Virat Kohli : ముప్పును గ్రహించి.. ముందే తప్పుకున్నాడు : సంజయ్ మంజ్రేకర్‌

టీమ్‌ఇండియా టెస్టు కెప్టెన్సీ నుంచి తనను తప్పించనున్నారని గ్రహించిన విరాట్‌ కోహ్లీ ముందే బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడని మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు...

Published : 17 Jan 2022 13:32 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : టీమ్‌ఇండియా టెస్టు కెప్టెన్సీ నుంచి తనను తప్పించనున్నారని గ్రహించిన విరాట్‌ కోహ్లీ ముందే ఆ బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించాడని మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు. ఏడేళ్లు భారత జట్టుకు టెస్టు కెప్టెన్‌గా వ్యవహరించిన కోహ్లీ శనివారం ముగింపు పలికిన విషయం తెలిసిందే.

‘ఏదో ఒక కారణం చూపి టీమ్ఇండియా నాయకత్వ బాధ్యతల నుంచి తొలగించే అవకాశం వేరే వారికి ఇవ్వకూడదని కోహ్లీ భావించాడు. అందుకే కెప్టెన్సీకి ముప్పు ఉందని పసిగట్టిన వెంటనే వైదొలగాడు. కోహ్లీ విషయంలో చాలా తక్కువ సమయంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆర్సీబీ కెప్టెన్‌గా తప్పుకోవడం, ఆ తర్వాత టీ20 కెప్టెన్సీకి ముగింపు పలకడం, వన్డే జట్టుకు నాయకత్వం విషయంలో కోహ్లీకి బీసీసీఐ షాక్‌ ఇవ్వడం వంటివి వేగంగా జరిగిపోయాయి. ఇటీవల బీసీసీఐలో కీలక మార్పులు, టీమిండియా కోచ్‌ మార్పు వంటివి కోహ్లీ నిర్ణయాన్ని ప్రభావితం చేశాయని చెప్పుకోవచ్చు. మాజీ కోచ్‌ రవిశాస్త్రి నుంచి లభించినంత మద్దతు ప్రస్తుత కోచ్ రాహుల్‌ ద్రవిడ్ నుంచి లభించకపోవచ్చని అతను భావించి ఉండొచ్చు. గతంలో టీమ్‌ఇండియా కోచ్‌ అనిల్ కుంబ్లేతో కోహ్లీ విభేదించాడు. ఆ తర్వాత రవిశాస్త్రి నేతృత్వంలో తిరుగులేని నాయకుడిగా ఎదిగాడు. అయితే, ప్రస్తుత కోచ్ ద్రవిడ్ నుంచి ఆ స్థాయి మద్దతు లభించదని కోహ్లీ భావించి ఉండొచ్చు. ఇవన్నీ భావోద్వేగపూరిత నిర్ణయాలే. ఏదేమైనా కోహ్లీ ప్రస్తుతం కంఫర్ట్ జోన్‌లో లేడన్న విషయం స్పష్టమవుతోంది. బ్యాటుతోనూ మునుపటి స్థాయిలో రాణించలేకపోతున్నాడు’ అని సంజయ్‌ మంజ్రేకర్‌ పేర్కొన్నాడు.

తాజాగా, దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా టీమ్‌ఇండియా 1-2 తేడాతో పరాజయం పాలైంది. దీనిని సాకుగా చూపి బీసీసీఐ టెస్టు కెప్టెన్సీ నుంచి తొలగించకముందే కోహ్లీనే స్వయంగా తప్పుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా, ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ (ఐపీఎల్)లో రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు కెప్టెన్‌గా కూడా కోహ్లీ తప్పుకున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని