IND vs NZ: అతడు ఏ స్థానంలో బ్యాటింగ్‌ దిగుతాడో నేను చెప్పలేను : పుజారా

టీమ్ఇండియా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌ తొలి టెస్టులో కచ్చితంగా ఆడతాడని.. అయితే అతడు ఏ స్థానంలో బ్యాటింగ్‌కి దిగుతాడో తాను చెప్పలేనని ఛెతేశ్వర్‌ పుజారా అన్నాడు. న్యూజిలాండ్‌తో..

Published : 24 Nov 2021 01:20 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్ఇండియా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌ తొలి టెస్టులో కచ్చితంగా ఆడతాడని.. అయితే అతడు ఏ స్థానంలో బ్యాటింగ్‌కి దిగుతాడో తాను చెప్పలేనని ఛెతేశ్వర్‌ పుజారా అన్నాడు. న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో ముగ్గురు ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌ చోటు దక్కించుకున్నారు. దీంతో ఓపెనింగ్ చేసే విషయంలో కొంత గందరగోళం నెలకొంది. వీరిలో కేఎల్ రాహుల్‌.. ఇంగ్లాండ్‌ పర్యటనలో మెరుగ్గా రాణించడంతో అతడి స్థానానికి ఢోకాలేదు. మిగతా ఇద్దరిలో రాహుల్‌కు తోడుగా ఎవరు బరిలోకి దిగుతారనే విషయంలో స్పష్టత లేదు. తొలి టెస్టు కాన్పుర్ వేదికగా గురువారం (నవంబరు 25) నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు ఛెతేశ్వర్ పుజారా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

‘శుభ్‌మన్‌ గిల్ అద్భుతమైన ఆటగాడు. అతడు టెస్టుల్లో అరంగేట్రం చేసినప్పటి నుంచి నిలకడగా రాణిస్తున్నాడు. గాయం కారణంగా ఇంగ్లాండ్‌ పర్యటనకు అతడు దూరం కావడం దురదృష్టకరం. న్యూజిలాండ్‌తో జరుగనున్న తొలి టెస్టులో అతడు కచ్చితంగా ఆడతాడు. అయితే, ఏ స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతాడో నేను చెప్పలేను. కోచ్ రాహుల్ ద్రవిడ్‌ సూచన మేరకు మేం నడుచుకుంటాం’ అని పుజారా చెప్పాడు. 

టీమ్‌ఇండియా కొత్త కోచ్‌ రాహుల్ ద్రవిడ్‌.. ఎంతో మంది యువ క్రికెటర్లను తీర్చి దిద్దారని, అతడి నేతృత్వంలో ఆడేందుకు ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నానని పుజారా పేర్కొన్నాడు. ‘ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ మ్యాచ్‌లో మేం ఓడిపోయాం. ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో మెరుగ్గా రాణించి ఆధిక్యంలో నిలిచాం. ప్రస్తుతం కొత్త కోచ్‌ రాహుల్ ద్రవిడ్‌ రాకతో ఆటగాళ్లలో మరింత ఆత్మవిశ్వాసం పెరిగింది. అండర్‌-19 క్రికెట్లో అతడు తీర్చి దిద్దిన ఎంతో మంది యువ ఆటగాళ్లు ప్రస్తుత టెస్టు జట్టులో చోటు దక్కించుకోవడం మాకు కలిసొచ్చే అంశం.  ద్రవిడ్ నేతృత్వంతో ఆడేందుకు ఎదురు చూస్తున్నా’ అని పుజారా పేర్కొన్నాడు.

Read latest Sports News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని