Harbhajan Singh: భజ్జీ దంపతులకు పుత్రోత్సాహం

టీమ్‌ఇండియా లెజెండరీ ఆఫ్‌స్పిన్నర్‌ హర్భజన్‌సింగ్‌ దంపతులకు శనివారం పుత్రోత్సాహం కలిగింది. ఆయన సతీమణి గీతా బస్రా కొద్దిసేపటి క్రితం బులుడికి జన్మనిచ్చారు...

Updated : 10 Jul 2021 15:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా లెజెండరీ ఆఫ్‌స్పిన్నర్‌ హర్భజన్‌సింగ్‌ దంపతులకు శనివారం పుత్రోత్సాహం కలిగింది. ఆయన సతీమణి గీతా బస్రా  మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని భజ్జీ సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.

‘‘మేం పట్టుకునేందుకు ఇంకో చిన్నారి చేయి మా ఇంట్లోకి వచ్చింది. అతని ప్రేమ అమితమైనది. బంగారం అంతటి విలువైనది. ఇదో అద్భుతమైన బహుమతి. ఇదెంతో మధురమైనది, ప్రత్యేకమైనది కూడా. మా మనసులు సంతోషంతో నిండిపోయాయి. మా జీవితాలు సంపూర్ణమయ్యాయి. మాకు మగబిడ్డను ప్రసాదించినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు. ఇప్పుడు నా భార్య, చిన్నారి క్షేమంగా ఉన్నారు. ఈ ఆనందంతో మేం ఉబ్బితబ్బిబ్బు అవుతున్నాం. ఈ సందర్భంగా మా మంచి కోసం ఆలోచించే ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు’’ అని పేర్కొంటూ హర్భజన్‌ భావోద్వేగం చెందాడు.

భజ్జీ, గీతా 2015 అక్టోబర్‌ 29న పంజాబ్‌లోని జలంధర్‌లో వివాహం చేసుకున్నారు. మరుసటి ఏడాది జులై 27న హినాయా అనే ఆడపాపకు జన్మనిచ్చారు. ఈ క్రమంలోనే నాలుగేళ్ల తర్వాత రెండో సంతానంగా బాబుకు జన్మనిచ్చారు. కాగా, హర్భజన్‌ గతకొన్నేళ్లుగా టీమ్‌ఇండియాకు దూరమైన సంగతి తెలిసిందే. అతడింకా ఐపీఎల్‌లో కొనసాగుతుండటం విశేషం. ఈ ఏడాది కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తరఫున ఆడుతున్న భజ్జీ.. కరోనా కేసుల నేపథ్యంలో టోర్నీ నిలిచిపోయేముందు మూడు మ్యాచ్‌లు ఆడాడు. అయితే ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. మరి సెప్టెంబర్‌లో తిరిగి ప్రారంభమైనప్పుడైనా రాణిస్తాడేమో చూడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని