IPL 2022 Auction: అంత ధర ఊహించలేదు: హైదరాబాదీ తిలక్‌వర్మ

ఐపీఎల్‌ మెగా వేలంలో ముంబయి ఇండియన్స్‌ తనను దక్కించుకోవడం ఆనందంగా ఉందని హైదరాబాద్‌ కుర్రాడు తిలక్‌ వర్మ తెలిపాడు. కనీస ధర రూ.20 లక్షలతో వేలంలోకి వచ్చిన అతణ్ని అంతకంటే 8.5 రెట్లు

Updated : 14 Feb 2022 09:56 IST

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ఐపీఎల్‌ మెగా వేలంలో ముంబయి ఇండియన్స్‌ తనను దక్కించుకోవడం ఆనందంగా ఉందని హైదరాబాద్‌ కుర్రాడు తిలక్‌ వర్మ తెలిపాడు. కనీస ధర రూ.20 లక్షలతో వేలంలోకి వచ్చిన అతణ్ని అంతకంటే 8.5 రెట్లు ఎక్కువ వెచ్చించి ముంబయి సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో రంజీ ట్రోఫీ కోసం ఒడిషాలో ఉన్న అతను.. ‘ఈనాడు’తో సంతోషాన్ని పంచుకున్నాడు. ‘‘నన్ను ముంబయి ఇండియన్స్‌ కొనుగోలు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ వేలంలో ఏదో ఒక జట్టు నన్ను దక్కించుకుంటుందనే నమ్మకంతోనే ఉన్నా. కానీ అయిదు సార్లు టైటిల్‌ గెలిచిన ముంబయి అంత ధర చెల్లిస్తుందని మాత్రం ఊహించలేదు. వేలంలో నా పేరు వచ్చిన సమయంలో ఒత్తిడికి గురయ్యా. ఇప్పుడు ఆనందంగా ఉంది. రోహిత్‌, బుమ్రా లాంటి అగ్రశ్రేణి ఆటగాళ్లున్న జట్టుతో కలిసేందుకు ఆత్రుతగా ఎదురు చూస్తున్నా. అవకాశం దొరికితే మైదానంలో దిగి సత్తాచాటాలనే పట్టుదలతో ఉన్నా. ఈ ఐపీఎల్‌లో రాణించి టీమ్‌ఇండియా దిశగా సాగడమే నా లక్ష్యం’’ అని హైదరాబాద్‌ రంజీ జట్టు వైస్‌ కెప్టెన్‌ కూడా అయిన తిలక్‌ పేర్కొన్నాడు. 2020 అండర్‌-19 ప్రపంచకప్‌లో భారత్‌ తరపున తిలక్‌ ఆడాడు. గత సీజన్‌లో సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో 147.26 స్ట్రైక్‌రేట్‌తో 215 పరుగులు చేసి ఫ్రాంఛైజీల దృష్టిలో పడ్డాడు. మొత్తంగా ఇప్పటివరకూ 15 టీ20ల్లో 143.77 స్ట్రైక్‌రేట్‌తో 381 పరుగులు సాధించాడు. హైదరాబాద్‌ శేరిలింగంపల్లికి చెందిన తిలక్‌.. కోచ్‌ సలామ్‌ వద్ద శిక్షణ పొందాడు. మరో హైదరాబాద్‌ ఆటగాడు సీవీ మిలింద్‌ను కనీస ధర రూ.20 లక్షలకు ఆర్సీబీ దక్కించుకుంది. ఈ 27 ఏళ్ల పేసర్‌ ఇప్పటివరకూ 53 టీ20ల్లో 83 వికెట్లు పడగొట్టాడు.  రాహుల్‌ బుద్ధిని ముంబయి ఇండియన్స్‌ రూ.20 లక్షలకు తీసుకుంది. భగత్‌ వర్మను రూ.20  లక్షలకు తిరిగి సీఎస్కే కొనుగోలు చేసింది.

‘‘హైదరాబాద్‌, ఆంధ్రా పరిధి నుంచి ఐపీఎల్‌కు ఎంపికైన ఆటగాళ్లందరికీ శుభాకాంక్షలు. అయితే ఆంధ్రా అగ్రశ్రేణి క్రికెటర్‌ విహారికి వేలంలో అవకాశమే రాకపోవడం అనూహ్యం. ముస్తాక్‌ అలీ టోర్నీలో పరుగుల వరద పారించిన తన్మయ్‌కి ఛాన్స్‌ దక్కకపోవడం విచారకరం. రికీ భుయ్‌, స్టీఫెన్‌, పృథ్వీరాజ్‌ లాంటి ప్రతిభావంతులకు ఏదో ఒక జట్టులో చోటు దక్కాల్సింది’’

-ఎమ్మెస్కే ప్రసాద్‌, భారత క్రికెట్‌ సెలక్షన్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని