WTC Final: రిజర్వ్‌డేకు చేరిన తుదిపోరు.. 

భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ రిజర్వ్‌డేకు చేరింది. ఐదోరోజు ఆట నిలిచే సమయానికి భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 64/2తో నిలిచింది...

Updated : 22 Jun 2021 23:47 IST

రెండో ఇన్నింగ్స్‌ ఆడుతున్న టీమ్‌ఇండియా
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌ 249 ఆలౌట్‌..

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ రిజర్వ్‌డేకు చేరింది. ఐదోరోజు ఆట నిలిచే సమయానికి భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 64/2తో నిలిచింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ(30; 81 బంతుల్లో 2x4), శుభ్‌మన్‌గిల్‌(8; 33 బంతుల్లో) నిరాశపరిచారు. వీరిద్దర్నీ టిమ్‌సౌథీ వికెట్ల ముందు దొరకబుచ్చుకొని ఔట్‌ చేశాడు. దాంతో భారత్‌ 51 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలోనే జోడీ కట్టిన చెతేశ్వర్‌ పుజారా(12; 55 బంతుల్లో 2x4), కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(8; 12 బంతుల్లో) చివరి వరకు క్రీజులో నిలిచారు. దాంతో టీమ్‌ఇండియా ప్రస్తుతం 32 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. అంతకుముందు న్యూజిలాండ్‌ 101/2 ఓవర్‌నైట్ స్కోరుతో మంగళవారం ఐదోరోజు ఆట కొనసాగించగా తొలి ఇన్నింగ్స్‌లో 249 పరుగులకు ఆలౌటైంది. మహ్మద్‌ షమి 4/76, ఇషాంత్‌ శర్మ 3/48 కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు.

తొలుత కేన్‌ విలియమ్సన్‌(49; 177 బంతుల్లో 6x4), రాస్‌టేలర్‌(11; 37 బంతుల్లో 2x4) గంటసేపు వికెట్లు కాపాడుకునే ప్రయత్నం చేసినా తర్వాత ఆ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. 117 పరుగుల వద్ద షమి.. టేలర్‌ను మూడో వికెట్‌గా పెవిలియన్‌ పంపి ఐదో రోజు వికెట్ల వేట ప్రారంభించాడు. ఆ తర్వాత భోజన విరామానికి ముందు వరుస ఓవర్లలో ఇషాంత్‌, షమి.. హెన్రీ నికోల్స్‌(7), జేబీ వాట్లింగ్‌(1)ను ఔట్‌ చేశారు. దాంతో ఒక్కసారిగా టీమ్‌ఇండియా పోటీలోకి వచ్చింది. అప్పటికి కివీస్‌ స్కోర్‌ 135/5గా నమోదైంది. ఇక రెండో సెషన్‌లో మరింత విజృంభించిన భారత బౌలర్లు మిగిలిన ఐదు వికెట్లు తీశారు. విలియమ్సన్‌ కాస్త పోరాడినా మిగతా బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌కు క్యూ కట్టారు. అయితే, చివర్లో టెయిలెండర్లు కైల్‌ జేమీసన్‌(21; 16 బంతుల్లో 1x6), టిమ్‌ సౌథీ(30; 46 బంతుల్లో 1x4, 2x6) ధాటిగా ఆడి న్యూజిలాండ్‌ స్కోరును 249 పరుగులకు చేరవేశారు. ఈ క్రమంలోనే తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 32 పరుగుల స్వల్ప ఆధిక్యం సంపాదించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని