ఫైనల్లో సింధు

అంతర్జాతీయ టైటిళ్ల కరవుకు ముగింపు పలికేందుకు భారత అగ్రశ్రేణి షట్లర్‌ పీవీ సింధు చేరువైంది. సయ్యద్‌ మోదీ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ సూపర్‌ 300 టోర్నీలో ఆమె ఫైనల్లో అడుగుపెట్టింది. శనివారం సెమీస్‌లో ప్రత్యర్థి ఎవ్‌గెనియా

Published : 23 Jan 2022 01:58 IST

మాళవికతో నేడు తుదిపోరు
లఖ్‌నవూ

అంతర్జాతీయ టైటిళ్ల కరవుకు ముగింపు పలికేందుకు భారత అగ్రశ్రేణి షట్లర్‌ పీవీ సింధు చేరువైంది. సయ్యద్‌ మోదీ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ సూపర్‌ 300 టోర్నీలో ఆమె ఫైనల్లో అడుగుపెట్టింది. శనివారం సెమీస్‌లో ప్రత్యర్థి ఎవ్‌గెనియా కొసెత్సకయా (రష్యా) మధ్యలోనే తప్పుకోవడంతో టాప్‌ సీడ్‌ సింధు  విజయాన్ని అందుకుంది. తొలి గేమ్‌ను 21-11తో ఈ తెలుగు తేజం గెలుచుకున్న తర్వాత.. అయిదో సీడ్‌ ఎవ్‌గెనియా పోరు నుంచి వైదొలిగింది. తొలి గేమ్‌లో ఆరంభం నుంచే సింధు ఆధిపత్యం చలాయించింది. దూకుడుతో షాట్లు ఆడుతూ.. పాయింట్లు రాబట్టింది. విరామ సమయానికి 11-4తో ఆధిక్యంలో నిలిచిన ఆమె.. ఆ తర్వాత కూడా జోరు కొనసాగించింది. ఆదివారం టైటిల్‌ పోరులో ఆమె.. భారత్‌కే చెందిన మాళవికతో తలపడుతుంది. మరో  సెమీస్‌లో మాళవిక 19-21, 21-19, 21-7తో సహచర షట్లర్‌ అనుపమపై నెగ్గింది. ఫామ్‌, ప్రపంచ ర్యాంకింగ్స్‌, పరస్పరం మ్యాచ్‌ విజయాలు.. ఇలా ఎలా చూసినా మాళవికపై మంచి రికార్డు ఉన్న సింధు ఈ టైటిల్‌ గెలవడం ఖాయంగా కనిపిస్తోంది! మహిళల డబుల్స్‌లో గాయత్రి పుల్లెల- ట్రీసా జాలీ జోడీ ఫైనల్‌ చేరింది. సెమీస్‌లో ఈ ఏడో సీడ్‌ భారత జోడీ 17-21, 21-8, 21-16తో యువాన్‌- వెలెరీ (మలేసియా)పై నెగ్గింది. టైటిల్‌ పోరులో ఈ జోడీ చింగ్‌- జింగ్‌ (మలేసియా)ను ఢీ కొడుతుంది. మరోవైపు పురుషుల డబుల్స్‌ సెమీస్‌లో కృష్ణ ప్రసాద్‌- విష్ణువర్ధన్‌ జంట 21-10, 21-9తో ప్రేమ్‌ సింగ్‌- రాజేశ్‌పై పైచేయి సాధించింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఇషాన్‌- తనీషా, నాగేంద్ర- శ్రీవేద్య జోడీలు తుదిపోరుకు సిద్ధమయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని