ఫుట్‌బాల్‌ స్టేడియంలో విషాదం

కామెరూన్‌లో దారుణం చోటు చేసుకుంది. ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ చూసేందుకు వచ్చిన అభిమానుల మధ్య తొక్కిసలాట చోటు చేసుకుని ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 40 మంది దాకా గాయాల పాలయ్యారు. ఆసుపత్రిలో ఉన్న క్షతగాత్రుల్లో ఏడుగురి పరిస్థితి  విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Published : 26 Jan 2022 04:42 IST

కామెరూన్‌లో దారుణం
తొక్కిసలాటలో ఎనిమిది మంది మృతి
యవూండె

కామెరూన్‌లో దారుణం చోటు చేసుకుంది. ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ చూసేందుకు వచ్చిన అభిమానుల మధ్య తొక్కిసలాట చోటు చేసుకుని ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 40 మంది దాకా గాయాల పాలయ్యారు. ఆసుపత్రిలో ఉన్న క్షతగాత్రుల్లో ఏడుగురి పరిస్థితి  విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆఫ్రికాలో ఫుట్‌బాల్‌ మైకంతో ఊగిపోయే దేశాల్లో కామెరూన్‌ ఒకటి. ఆఫ్రికాలో ప్రతిష్ఠాత్మక టోర్నీ అయిన ఆఫ్రికన్‌ కప్‌ ఆఫ్‌ నేషన్స్‌ సాకర్‌ టోర్నమెంట్‌కు కామెరూన్‌ ప్రస్తుతం ఆతిథ్యమిస్తోంది. ఎన్నో ప్రయత్నాల తర్వాత 50 ఏళ్ల అనంతరం ఆ దేశానికి ఈ టోర్నీ నిర్వహించే అవకాశం వచ్చింది. ఇలాంటి టోర్నీలో సోమవారం కామెరోస్‌తో తమ జట్టు కీలకమైన నాకౌట్‌ మ్యాచ్‌ ఆడుతుండటంతో అభిమానుల్లో అమితాసక్తి నెలకొంది. కామెరూన్‌ రాజధాని యవూండెలోని ఒలీంబె స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు ప్రేక్షకులు ఎగబడ్డారు. కొవిడ్‌ దృష్ట్యా కొంత కాలంగా కామెరూన్‌లోని సాకర్‌ స్టేడియాల్లోకి 60 శాతం మేరకే అభిమానులను అనుమతిస్తున్నారు. కానీ సోమవారం నాటి మ్యాచ్‌కున్న ప్రాధాన్యం దృష్ట్యా స్టేడియం సామర్థ్యంలో 80 శాతం మేర ప్రేక్షకులను  అనుమతించాలని నిర్ణయించారు. అమ్మకానికి ఉంచిన టికెట్లన్నీ అయిపోయాయి. అయితే స్టేడియంలోని సౌత్‌ గేట్‌ వద్ద లోనికి వెళ్లేందుకు వందల మంది చేరుకోగా.. గేట్‌ తెరవడంలో ఆలస్యం జరిగినట్లు తెలుస్తోంది. సెక్యూరిటీ సిబ్బంది గేట్‌ తెరవగానే వందలమంది ఒక్కసారిగా లోని వెళ్లేందుకు ప్రయత్నం, చేయడం.. ద్వారం చిన్నదిగా ఉండటంతో తొక్కిసలాట చోటు చేసుకుని నిమిషాల్లో దారుణాలు జరిగిపోయాయి. మ్యాచ్‌ చూసేందుకు టికెట్లు కొని వచ్చిన వారికి తోడు.. టికెట్లు లేని వాళ్లు కూడా పెద్ద ఎత్తున స్టేడియానికి వచ్చేందుకు ప్రయత్నించారని.. వారిలోంచి ఒక సమూహం టికెట్లతో వేచి ఉన్న అభిమానులను తోసుకుంటూ ముందుకు దూసుకెళ్లడంతో సమస్య పెద్దదైందని కూడా వార్తలు వస్తున్నాయి. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉన్నట్లు వెల్లడైంది.

‘‘సెక్యూరిటీ సిబ్బంది గేట్‌ తెరవగానే అప్పటికే చాలాసేపు వేచి ఉన్న అభిమానులంతా ఒక్కసారిగా ముందుకు కదిలారు. సిబ్బందిని పక్కకు నెట్టి మరీ లోనికి    వెళ్లడానికి ప్రయత్నించారు. అక్కడే పరిస్థితి అదుపు తప్పింది. నేను లోనికి వెళ్లేసరికే కొంతమంది ఊపిరాడని స్థితిలో కింద పడి ఉన్నారు. పదేళ్ల లోపు వయసున్న చిన్నారి విగత జీవిగా కనిపించింది’’ అని మేరీ అసోంగఫాక్‌ అనే ప్రత్యక్ష సాక్షి చెప్పారు. యవూండెలోని ఒక నైట్‌క్లబ్‌లో పేలుడు సంభవించి 17 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన  జరిగిన మరుసటి రోజే అదే నగరంలో ఈ ఉదంతం చోటు చేసుకోవడం కామెరూన్‌ విషాదంలో మునిగిపోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని