
స్పిన్ మాయ: ఇంగ్లాండ్ 81 ఆలౌట్
భారత్ విజయ లక్ష్యం 49
(Pic: BCCI)
అహ్మదాబాద్: ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ ముగిసింది. స్పిన్ ద్వయం అక్షర్ పటేల్ (5/32), అశ్విన్ (4/48) మరోసారి ఆ జట్టును ఘోరంగా దెబ్బకొట్టారు. ప్రత్యర్థిని 81 పరుగులకే ఆలౌట్ చేశారు. దాంతో ఇంగ్లిష్ జట్టు కోహ్లీసేన ముందు 49 పరుగుల విజయ లక్ష్యమే ఉంచగలిగింది. బెన్‌స్టోక్స్ (25; 34 బంతుల్లో 3×4), జో రూట్ (19; 45 బంతుల్లో) మినహా ప్రత్యర్థి జట్టులో మరెవ్వరూ రాణించలేకపోయారు.
మళ్లీ అక్షరే
తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ను త్వరగానే ఔట్ చేసిన ఆనందం ఇంగ్లాండ్‌కు ఎక్కువసేపు దక్కలేదు. పరుగుల ఖాతా ఆరంభించకముందే ఓపెనర్ జాక్ క్రాలీ (0), వన్‌డౌన్ ఆటగాడు జానీ బెయిర్ స్టో (0)ను అక్షర్ పటేల్ క్లీన్ బౌల్డ్ చేశాడు. కాసేపు క్రీజులో నిలిచిన డొమినిక్ సిబ్లీ (7; 25 బంతుల్లో)నీ అతడే పెవిలియన్ పంపించి 19/3తోఆంగ్లేయులపై తీవ్ర ఒత్తిడి పెంచాడు.
స్పిన్నర్లకే 10 వికెట్లు
వెంటవెంటనే మూడు వికెట్లు చేజార్చుకున్న ఇంగ్లాండ్‌ను కెప్టెన్ జో రూట్ (19)తో కలిసి బెన్‌స్టోక్స్ (25) ఆదుకొనే ప్రయత్నం చేశాడు. దూకుడుగా రెండు బౌండరీలు బాదాడు. ప్రమాదకరంగా మారేలా కనిపించిన ఆ జోడీని జట్టు స్కోరు 50 వద్ద స్టోక్స్‌ను ఔట్ చేయడం ద్వారా అశ్విన్ విడదీశాడు. ఇక 56 వద్ద రూట్‌ను ఔట్ చేసి ఒక టెస్టులో 10 వికెట్ల ఘనత అందుకున్నాడు. మరికాసేపటికే ఒలీ పోప్ (12)ను యాష్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. అప్పటికి ఇంగ్లాండ్ స్కోరు 66/6. ఇక టెయిలెండర్లు ఎంతో సేపు నిలవలేదు. జోఫ్రా ఆర్చర్ (0), జాక్ లీచ్ (9; 22 బంతుల్లో 1×6)ను అశ్విన్ పెవిలియన్ పంపించాడు. బెన్‌ఫోక్స్ (8; 28 బంతుల్లో)ను అక్షర్, అండర్సన్ (0)ను సుందర్ ఔట్ చేసి ఇంగ్లాండ్‌ను 81కి పరిమితం చేశారు.