‘గులాబి’ ఘనతలు: ధోనీ రికార్డుకు కోహ్లీ బీటలు

భారత్‌, ఇంగ్లాండ్‌ మూడో టెస్టులో కొన్ని రికార్డులు బద్దలు అయ్యాయి. సొంతగడ్డపై అత్యుత్తమ సారథిగా విరాట్‌ కోహ్లీ అవతరించాడు. అతడు మహీ రికార్డును తిరగరాశాడు. మరోవైపు సీనియర్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ 400 వికెట్ల ఘనత అందుకొన్నాడు. అక్షర్‌ పటేల్‌ ఆడుతున్న రెండో టెస్టులోనే 10+ వికెట్లను..

Updated : 14 Jan 2022 12:28 IST

మోత మోగించిన అశ్విన్‌, అక్షర్

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌, ఇంగ్లాండ్‌ మూడో టెస్టులో కొన్ని రికార్డులు బద్దలు అయ్యాయి. సొంతగడ్డపై అత్యుత్తమ సారథిగా విరాట్‌ కోహ్లీ అవతరించాడు. అతడు మహీ రికార్డును తిరగరాశాడు. మరోవైపు సీనియర్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ 400 వికెట్ల ఘనత అందుకొన్నాడు. అక్షర్‌ పటేల్‌ ఆడుతున్న రెండో టెస్టులోనే 10+ వికెట్లను పడగొట్టి అద్భుతం చేశాడు. మొతేరా వేదికగా జరిగిన డే/నైట్‌ టెస్టులో టీమ్‌ఇండియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.


ధోనీ రికార్డు బద్దలు

భారత్‌ తరఫున అత్యంత విజయవంతమైన సారథిగా ఇప్పటికే విరాట్‌ కోహ్లీ ఘనత సాధించాడు. 35 విజయాలు అందుకున్నాడు. తాజాగా ఇంగ్లాండ్‌పై విజయంతో ఎంఎస్‌ ధోనీ రికార్డు బద్దలు కొట్టాడు. గతంలో సొంతగడ్డపై అత్యధిక విజయాల రికార్డు మహీ పేరుతో ఉండేది. అతడి సారథ్యంలో టీమ్‌ఇండియా భారత గడ్డపై 30 మ్యాచుల్లో 21 విజయాలు అందుకుంది. ఇప్పుడు కోహ్లీసేన 29 టెస్టుల్లో 22 విజయాలు నమోదు చేయడం గమనార్హం.


వేగంగా 400 వికెట్లు

టీమ్‌ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లాండ్‌తో మూడో టెస్టులో 400 వికెట్ల మైలురాయి అందుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 4, రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీసిన అతడు 77 టెస్టుల్లోనే 401 వికెట్లు తీయడం గమనార్హం. దాంతో భారత్‌ తరఫున ఈ ఘనత సాధించిన నాలుగో బౌలర్‌, మూడో స్పిన్నర్‌గా అవతరించాడు. అంతేకాకుండా ముత్తయ్య మురళీధరన్‌ తర్వాత ప్రపంచ క్రికెట్లో అత్యంత వేగంగా 400 వికెట్ల మైలురాయి చేరుకొందీ అశ్వినే కావడం గమనార్హం.


అక్షర్ అత్యుత్తమం‌

గాయపడ్డ రవీంద్ర జడేజా స్థానంలో జట్టులోకి వచ్చిన అక్షర్‌ పటేల్‌ అతడి స్థానాన్ని అంచనాలను మించి భర్తీచేశాడు. అరంగేట్రం టెస్టులో ఐదు వికెట్ల రికార్డు సాధించిన అతడు మొతేరాలో 10+ వికెట్ల ఘనత సొంతం చేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 6, రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టాడు. డే/నైట్‌ టెస్టులో 11/70తో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగానూ రికార్డు సృష్టించాడు. అంతకు ముందు 2018/19లో శ్రీలంకపై ప్యాట్‌ కమిన్స్‌ 10/62, 2016/17లో పాక్‌పై దేవేంద్ర బిషూ 10/174 ఈ ఘనత సాధించారు. అయితే అక్షర్‌వే మెరుగైన గణాంకాలు.


స్పిన్నర్ల స్వర్గధామం

డే/నైట్‌ టెస్టులో స్పిన్నర్లు అత్యధిక వికెట్లు తీసిందీ అహ్మదాబాద్‌ టెస్టులోనే. ఇంగ్లాండ్‌, భారత్‌ స్పిన్నర్లు మొత్తంగా 27 వికెట్లు పడగొట్టారు. అంతకు ముందు దుబాయ్‌లో పాక్×శ్రీలంక‌ మ్యాచులో 24, పాక్‌×వెస్టిండీస్‌ టెస్టులో 22, ఆసీస్‌×న్యూజిలాండ్‌ పోరులో 8 వికెట్లు తీశారు.


 ఇంగ్లాండ్‌ అత్యల్ప స్కోర్‌

టీమ్‌ఇండియాపై ఇంగ్లాండ్‌ చేసిన అత్యల్ప స్కోరు 81. మొతేరా రెండో ఇన్నింగ్స్‌లో నమోదైంది. 1971లో ఓవల్‌లో 101, 1979/80లో ముంబయిలో 102, 1986లో లీడ్స్‌లో 102, 2020/21లో అహ్మదాబాద్‌లో 112 మిగిలిన నాలుగు సందర్భాలు.


తొలి బంతికే వికెట్‌

అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో ఇన్నింగ్స్‌ తొలి బంతికే వికెట్‌ తీసిన బౌలర్లు కేవలం నలుగురే. 1888లో ఆసీస్‌పై బాబ్‌ పీల్‌, 1907లో ఇంగ్లాండ్‌పై బెర్ట్‌ వోగ్లర్‌, చెన్నై టెస్టులో ఇంగ్లాండ్‌పై అశ్విన్‌ ఈ ఘనత సాధించారు. మొతేరా టెస్టులో అక్షర్‌ పటేల్‌ ఈ జాబితాలో సరికొత్తగా చేరాడు. రెండో ఇన్నింగ్స్‌లో తొలి బంతికే జాక్‌ క్రాలీని పెవిలియన్‌ పంపించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని