T20 World Cup: సాకులు చెప్పి తప్పించుకోవాలని చూడొద్దు : హర్భజన్‌ సింగ్‌

టీ20 ప్రపంచకప్‌లో టాస్‌ కారణంగానే తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయామని చెప్పిన టీమిండియా బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ వ్యాఖ్యలపై మాజీ స్ఫిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ స్పందించాడు. జట్టు..

Published : 10 Nov 2021 01:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌లో టాస్‌ కారణంగానే తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయామని చెప్పిన టీమిండియా బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ వ్యాఖ్యలపై మాజీ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ స్పందించాడు. జట్టు యాజమాన్యం ఇలాంటి సాకులు చెప్పి తప్పించుకోవాలని చూడొద్దని భజ్జీ అన్నాడు. ‘గెలుపోటములకు టాస్‌తో సంబంధం లేదు. ఐపీఎల్ ఫైనల్లో మొదట బ్యాటింగ్‌ చేసిన చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టు విజయం సాధించింది. అలాగే, టాస్‌తో సంబంధం లేకుండా చాలా జట్లు గొప్ప విజయాలు సాధించాయి. చిన్న చిన్న జట్లే ఇలాంటి సాకులు చెబుతాయి. కానీ, భారత్ లాంటి బలమైన జట్టుకు కోచ్‌లుగా ఉన్నవ్యక్తులు అలాంటివి చెప్పకూడదు. మన జట్టు మెరుగ్గా రాణించలేకపోయిందనే వాస్తవాన్ని ఒప్పుకోవాలి. కొన్నిసార్లు ఇలా జరుగుతుంది. ఇదేం పెద్ద సమస్య కాదు. గతంలో చేసిన తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలి. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నించాలి’ అని హర్భజన్‌ సింగ్ సూచించాడు. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైంది. ఆ తర్వాత రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే.

టీమిండియా బౌలింగ్ కోచ్‌ భరత్‌ అరుణ్‌ టీ20 ప్రపంచకప్‌ నుంచి భారత జట్టు నిష్క్రమణపై స్సందిస్తూ..  ‘నేనేమీ సాకులు చెప్పి తప్పించుకోవాలనుకోవట్లేదు. ఈ టీ20 ప్రపంచకప్‌లో టాస్ గెలిచిన జట్లే ఎక్కువగా విజయవంతమయ్యాయి. ప్రత్యేకించి దుబాయ్‌ పిచ్‌లపై ఆడుతున్నప్పుడు టాస్‌ కీలకంగా మారింది. ఏదేమైనా మేం మెరుగ్గా రాణించాల్సింది. బ్యాటుతో మరిన్ని పరుగులు చేయాల్సింది. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రక్షణాత్మక స్కోరు చేశాం. అయినా, త్వరగా వికెట్లు పడగొట్టలేకపోవడంతో విజయానికి దూరమయ్యాం’ అని అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని