
IPL 2022 : భారత్‌లోనే ఐపీఎల్ 2022 మ్యాచ్‌లు.. కానీ..!
ఇంటర్నెట్ డెస్క్: భారతీయ క్రికెట్ అభిమానులకు ఆనందంతోపాటు కాస్త నిరుత్సాహానికి గురి చేసే వార్త.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ ) 2022 సీజన్ మ్యాచ్‌లను భారత్‌లోనే నిర్వహించాలని నిర్ణయించినట్లు బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. అయితే కొవిడ్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్‌లు జరుగుతాయని సమాచారం. ‘‘భారత్‌లోనే ఐపీఎల్ 2022 పోటీలు జరుగుతాయి. కరోనా నేపథ్యంలో ప్రేక్షకులు లేకుండా టోర్నమెంట్‌ను నిర్వహిస్తాం. ముంబయిలోని వాంఖడే స్టేడియం, డీవై పాటిల్ స్టేడియంలోనే మ్యాచ్‌లు నిర్వహించేందుకు చూస్తున్నాం. అవసరమైతే పుణె మైదానాన్ని కూడా పరిశీలిస్తాం’’ అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
ఐపీఎల్ మెగా వేలం కోసం ఇప్పటికే ఆటగాళ్ల రిజిస్ట్రేషన్ గడువు ముగిసింది. మొత్తం 1,214 మంది ప్లేయర్లు (896 మంది భారతీయులు, 318 మంది విదేశీయులు) రిజిస్టర్ చేసుకున్నారు. ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో బెంగళూరు వేదికగా రెండు రోజులపాటు మెగా వేలం జరగనుంది.