Ravi Shastri: మరోసారి మైక్‌ అందుకోనున్న రవిశాస్త్రి.!

ఇన్నాళ్లు టీమిండియా హెడ్ కోచ్‌గా సేవలందించిన రవిశాస్త్రి మరోసారి కామెంటేటర్‌ అవతారం ఎత్తనున్నట్లు సమాచారం. టీమిండియా.. ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా చివరిదైన ఐదో టెస్టు కరోనా..

Published : 09 Nov 2021 13:40 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇన్నాళ్లు టీమిండియా హెడ్ కోచ్‌గా సేవలందించిన రవిశాస్త్రి మరోసారి కామెంటేటర్‌ అవతారం ఎత్తనున్నట్లు సమాచారం. టీమిండియా.. ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా చివరిదైన ఐదో టెస్టు కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే, ఈ టెస్టు మ్యాచ్‌ను వచ్చే ఏడాది నిర్వహించేందుకు ఇరు బోర్డులు కలిసి షెడ్యూల్‌ ఖరారు చేశాయి. అన్ని కుదిరితే ఈ టెస్టుకే రవిశాస్త్రి కామెంటరీ అందించే అవకాశమున్నట్లు వార్తలొస్తున్నాయి. శాస్త్రి కూడా అందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది! టీమిండియా కోచ్‌గా బాధ్యతలు చేపట్టక ముందు రవిశాస్త్రి కామెంటేటర్‌గా పని చేసిన విషయం తెలిసిందే.

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో నమీబియాపై టీమిండియా ఘన విజయం సాధించి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌ అనంతరం రవిశాస్త్రి మీడియాతో మాట్లాడాడు. ‘టీమిండియా కోచ్‌గా అత్యుత్తమ సేవలందించేందుకు ప్రయత్నించాను. టీమిండియా విదేశాల్లో ఎన్నో విజయాలు సాధించింది. ఆస్ట్రేలియాను సొంత గడ్డపైనే ఓడించింది. ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో ఆధిక్యంలో నిలిచింది’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా వాయిదా పడిన ఐదో టెస్టు గురించి మాట్లాడుతూ.. ‘ఆ టెస్టుకు నేనే కామెంటేటర్‌గా వ్యవహరిస్తానేమో’ అని శాస్త్రి అన్నాడు. మరోవైపు, వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్‌లోకి కొత్తగా వచ్చిన అహ్మదాబాద్ జట్టుకు రవిశాస్త్రి కోచ్‌గా వ్యవహరించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని