Dhoni: ధోనీ అభిమానులకు శుభవార్త.. 2023లోనూ ఆడతాడట

ధోనీ అభిమానులకు శుభవార్త. వచ్చే ఏడాది టీ20 లీగ్‌లోనూ ఈ జార్ఖండ్‌ డైనమైట్‌ ఆటను చూడొచ్చు. అంతకన్నా ముఖ్య విషయమేంటంటే.. అతడు 2023లో కూడా కెప్టెన్‌గా చెన్నైని నడిపించనున్నాడు.

Updated : 21 May 2022 11:58 IST

ముంబయి: ధోనీ అభిమానులకు శుభవార్త. వచ్చే ఏడాది టీ20 లీగ్‌లోనూ ఈ జార్ఖండ్‌ డైనమైట్‌ ఆటను చూడొచ్చు. అంతకన్నా ముఖ్య విషయమేంటంటే.. అతడు 2023లో కూడా కెప్టెన్‌గా చెన్నైని నడిపించనున్నాడు. ధోనీ వచ్చే సంవత్సరమూ కొనసాగడానికి ప్రధాన కారణం.. చెన్నై, దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులకు వీడ్కోలు చెప్పాలనుకోవడమే. నిజానికి ఈ సీజన్‌ ఆరంభంలో జడేజాకు కెప్టెన్సీ అప్పగించడంతో మరో టీ20 లీగ్‌లో అతడు ఆడడని, ఇదే అతడి చివరి సీజన్‌ అని అంతా అనుకున్నారు. అయితే జడేజా టోర్నీ సగంలోనే సారథ్య బాధ్యతలను వదిలేయడంతో ధోనీ తిరిగి చెన్నై పగ్గాలు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం రాజస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు వ్యాఖ్యాత ఇయన్‌ బిషన్‌.. ధోనీని అతడి భవిష్యత్తు గురించి ప్రశ్నించాడు. ధోనీ స్పందిస్తూ.. ‘‘తప్పకుండా 2023లో ఆడతా. కారణం ఒక్కటే! చెన్నైలో ఆడకుండా, అభిమానులకు కృతజ్ఞతలు చెప్పకుండా వెళ్లిపోవడం అన్యాయమే అవుతుంది. ముంబయిలో ఆటగాడిగా నాకెంతో ప్రేమాభిమానాలు దక్కాయి. కానీ చెన్నై అభిమానులకు కృతజ్ఞతలు చెప్పకుండా నిష్క్రమిస్తే బాగుండదు. అంతే కాకుండా.. వచ్చే ఏడాది  టీ20లీగ్‌ దేశమంతా జరుగుతుందని ఆశిస్తున్నా. అప్పుడు అన్ని చోట్లా అభిమానులకు కృతజ్ఞతలు చెప్పవచ్చు. అదే నా చివరి సంవత్సరమా కాదా అన్నది ప్రశ్న కాదు. ఎందుకంటే ఇంతముందుగా భవిష్యత్తును మనం ఊహించలేం. వచ్చే ఏడాది మాత్రం తప్పకుండా ఆడతా’’ అని ధోనీ చెప్పాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని