌ ప్లేయర్లు అశ్విని పొన్నప్ప, మను  అత్రిలతో పాటు సాయి ప్రణీత్‌ కూడా బరిలో దిగే అవకాశం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని