అవరోధాలే దృఢంగా మార్చాయి

కెరీర్‌లో ఎదురైన అవరోధాలు తనను మానసికంగా ధృఢంగా మార్చాయని ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌ నిఖత్‌ జరీన్‌ తెలిపింది. ఏం జరిగినా పోరాడాలి.. అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలన్న సూత్రాన్ని పాటించినట్లు చెప్పింది. ఇస్తాంబుల్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో నిఖత్‌ 52 కేజీల విభాగంలో విశ్వ విజేతగా నిలిచింది.

Published : 21 May 2022 02:31 IST

దిల్లీ: కెరీర్‌లో ఎదురైన అవరోధాలు తనను మానసికంగా ధృఢంగా మార్చాయని ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌ నిఖత్‌ జరీన్‌ తెలిపింది. ఏం జరిగినా పోరాడాలి.. అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలన్న సూత్రాన్ని పాటించినట్లు చెప్పింది. ఇస్తాంబుల్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో నిఖత్‌ 52 కేజీల విభాగంలో విశ్వ విజేతగా నిలిచింది. ‘‘ఈ రెండేళ్లు నా ఆటపైనే ఏకాగ్రత నిలిపా. బలహీనతలపై కసరత్తు చేసి ఆటలో మెరుగయ్యేందుకు ప్రయత్నించా. బలాలపై మరింత ఎక్కువగా కసరత్తు చేశా. మెరుగవ్వాల్సిన ప్రాంతాలపై దృష్టిసారించి బలంగా తయారయ్యా. కెరీర్‌లో ఎదురైన అవరోధాలు నన్ను దృఢంగా మార్చాయి. మానసికంగా బలంగా తీర్చిదిద్దాయి. ఏం జరిగినా పోరాడాలి.. అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనే దిశగా ఆలోచన విధానాన్ని మార్చుకున్నా. 2017లో నా భుజం స్థానభ్రంశం చెందడంతో శస్త్రచిక్సిత తప్పలేదు. ఒక ఏడాది పాటు ఏ టోర్నీలోనూ పాల్గొనలేదు. 2018లో తిరిగి వచ్చా. కానీ మునుపటి ఫామ్‌లో లేను. దీంతో కామన్వెల్త్‌ క్రీడలు, ఆసియా క్రీడలు, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లకు దూరమయ్యా. అయినా నేను విడిచిపెట్టలేదు. 2019లో పునరాగమనం తర్వాత వెనుదిరిగి చూడలేదు. ప్రతి టోర్నీని అవకాశంగా మలుచుకున్నా. నాపై నేను నమ్మకంతో ఉన్నా. అందుకే ఈ రోజు ఇక్కడ ఉన్నా. కామన్వెల్త్‌ క్రీడల్లో 50 కేజీల విభాగం ఉంది. అందుకు సన్నద్ధమవుతా’’ అని నిఖత్‌ తెలిపింది. పారిస్‌ ఒలింపిక్స్‌కు సన్నాహాలు మొదలుపెట్టిన నిఖత్‌.. ఏ విభాగంలో బరిలో దిగుతుందన్న విషయంలో స్పష్టత లేదు. 54 కేజీలు లేదా 50 కేజీల విభాగంలో నిఖత్‌ బరిలో దిగాల్సి ఉంటుంది. ‘‘వెయిట్‌ కేటగిరీని మార్చడం చాలా కష్టం. బరువు పెరగాలి లేదా తగ్గాలి. బరువు పెంచుకుని ఎక్కువ వెయిట్‌ కేటగిరీలోకి వెళితే ప్రతికూలత ఎదురవుతుంది. బరువు తగ్గించుకుని ఆ విభాగంలోకి వచ్చేవాళ్లు కాస్త బలంగా ఉంటారు. బలమైన బాక్సర్లు ఎదురవుతారు. 50 కేజీల విభాగంలో బరిలో దిగితే పెద్దగా తేడా ఉండకపోవచ్చు. ప్రస్తుతం నా బరువు 51 నుంచి 51.5 కేజీల మధ్యలో ఉంటుంది. కాబట్టి 50 కేజీల విభాగంలో నేను బాగా ఆడగలను. కొంతకాలం పాటు 50 కేజీల కేటగిరీలో కొనసాగుతా. దేహాన్ని అత్యుత్తమ దశలో ఉంచడమే ఇప్పుడు సవాల్‌. స్ట్రాంజా టోర్నీ తర్వాత ప్రపంచ ఛాంపియన్‌షిప్‌, ఆసియా క్రీడల ట్రయల్స్‌లో పాల్గొన్నా. అగ్రశ్రేణి, అనుభజ్ఞులైన బాక్సర్లతో కఠినమైన బౌట్‌లలో పాల్గొనడం చాలా కష్టం. అయినా నా దేహాన్ని ప్రశాంతంగా ఉంచుకుని రెండు ట్రయల్స్‌లో గెలిచి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ సన్నాహాలు ప్రారంభించా. ఇప్పుడు కామన్వెల్త్‌ క్రీడల కోసం సన్నద్ధమవుతా. గాయాలకు దూరంగా ఉండటంపైనే నా ప్రధాన దృష్టి’’ అని నిఖత్‌ వివరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని