IND vs SA : అవును.. సమతూకం లేదు

దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ సందర్భంగా భారత జట్టులో సమతూకం కనిపించని మాట వాస్తవమే అని కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అంగీకరించాడు. హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా లాంటి ఆల్‌రౌండర్లు అందుబాటులో లేకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందన్నాడు.

Updated : 25 Jan 2022 09:09 IST

టీమ్‌ఇండియా కోచ్‌ ద్రవిడ్‌

హార్దిక్‌, జడేజా లేకపోవడం లోటే

భరోసా ఇస్తున్నాం..  సత్తా చాటాలి కదా

కేప్‌టౌన్‌

దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ సందర్భంగా భారత జట్టులో సమతూకం కనిపించని మాట వాస్తవమే అని కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అంగీకరించాడు. హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా లాంటి ఆల్‌రౌండర్లు అందుబాటులో లేకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందన్నాడు. ఈ సిరీస్‌లో టీమ్‌ఇండియా వైట్‌వాష్‌కు గురైన నేపథ్యంలో జట్టులోని సమస్యలు, ఇతర అంశాలపై ద్రవిడ్‌ మీడియాతో మాట్లాడాడు. ఆ విశేషాలు అతడి మాటల్లోనే..

ట్టుకు సమతూకం అన్నది చాలా ముఖ్యమైన విషయం. నిజాయితీగా చెప్పాలంటే ప్రస్తుతం భారత వన్డే జట్టులో సమతూకం సమస్యగా మారిన మాట వాస్తవం. ఆ సమతూకం తెచ్చే ఆటగాళ్ల సేవల్ని భారత్‌ కోల్పోయింది. 6, 7, 8 స్థానాల్లో ఆల్‌రౌండర్లు ఉంటే బాగుంటుంది. కానీ ఆ స్థానాలను భర్తీ చేసే ఆటగాళ్లు వివిధ కారణాలతో అందుబాటులో లేరు. హార్దిక్‌, జడేజా తిరిగి జట్టులోకి వస్తే సమతూకంతో పాటు, జట్టు బలం పెరగొచ్చు. ఆరో బౌలింగ్‌ ప్రత్యామ్నాయంగా వెంకటేశ్‌ అయ్యర్‌ను తీర్చిదిద్దాలనుకుంటున్నాం. అతనైనా, హార్దిక్‌ అయినా ఆ స్థానాన్ని భర్తీ చేయాలి. జడేజా కూడా వస్తే మాకు ప్రత్యామ్నాయాలు పెరుగుతాయి’’

రాహుల్‌ బాగానే చేశాడు: కెప్టెన్‌గా రాహుల్‌ మంచి పనితీరే కనబరిచాడు. ఓడిన జట్టు వైపు ఉండటం అంత తేలిక కాదు. అతను కెప్టెన్‌గా తన ప్రయాణాన్ని ఇప్పుడే మొదలుపెట్టాడు. మున్ముందు, మెరుగైన జట్టు అందుబాటులో ఉన్నపుడు అతడికి నాయకత్వ మెలకువల గురించి బాగా తెలుస్తుంది. వన్డేల్లో మేం ఆశించిన ప్రదర్శన చేయలేకపోయాం. జట్టులో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. అయినా సరే.. రాహుల్‌ కెప్టెన్‌గా బాగానే చేశాడనుకుంటున్నా. అతను సారథిగా ఎదుగుతాడు.

పోటీ ఉన్నపుడు ఆడాల్సిందే: ఆటగాళ్లకు జట్టులో స్థానం విషయంలో భరోసా ఇస్తున్నాం. వరుసగా అవకాశాలు ఇస్తున్నాం. కానీ ఇవి కోరుకునే వాళ్ల నుంచి నిలకడైన ఆట, గొప్ప ప్రదర్శనలు ఆశించడం సహజం. ఆటగాళ్లు అది చేయాలి. 4, 5, 6.. ఇలా ఏ స్థానంలో ఆడినా జట్టు ఏం ఆశిస్తుందో అది ఇవ్వాలి. శ్రేయస్‌ అయ్యర్‌ క్రీజులో అవసరమైనంత సమయం గడిపాక ఔటైపోవడం నిరాశ కలిగించింది. వీళ్లంతా ప్రతిభావంతులని తెలుసు. అందుకే అవసరమైనంత మద్దతు ఇస్తున్నాం. జట్టులో స్థానం కోసం విపరీతమైన పోటీ ఉన్నపుడు.. అవకాశం అందుకున్న వాళ్లు సత్తా చాటాల్సిందే.

ఆ రెండూ గెలవాల్సింది: వన్డే సిరీస్‌లో మధ్య ఓవర్లలో మా వాళ్లింకా మెరుగ్గా బ్యాటింగ్‌ చేయాల్సింది. తొలి, చివరి వన్డేల్లో దక్షిణాఫ్రికా 290కి అటు ఇటుగా పరుగులు చేసింది. ఈ రెండు మ్యాచ్‌ల్లో మేం 30వ ఓవర్‌ వరకు ఉన్న స్థితిని చూసుకుంటే కచ్చితంగా రెండు మ్యాచ్‌లనూ గెలవాల్సింది. కొన్ని పేలవ షాట్ల వల్ల.. కీలక సమయాల్లో తెలివిగా ఆడకపోవడం వల్ల ఓటములు చవిచూశాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని