Dravid: ద్రవిడ్‌ కోచ్‌ అయితే.. పక్కా బ్లూప్రింట్‌తో వచ్చేస్తాడు: ఆకాశ్‌ చోప్రా

భారత క్రికెట్‌ జట్టు హెడ్‌ కోచ్‌ పదవికి ‘మిస్టర్‌ డిపెండబుల్‌’ రాహుల్‌ ద్రవిడ్‌ దరఖాస్తు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న.. 

Published : 31 Oct 2021 01:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత క్రికెట్‌ జట్టు హెడ్‌ కోచ్‌ పదవికి రాహుల్‌ ద్రవిడ్‌ దరఖాస్తు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న రవిశాస్త్రి స్థానంలో రాహుల్‌ నియామకం లాంఛనమే. ఈ క్రమంలో టీమ్‌ఇండియాను విజయవంతంగా నడిపేందుకు బ్లూప్రింట్‌తో రాహుల్‌ ద్రవిడ్‌ వస్తాడని మాజీ క్రికెటర్‌, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా అన్నాడు. రాహుల్‌ ద్రవిడ్‌ కోచ్‌ పదవి చేపడితే దీర్ఘకాలం జట్టు విజయం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తాడని వివరించాడు. ఈ మేరకు తన యూట్యూబ్‌ షోలో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘టీమ్‌ఇండియా కోసం రాహుల్‌ ఒక ప్రాసెస్‌ను ప్రవేశపెడతాడు. అతడు ఎంపికైతే.. ఐదేళ్లకు గానూ బ్లూ ప్రింట్‌ను సిద్ధం చేసుకుని వస్తాడు. స్వల్ప వ్యవధి కోసం కాకుండా ఐదేళ్ల నుంచి పదేళ్ల దీర్ఘకాలిక ప్రణాళికలతో రావొచ్చు’’ అని వివరించాడు. 

జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) ఛైర్మన్‌గా, అండర్‌-19 జట్టు కోచ్‌గా ఇప్పటికే రాహుల్‌ ద్రవిడ్‌ ప్రశంసలు అందుకున్నాడు. విరాట్‌, రోహిత్‌తో ద్రవిడ్‌ కాంబినేషన్‌ చాలా ఆసక్తిగా ఉంటుందని ఆకాశ్‌ చోప్రా పేర్కొన్నాడు. ‘‘త్వరలోనే పొట్టి ఫార్మాట్‌లో రోహిత్-రాహుల్ ద్రవిడ్‌ (ఆర్-ఆర్‌), టెస్టు క్రికెట్‌లో కోహ్లీతో జట్టుకట్టడం చూడబోతున్నాం. ఇది చాలా ఉత్తేజభరితంగా ఉండబోతుంది. అధికారికంగా ద్రవిడ్‌ దరఖాస్తు చేసుకున్నాడు కాబట్టి.. ఇతర దరఖాస్తులను బీసీసీఐ పరిగణనలోకి తీసుకుంటుందని అనుకోవడం లేదు’’ అని ఆకాశ్‌ చోప్రా అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని