IPL 2021: చెన్నైకి తిరుగులేదు.. బెంగళూరుకు ఓటమి తప్పలేదు

ఐపీఎల్‌ 2021 సీజన్‌ తొలి సగం భాగంలో అద్భుత ప్రదర్శనతో టైటిల్‌ను సాధించే అవకాశాలను సృష్టించుకున్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు.. యూఏఈ వేదికగా జరుగుతున్న

Updated : 24 Sep 2021 23:37 IST

షార్జా: ఐపీఎల్‌ 2021 సీజన్‌ తొలి సగం భాగంలో అద్భుత ప్రదర్శనతో టైటిల్‌ను సాధించే అవకాశాలను సృష్టించుకున్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు.. యూఏఈ వేదికగా జరుగుతున్న సెకండ్‌ హాఫ్‌లో మాత్రం తేలిపోతోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓడిపోయింది. మొన్న కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ఘోరపరాభవం ఎదుర్కొన్న ఆర్‌సీబీ.. ఇవాళ చెన్నై సూపర్‌ కింగ్స్‌తోనూ ఓటమి చెందింది. బ్యాటర్లు, బౌలర్ల  సమష్టి కృషితో సీఎస్‌కే విజయం సాధించింది. చెన్నై ఆల్‌రౌండర్‌ బ్రావో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అందుకున్నాడు. దీంతో పాయింట్ల పట్టికలో 14 పాయింట్లతో చెన్నై అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. ఆర్‌సీబీ (10) మూడో స్థానంలోనే కొనసాగుతున్నప్పటికీ ప్లే ఆఫ్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంటుంది.

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుపై చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్లు విజృంభించడంతో ధాటిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆర్‌సీబీ.. మిడిలార్డర్‌ తేలిపోవడంతో ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో సీఎస్‌కే నాలుగు వికెట్లను కోల్పోయి 18.1 ఓవర్లలో 157 పరుగులు చేసి విజయం సాధించింది. చెన్నై బ్యాటర్లలో రుతురాజ్‌ గైక్వాడ్ 38, డుప్లెసిస్ 31, మొయిన్ అలీ 23, అంబటి రాయుడు 32, సురేశ్‌ రైనా 17*, ధోని 11* పరుగులు చేశారు. బెంగళూరు బౌలర్లలో హర్షల్ పటేల్ 2.. చాహల్, మాక్స్‌వెల్‌ చెరో వికెట్ పడగొట్టారు.

వారిద్దరే రాణించారు... 

ఓపెనర్లు విరాట్ కోహ్లీ (53), పడిక్కల్ (70) అద్భుత అర్ధశతకాలు సాధించారు. అయితే ఓపెనర్ల ధాటికి ఆర్‌సీబీ స్కోరు బుల్లెట్‌ మాదిరిగా దూసుకుపోయినా.. మిడిలార్డర్‌ విఫలం కావడం ఆ జట్టును దెబ్బతీసింది. ఏబీ డివిలియర్స్ 12, టిమ్‌ డేవిడ్‌ 1, మ్యాక్స్‌వెల్ 11, హర్షల్‌ పటేల్‌ 3 పరుగులు చేశారు. మిడిలార్డర్ పరుగులు చేసేందుకు ఇబ్బంది పడటంతో ఆర్‌సీబీ 156 పరుగులకే పరిమితం కావాల్సి వచ్చింది. చెన్నై బౌలర్లలో బ్రావో 3, ఠాకూర్ 2, చాహర్‌ ఒక వికెట్ పడగొట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని