Ice Hockey: మ్యాచ్​ ముగియగానే.. మైదానంలో టెడ్డీ బేర్ల వర్షం!

ఐస్ హాకీ మైదానంలో టెడ్డీ బేర్ల వర్షం కురిసింది. ఓ జట్టు విజయం సాధించగానే.. ప్రేక్షకులు తమ వెంట తెచ్చుకున్న టెడ్డీలను మైదానంలోకి విసిరి సంబురాలు చేసుకున్నారు......

Published : 24 Jan 2022 02:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మైదానంలో ఇరు జట్ల మధ్య పోరు రసవత్తరంగా సాగుతుండగా.. ప్రేక్షకుల దృష్టంతా అప్పటివరకు ఆ ఆటమీదే ఉంది. చివర్లో ఓ ప్లేయర్ దూసుకొచ్చి గోల్ కొట్టేశాడు. అంతే.. ప్రేక్షకుల కేరింతలు మొదలయ్యాయి. తమ వెంట తెచ్చుకున్న టెడ్డీ బేర్లను మైదానంలోకి విసురుతూ సంబురాలు చేసుకున్నారు. టెడ్డీబేర్ల వర్షం కురిసిందా అనేలా.. వేల సంఖ్యలో బొమ్మలు మైదానంలో కనువిందు చేశాయి. అంతేకాదు.. అత్యధిక టెడ్డీలు విసిరి రికార్డు కూడా సృష్టించారు. ఆ బొమ్మల మధ్యలోనే ఆటగాళ్లు కేరింతలు కొట్టారు. అమెరికా పెన్సిల్వేనియాలోని హర్ష్​లీలో ఉన్న గెయింట్​ సెంటర్​లో ఈ దృశ్యం కనిపించింది.

ఐస్ హాకీ ఆటలో ఇలాంటి ఘటనలు తరచూ కనువిందు చేస్తూ ఉంటాయి. అమెరికాలో ఇది సంప్రదాయంగా వస్తోంది. కాగా ఈ బొమ్మలన్నింటినీ సేకరించి.. నిర్వాహకులు వివిధ స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇస్తుంటారు. 2001 నుంచి 2.7 లక్షల బొమ్మలను ఇలా సమీకరించారు. 2019లో 45,650 టెడ్డీలను విసిరి  ప్రేక్షకులు రికార్డు సృష్టించారు.. తాజాగా ఆ రికార్డును బద్దకొట్టారు. ఏకంగా 52,341 టెడ్డీలను మైదానంలో విసిరి గత రికార్డును తిరగరాశారు. కరోనా కారణంగా రెండేళ్ల తర్వాత ఇలాంటి దృశ్యం ఆవిష్కృతమైంది. కాగా ఈ గేమ్‌లో హార్ట్‌ఫోర్డ్‌ ఊల్ఫ్‌ జట్టుపై హెర్షే బియర్స్‌ జట్టు 5-0 గోల్స్‌ తేడాతో విజయం సాధించింది.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని