Tokyo Olympics: ‘ఈ గేమ్‌ను పూర్తిచేయగలను.. కానీ ఆలోపే చనిపోవచ్చు’

రష్యాకు చెందిన టెన్నిస్‌ క్రీడాకారుడు, రెండుసార్లు గ్రాండ్‌స్లామ్‌ రన్నరప్‌ డేనియల్‌ మెద్వెదేవ్‌ కోర్టులో చెమటలుకక్కాడు. ఈ వేడికి నేను మరణిస్తే ఎవరు కారణమంటూ చైర్‌ ఎంపైర్‌ వద్ద అసహనం వ్యక్తం చేశాడు....

Published : 29 Jul 2021 01:53 IST

టోక్యో: ప్రస్తుతం ఒలింపిక్స్‌ జరుగుతున్న టోక్యో నగరంలో ఎండలు మండిపోతున్నాయి. పలువురు క్రీడాకారులు అవస్థలు పడుతున్నారు. రష్యాకు చెందిన టెన్నిస్‌ క్రీడాకారుడు, రెండుసార్లు గ్రాండ్‌స్లామ్‌ రన్నరప్‌ డేనియల్‌ మెద్వెదేవ్‌ కోర్టులో చెమటలు కక్కాడు. ఈ వేడికి నేను మరణిస్తే ఎవరు కారణమంటూ చైర్‌ ఎంపైర్‌ వద్ద అసహనం వ్యక్తం చేశాడు. క్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత సాధించేందుకు మెద్వెదేవ్‌ బుధవారం స్పెయిన్‌కు చెందిన పాబ్లో కర్రెనో బుస్టాతో పోటీ పడ్డాడు. అయితే ఎండ వేడికి తట్టుకోలేక పలుమార్లు విశ్రాంతి తీసుకున్నాడు. మెద్వెదేవ్‌ మాట్లాడుతూ.. ‘ఆట మొదటి నుంచీ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైంది. ఎండ వేడికి నా తల బద్దలైనట్లు అనిపించింది. సరిగా ఊపిరి పీల్చుకోలేకపోయాను’ అని వాపోయాడు.

మెద్వెదేవ్‌ ఇబ్బంది చూసిన ఎంపైర్‌.. నువ్వు బాగానే ఉన్నావా? అని అడిగాడు. దానికి అతడు స్పందిస్తూ.. ‘ఈ గేమ్‌ను పూర్తిచేయగలను.. కానీ అంతలోపే చనిపోవచ్చు. దీనికి మీరు బాధ్యత వహిస్తారా?’ అని ఎంపైర్‌ను ప్రశ్నించాడు. ‘మ్యాచ్‌ ప్రారంభానికి ముందు నుంచే ఎండ తీవ్రంగా ఉంది. దీంతో మ్యాచ్‌ను కొంచెం ఆలస్యంగా నిర్వహించాలని మొదటి నుంచీ ఎంపైర్లకు చెబుతూనే వచ్చా. తీవ్రమైన ఎండ కారణంగా రెండో సెట్‌ ముగిసే సమయానికి నా కళ్లు తిరిగాయి. మరికొద్దిసేపయితే కోర్టులోనే కుప్పకూలేవాడిని’ అని మెద్వెదేవ్‌ పేర్కొన్నాడు. 

కోర్టులో చెమటోడుస్తూనే ప్రత్యర్థిపై మెద్వెదేవ్‌ విజయం సాధించాడు. కాగా, సెట్ల మధ్య విరామం, మెడికల్‌ టైమవుట్‌ తీసుకుంటూ పాబ్లో కర్రెనో బుస్టాపై 6-2, 3-6, 6-2తో గెలుపొందాడు. మెద్వెదేవ్‌ క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ నం.1 జకోవిచ్‌తో అమీతుమీ తేల్చుకోనున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని