
IPL 2021: బెంగళూరు ఓపెనర్లే రాణించారు.. చెన్నై లక్ష్యం 157 పరుగులు
షార్జా: ఎన్నాళ్లకెన్నాళ్లకు..! బెంగళూరు బ్యాటింగ్ తొలి పది ఓవర్లు చూస్తున్నంత సేపూ కోహ్లీ గురించి, ఆర్సీబీ ప్రదర్శన గురించి సగటు ప్రేక్షకుడు దాదాపు ఇదే అనుకుని ఉంటాడు. తొలి బంతి నుంచే కోహ్లీ చెలరేగిపోయాడు. అతడికి యువ బ్యాటర్ పడిక్కల్ తోడయ్యాడు. ఇంకేముంది.. బెంగళూరు ఇవాళ ఓ డబుల్ సెంచరీ కొట్టేస్తుందని ఊహించారంతా. కానీ మిడిలార్డర్ మరోసారి ఆ జట్టును దెబ్బతీసింది. భారీ స్కోరు చేస్తుందనుకున్న ఆర్సీబీ ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. షార్జా వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. చెన్నై ముందు 157 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఆరంభం బాగున్నా.. చివర్లో విఫలం
కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ఘోరంగా విఫలమైన బెంగళూరు ఓపెనర్లు.. చెన్నైతో మ్యాచ్‌లో మాత్రం చెలరేగిపోయారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ ఓపెనర్లు విరాట్ కోహ్లీ (53), పడిక్కల్ (70) తొలి వికెట్‌కు 111 పరుగులు జోడించారు. అయితే విరాట్ కోహ్లీ ఔటైన తర్వాత వచ్చిన ఏబీ డివిలియర్స్ (12) ఎక్కువసేపు నిలవలేదు. చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో వరుస బంతుల్లో ఏబీడీతోపాటు పడిక్కల్ ఔటయ్యారు. టిమ్ డేవిడ్ (1), మ్యాక్స్‌వెల్ (11), హర్షల్ పటేల్ (3) విఫలమయ్యారు. చెన్నై బౌలర్లలో బ్రావో 3, ఠాకూర్ 2, చాహర్ ఒక వికెట్ పడగొట్టారు.