Tokyo Olympics: పీవీ సింధు క్వార్టర్స్‌ ఖాయం!

భారత స్టార్‌ షట్లర్‌, ప్రపంచ ఛాంపియన్‌ పీవీ సింధుకు టోక్యో ఒలింపిక్స్‌లో అనుకూలమైన డ్రా లభించింది. మహిళల సింగిల్స్‌లో ఆమె గ్రూప్‌-జే నుంచి బరిలోకి దిగనుంది. హాంకాంగ్‌ క్రీడాకారిణి చెంగ్‌ ఎంగన్‌ యి (34వ ర్యాంకు), ఇజ్రాయెల్‌ అమ్మాయి సెనియా పొలికర్పోవా (58వ ర్యాంకు)తో తలపడనుంది..

Published : 09 Jul 2021 19:09 IST

గ్రూప్‌ దశలో  భారత స్టార్‌ షట్లర్‌కు అనుకూల డ్రా

దిల్లీ: భారత స్టార్‌ షట్లర్‌, ప్రపంచ ఛాంపియన్‌ పీవీ సింధుకు టోక్యో ఒలింపిక్స్‌లో అనుకూలమైన డ్రా లభించింది. మహిళల సింగిల్స్‌లో ఆమె గ్రూప్‌-జే నుంచి బరిలోకి దిగనుంది. హాంకాంగ్‌ క్రీడాకారిణి చెంగ్‌ ఎంగన్‌ యి (34వ ర్యాంకు), ఇజ్రాయెల్‌ అమ్మాయి సెనియా పొలికర్పోవా (58వ ర్యాంకు)తో తలపడనుంది. డ్రా సులభంగానే ఉన్నా అత్యుత్తమంగా ఆడితేనే గెలుపు సాధ్యమని సింధు తెలిపింది.

‘గ్రూప్‌ దశలో నాకు మంచి డ్రా ఎదురైంది. హాంకాంగ్‌ అమ్మాయి బాగా ఆడుతుంది. మ్యాచ్‌ కఠినంగా జరగనుంది. ఒలింపిక్స్‌లో అంతా మంచి ఫామ్‌లో ఉంటారు. నేనూ బాగానే ఆడతానని భావిస్తున్నా. ప్రతి మ్యాచూ కీలకమే. ఒక్కో పోరు లక్ష్యంగా బరిలోకి దిగుతాను. ఒలింపిక్స్‌లో ప్రతి పాయింటు విలువైందే’ అని సింధు తెలిపింది.

ప్రపంచ ఏడో ర్యాంకర్‌ సింధుకు గ్రూప్‌-జే లోని ఇద్దరిపై మెరుగైన రికార్డే ఉంది. చెంగ్‌తో ఐదుసార్లు, పొలికర్పోవాతో రెండుసార్లు తలపడగా అన్నింటా ఆమెదే విజయం.

ఇక పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ 15వ ర్యాంకర్‌ బి.సాయి ప్రణీత్‌ గ్రూప్‌-డిలో ఉన్నాడు. నెదర్లాండ్స్‌కు చెందిన మార్క్‌ కాల్‌జౌ (29వ ర్యాంకు), ఇజ్రాయెల్‌ షట్లర్‌ మిషా జిల్‌బెర్మన్‌ (47వ ర్యాంకు)తో తలపడనున్నాడు. తనకు మిశ్రమ డ్రా ఎదురైందని ప్రణీత్‌ అంటున్నాడు. మరీ తేలిక, మరీ కఠినమైంది కాదన్నాడు. అన్ని మ్యాచులు గెలిచేందుకు 100% ప్రయత్నిస్తానని వెల్లడించాడు.

పురుషుల డబుల్స్‌లో భారత్‌కు చిరాగ్‌ శెట్టి, సాత్విక్‌ సాయిరాజ్‌ ద్వయం ప్రాతినిధ్యం వహిస్తోంది. ప్రపంచ డబుల్స్‌ ర్యాంకింగ్స్‌లో వీరిది పదో స్థానం. టోక్యో ఒలింపిక్స్‌లో ఈ ద్వయం గ్రూప్‌-ఏలో ఉంది. వీరికి కఠిన డ్రా ఎదురైంది. ప్రపంచ నంబర్‌ వన్‌ జోడీ కెవిన్‌ సంజయ, మార్కస్‌ ఫెర్నాల్డి గిడోన్‌ (ఇండోనేసియా), ప్రపంచ మూడో ర్యాంకు లీ యాంగ్‌, వాంగ్‌ చి లిన్‌ (చైనీస్‌ తైపీ)ని ఓడిస్తేనే వారు క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకుంటారు.

టోక్యో ఒలింపిక్స్‌లో ప్రతి సింగిల్స్‌ విభాగంలో 42 మంది తలపడుతున్నారు. వారిని 14 గ్రూపులుగా విడదీశారు. ఒక్కో బృందంలో ముగ్గురు షట్లర్లు ఉంటారు. ప్రతి గ్రూప్‌ నుంచి అగ్రస్థానంలో నిలిచిన వారు నాకౌట్‌ పోరుకు అర్హత సాధిస్తారు.

ఇక డబుల్స్‌లో 16 జోడీలను ఏ, బీ, సీ, డీ బృందాలుగా విభజించారు. ప్రతి గ్రూప్‌లో మూడు జంటలు ఉంటాయి. అగ్రస్థానంలో నిలిచిన తొలి రెండు జోడీలను క్వార్టర్స్‌కు ఎంపిక చేస్తారు. బ్యాడ్మింటన్‌ పోటీలు జులై 24 నుంచి మొదలవుతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని