Rizwan: ఐసీయూలో 35 గంటల పాటు.. మేమే ఆశ్చర్యపోయాం: భారతీయ వైద్యుడు

టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో పాకిస్థాన్‌ పరాజయం పాలైంది. ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో..

Published : 14 Nov 2021 01:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్: టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో పాకిస్థాన్‌ పరాజయం పాలైంది. ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఆసీస్ పైచేయి సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ క్రమంలో పాక్‌ ఆటతీరుతో క్రీడాభిమానుల మనసు గెలుచుకుంటే.. వికెట్‌ కీపర్‌ మహమ్మద్‌ రిజ్వాన్‌ను అయితే స్వదేశం సహా యావత్‌ క్రికెట్‌ ప్రపంచం అభినందనలతో ముంచెత్తింది. మ్యాచ్‌కు ముందు రెండు రోజులపాటు ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొంది మరీ కీలక పోరు కోసం సమాయత్తం కావడం ప్రశంసల వర్షం కురిపించింది. అయితే రిజ్వాన్‌కు చికిత్సను అందించిన వైద్య సిబ్బందిలో భారతీయ వైద్యుడు ఉండటం విశేషం. రిజ్వాన్‌ ఆరోగ్య పరిస్థితి, ఫిట్‌నెస్‌ సాధించడంపై ఇవాళ వివరాలను వెల్లడించారు. సెమీఫైనల్‌ మ్యాచ్‌ కోసం రిజ్వాన్‌ వేగంగా రికవరీ కావడం తమనే ఆశ్చర్యానికి గురి చేసిందని డాక్టర్‌ సహీర్‌ సైనాలబ్దీన్‌ పేర్కొన్నారు.

మహమ్మద్‌ రిజ్వాన్‌ ఆసుపత్రిలో చేరడానికి మూడు రోజుల ముందు స్వల్ప జ్వరం, దగ్గు, ఛాతిలో బిగించి ఉన్నట్లుగా ఉండే లక్షణాలతో బాధపడ్డాడు. వెంటనే వైద్యబృందం ఛాతిలోని నొప్పిని తగ్గించేందుకు ఎంతో శ్రమించింది. ఆసుపత్రిలో రిజ్వాన్‌ ఉన్న సమయంలోనూ మ్యాచ్‌ ఆడేందుకు రిజ్వాన్‌ ఎంతో నమ్మకంగా ఉండేవాడని సహీర్‌ తెలిపారు. ‘‘మ్యాచ్‌ను ఆడాల్సిందే. జట్టుతో ఉండాలని అనేవాడు. కీలకమైన నాకౌట్‌ మ్యాచ్‌లో దేశం తరఫున ఆడాలని బలంగా కోరుకునేవాడు. దృఢంగా, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. అయితే అతడు కోలుకున్న స్పీడ్‌ను చూసి నేనైతే చాలా ఆశ్చర్యపోయా’’ అని డాక్టర్‌ సహీన్‌ చెప్పుకొచ్చారు. ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌ కారణంగా అకస్మాత్తుగా తీవ్రమైన ఛాతినొప్పి వచ్చే అవకాశం ఉందని.. కొన్ని నిమిషాల నుంచి గంటలపాటు నొప్పి ఉంటుందని వైద్యుడు సహీన్‌ తెలిపారు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వారెవరైనా సరే కోలుకుని ఫిట్‌నెస్‌ సాధించడానికి కనీసం ఐదు నుంచి ఏడు రోజుల సమయం పడుతుందని పేర్కొన్నారు. దాదాపు 35 గంటలపాటు ఐసీయూలో ఉన్నాడని గుర్తు చేసుకున్నారు. ఆరోగ్యం మెరుగుదల కోసం తీవ్రంగా కృషి చేసిన వైద్య సిబ్బందికి రిజ్వాన్‌ తన సంతకంతో కూడిన జెర్సీని బహూకరించాడు.

Read latest Sports News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని