ఛాంపియన్‌ సింధు

రెండుసార్లు ఒలింపిక్‌ పతక విజేత, భారత స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధు ఖాతాలో మరో టైటిల్‌ చేరింది. సయ్యద్‌ మోదీ అంతర్జాతీయ సూపర్‌ 300 టోర్నీలో సింధు విజేతగా నిలిచింది.

Published : 24 Jan 2022 05:11 IST

ఫైనల్లో మాళవికపై విజయం

సయ్యద్‌ మోదీ అంతర్జాతీయ టోర్నీ

లఖ్‌నవూ: రెండుసార్లు ఒలింపిక్‌ పతక విజేత, భారత స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధు ఖాతాలో మరో టైటిల్‌ చేరింది. సయ్యద్‌ మోదీ అంతర్జాతీయ సూపర్‌ 300 టోర్నీలో సింధు విజేతగా నిలిచింది. ఆదివారం ఏకపక్షంగా సాగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ సింధు 21-13, 21-16తో భారత యువ క్రీడాకారిణి మాళవిక బాన్సోద్‌పై విజయం సాధించింది. ఈ టోర్నీలో విజేతగా నిలవడం సింధుకిది రెండోసారి. 2017లోనూ సింధు టైటిల్‌ గెలుచుకుంది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఇషాన్‌ భట్నాగర్‌-తనిషా క్రాస్టో జోడీ 21-16,    21-12తో హేమ నాగేంద్రబాబు- శ్రీవేద్య గురజాడ జంటపై గెలిచి టైటిల్‌ సొంతం చేసుకుంది. మహిళల డబుల్స్‌లో గాయత్రి గోపీచంద్‌ పుల్లెల- ట్రీసా జాలీ జోడీ 12-21, 13-21తో చింగ్‌ చియాంగ్‌- తియో షింగ్‌ (మలేసియా) జంట చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. పురుషుల డబుల్స్‌లో కృష్ణ ప్రసాద్‌- విష్ణువర్ధన్‌గౌడ్‌ జోడీ 18-21, 15-21తో మాన్‌ చాంగ్‌- వున్‌ తీ (మలేసియా) జంట చేతిలో ఓడి రజత పతకం సాధించింది. ఫ్రాన్స్‌కు చెందిన ఆర్నాడ్‌ మెర్కెల్‌, లూకాస్‌ క్లేర్‌బౌట్‌లలో ఒకరు పాజిటివ్‌గా తేలడంతో వీరిద్దరి మధ్య జరగాల్సిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌ రద్దయింది.

టోర్నీలో కరోనా పాజిటివ్‌ కేసుల భయం వెంటాడుతున్నా.. సింధు మాత్రం పూర్తి ఏకాగ్రతతో మ్యాచ్‌లు ఆడింది. తొలి రౌండ్‌ నుంచి ఫైనల్‌ వరకు సంపూర్ణ ఆధిపత్యం కనబరిచింది. ఫైనల్లో సింధు విశ్వరూపమే చూపించింది. కేవలం 35 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించింది. స్మాష్‌లు, క్రాస్‌కోర్ట్‌ స్మాష్‌లతో విరుచుకుపడిన సింధుకు ప్రత్యర్థి నుంచి పోటీనే ఎదురవలేదు. దూకుడుగా మ్యాచ్‌ను ప్రారంభించిన సింధు తొలి గేమ్‌లో 11-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మధ్యలో సింధు అనవసర తప్పిదాలు మాళవికకు కలిసొచ్చాయి. అయితే ఆటపై సంపూర్ణ ఆధిపత్యంతో సాగిపోయిన సింధు 21-13తో తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లోనూ సింధు జోరు తగ్గలేదు. 11-4తో ఆధిక్యం సంపాదించిన సింధు 17-12తో రెండో గేమ్‌కు చేరువైంది. చూస్తుండగానే 21-16తో రెండో గేమ్‌, మ్యాచ్‌ను గెలుచుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని