cricket : అతనో సంపన్న క్రికెటర్ల సృష్టికర్త..!

ఐసీసీ టీ 20 ప్రపంచ కప్‌లో 10 సెకన్ల వాణిజ్యప్రకటన ధర రూ.9.5లక్షల వరకు ఉన్నదని వార్తలొచ్చాయి.. దాదాపు రూ. 1,200 కోట్లు విలువైన వాణిజ్య ప్రకటనల కోసం పదిరోజుల క్రితమే సంతకాలు పూర్తయ్యాయి

Published : 25 Oct 2021 01:36 IST

* సచిన్‌ సహా కీలక క్రికెటర్ల భారీ డీల్స్‌ ఆద్యుడు

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

ఐసీసీ టీ 20 ప్రపంచ కప్‌లో 10 సెకన్ల వాణిజ్యప్రకటన ధర రూ.9.5లక్షల వరకు ఉన్నదన్న వార్తలొచ్చాయి.. దాదాపు రూ. 1,200 కోట్లు విలువైన వాణిజ్య ప్రకటనల కోసం పదిరోజుల క్రితమే సంతకాలు పూర్తయ్యాయి. గత ప్రపంచ కప్‌తో పోలిస్తే ఈ మొత్తం 3 రెట్లు పెరిగింది.. క్రికెట్‌కు ఈ స్థాయి తళుకుబెళుకులు ఎలా వచ్చాయి.. ఒకప్పుడు భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్నా.. భారత క్రికెట్‌ బోర్డు ఆదాయం అంతంత మాత్రంగానే ఉండేది.. చివరికి దూరదర్శన్‌లో క్రికెట్‌ మ్యాచ్‌ల ప్రసారానికి అయ్యే ఖర్చు క్రికెట్‌ బోర్డు ఎదురు చెల్లించాల్సిన పరిస్థితి. ఇక క్రికెటర్ల ఆదాయం కేవలం లక్షల్లో మాత్రమే ఉండేది. అదే సమయంలో బెంగళూరుకు చెందిన ఓ కుర్రాడు భారత్‌ క్రికెట్‌ దశదిశ మార్చేశాడు. భారతీయ క్రీడాకారుల్ని కోటీశ్వరులను చేశాడు. ఎంత వేగంగా ఎదిగాడో.. అంతే వేగంగా 40వ పడిలోనే లోకాన్ని వీడాడు. అతని పేరు మార్క్‌ మస్కరెన్హాస్‌..!

ఎవరీ మార్క్‌..?

మార్క్‌ మస్కరెన్హాస్‌ బెంగళూరుకు చెందిన వ్యక్తి. 1976లో కమ్యూనికేషన్స్‌లో మాస్టర్స్‌ చేసేందుకు అమెరికా వెళ్లాడు.  అప్పటికి అతని వయస్సు 19 ఏళ్లు. అప్పటికే టీవీ ప్రొడక్షన్‌లో మంచి పట్టు సంపాదించాడు. అమెరికాలో కోర్సు పూర్తి అయ్యాక ప్రముఖ ఛానల్‌ సీబీఎస్‌లో రేడియో విభాగంలో సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా చేరాడు. ఆయన ఇంటర్వ్యూ సమయంలో ‘నేను కారు కొనుక్కోవడానికి నాకు ఈ ఉద్యోగం చాలా అవసరం’ అని చెప్పాడు. అతని నిజాయతీ నచ్చి కంపెనీ ఉద్యోగం ఇచ్చింది. కంపెనీలో టాప్‌ సేల్స్‌మెన్‌గా ఎదిగాడు. వచ్చిన సొమ్ముతో అమెరికాలో స్కీయింగ్ వంటి చిన్నచిన్న క్రీడల ప్రసారహక్కులు కొనుగోలు చేశాడు. వాటి నుంచి మంచి ఆదాయం సంపాదించాడు. 1989 వరల్డ్‌టెల్‌ కంపెనీ ప్రారంభించాడు.

మరోపక్క అదే సమయంలో భారత్‌లో క్రికెట్‌మ్యాచ్‌ల టీవీ ప్రసార హక్కులను  విక్రయించే అధికారాన్ని న్యాయపోరాటం ద్వారా బీసీసీఐ దక్కించుకొంది. 1996 ప్రపంచ కప్‌కు సంబంధించి ప్రసారహక్కులను బీసీసీఐ విక్రయిస్తున్న విషయం 1992-93లో మార్క్‌ చెవినపడింది. అప్పటికే ఈ హక్కుల కోసం దిగ్గజ సంస్థ టీడబ్ల్యూఐ కూడా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. వారు భారీ మొత్తం ఆఫర్‌ చేసినా అడ్వాన్స్‌ ఇచ్చేందుకు అంగీకరించలేదు. బీసీసీఐకు అడ్వాన్స్ మొత్తం చాలా ముఖ్యం. ఆ డబ్బుతో వరల్డ్‌కప్‌ నిర్వహణతో పాటు చిన్నదేశాల్లో క్రికెట్‌ సౌకర్యాలకు ఖర్చుపెట్టాలని భావించింది. ఇలా చేస్తే బీసీసీఐకి అంతర్జాతీయ క్రికెట్‌లో మద్దతు పెరుగుతుంది. దీంతో మార్క్‌ ప్రసార హక్కుల కోసం బీసీసీఐకు కోటి డాలర్లు ఇచ్చేందుకు ముందుకొచ్చాడు. అంతేకాదు.. ఆ మొత్తంలో 30 లక్షల డాలర్లను అడ్వాన్స్‌గా చెల్లించి డీల్‌ ఎగరేసుకుపోయాడు. అప్పట్లో మ్యాచ్‌ల చిత్రీకరణకు 8 కెమేరాలు, నాలుగు వీడియోటేప్‌ మెషిన్లను వినియోగించాడు. కామెంటరీకి టోని గ్రిగ్‌, ఇయాన్‌ ఛాపెల్‌, మైఖెల్‌ హోల్డింగ్స్‌ల బృందాన్ని ప్రత్యేక విమానంలో తీసుకువచ్చి కామెంటరీ చెప్పించారు. ఈ టోర్ని నుంచి మార్క్‌ రెండు కోట్ల డాలర్లను సంపాదించాడు. ఆ తర్వాత షార్జా, బంగ్లాదేశ్‌, శ్రీలంకల్లో జరిగిన టోర్నీల హక్కులను సొంతం చేసుకొన్నాడు. ఢాకాలో జరిగిన వీల్స్‌ ఇంటర్నేషనల్‌ కప్‌ను 18 కెమేరాలు, 16 వీడియోటేప్‌ మెషిన్లను వాడి ప్రసారం చేశాడు. ఆ తర్వాత వరల్డ్‌ టెల్‌ ప్లేయర్‌ మేనేజ్‌మెంట్‌, ప్రొడక్షన్‌, మార్కెటింగ్‌ కంపెనీ కార్యాలయాన్ని బెంగళూరులో ఏర్పాటు చేశాడు. మాజీ క్రికెటర్‌ రవిశాస్త్రి.. మార్క్‌తో కలిసి పనిచేశారు. 

సచిన్‌తో డీల్‌ ఇలా..

1983 ప్రపంచకప్‌ను కపిల్‌ డెవిల్స్‌ గెలిచిన తర్వాత భారత్‌లో క్రికెట్‌ వేగంగా ఎదిగింది. బీసీసీఐ ఆదాయం కూడా క్రమంగా పెరుగుతూ వచ్చింది. కానీ, ఆటగాళ్ల జీతాల్లో అంత వృద్ధి లేదు. వీక్షకుల సంఖ్య ఆధారంగా ప్రపంచంలో మరే క్రీడలోనూ ఇంత తక్కువ జీతాలు లేవు. కానీ సచిన్‌-వరల్డ్‌టెల్‌ డీల్‌ తర్వాత పరిస్థితులు నాటకీయంగా మారిపోయాయి. క్రీడాకారులు మైదానం బయట వాణిజ్య ప్రకటనలతో ఎంత సంపాదించగలరో భారత్‌కు తెలిసొచ్చింది. అప్పట్లో సచిన్‌ ఓ కంపెనీ యాడ్‌కు రూ.16లక్షలు వరకు తీసుకొనేవాడు. 1995లో రవిశాస్త్రి ద్వారా వరల్డ్‌ టెల్‌ కంపెనీ సచిన్‌తో ఐదేళ్ల వ్యవధికి రూ.30 కోట్లకు డీల్‌ చేసుకొన్నట్లు ఫైనాన్షియల్‌ ఎక్స్‌ప్రెస్‌ పేర్కొంది. 2001 నాటికి మార్క్‌ కంపెనీ సచిన్‌కు రూ.100 కోట్లు చెల్లించి ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించుకొంది.   బూస్ట్, పెప్సీ, యాక్షన్‌ షూస్‌, ఎమ్మారెఫ్‌, అడిడాస్‌, బ్రిటానియా, ఫియట్‌ పాలియో, టీవీఎస్‌,సన్‌ఫీస్ట్‌, కెనాన్‌, తొషిబా, కోల్గెట్‌-పామోలివ్‌, ఫిలిప్స్‌, వీసా, క్యాస్ట్రాల్‌ వంటి దిగ్గజ కంపెనీలకు సచిన్‌ ప్రచారకర్తగా మారారు. వీరిద్దరూ వ్యక్తిగతంగా మంచి మిత్రులు. 1999 ప్రపంచ కప్‌ సమయంలో సచిన్‌ తండ్రి చనిపోయారు. ఆ సమయంలో మార్క్‌ దగ్గరుండి సచిన్‌ ప్రయాణ ఏర్పాట్లు మొత్తం చూసుకొన్నాడు. ‘‘నేను కేవలం క్రికెట్‌పైనే దృష్టి పెట్టేవాడిని. మిగిలినవన్నీ మార్క్‌ చూసుకొనేవాడు’’ అని సచిన్‌ ఒక సందర్భంలో స్వయంగా చెప్పాడు.  మార్క్‌ ఒక్క సచిన్‌కే కాదు.. సౌరవ్‌ గంగూలీ, షేన్‌ వార్న్‌ వంటి వారిని కూడా ప్రమోట్‌ చేశాడు. 

వివాదాలు.. అపజయాలు..

మార్క్‌ జీవితం మొత్తం విజయసోపానాలే లేవు. అతని సంపాదన పెరిగే కొద్దీ వివాదాలు పెరిగాయి. మార్క్‌ ఆఫీస్‌లపై సీబీఐ, ఐటీ రైడ్స్‌ జరిగాయి. మోసపూరితంగా వ్యవహరించాడని మార్క్‌పై శ్రీలంక క్రికెట్‌ బోర్డు ఆరోపణలు చేసింది. మార్క్‌ వీటి గురించి ఎక్కడా పెదవి విప్పలేదు. తాను ఎటువంటి తప్పు చేయలేదని మాత్రం వెల్లడించాడు. 2000లోనే మార్క్‌ ఓ క్రికెట్‌ మ్యాగ్జైన్‌, వెబ్‌సైట్‌ను ప్రారంభించాడు. ఆ తర్వాత వాటిని మూసివేయాల్సి వచ్చింది. ‘‘ఎద్దుల బండి అవసరమైన చోట రోల్స్‌రాయిస్‌ ఇచ్చాను’’ అని మార్క్‌ ఆ సమయంలో వ్యాఖ్యానించాడు. మార్క్‌ 2002 జనవరిలో నాగ్‌పూర్‌ వద్ద జరిగిన కారు ప్రమాదంలో చనిపోయాడు. మార్క్‌ మరణం తనకు వ్యక్తిగత నష్టంగా సచిన్‌ అభివర్ణించాడు. సచిన్‌ రిటైర్మెంట్‌ ప్రకటించిన సమయంలో కూడా మార్క్‌పేరును తలుచుకొన్నాడు. 

మార్క్‌ రాక తర్వాత భారత క్రికెట్‌లో ధన ప్రవాహం పెరిగిందని ఫోర్బ్స్‌ పత్రిక కథనం పేర్కొంది. కానీ, చాలా మంది అతను అనుసరించిన విధానాన్నే అనుసరించారు. భారత్‌ క్రికెట్‌ విలువ నాటికీ.. నేటికీ ఎన్ని రెట్లు పెరిగినా.. మార్క్‌ వేసిన దారిలోనే ప్రయాణించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని