IPL Mega Auction : ఐపీఎల్‌ మెగా వేలంలోకి 1,214మంది.. విదేశీయుల్లో వారే టాప్‌

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్)లో అవకాశం కోసం పెద్ద పెద్ద స్టార్లతో ...

Updated : 22 Jan 2022 12:54 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్)లో అవకాశం కోసం పెద్ద పెద్ద స్టార్లతో పాటు యువ క్రికెటర్లు ఉత్సాహంగా ఎదురు చూస్తుంటారు. ఇలాంటి వారి కోసమే ఐపీఎల్‌ మెగా వేలం వచ్చే నెలలో జరగనుంది. ఎనిమిది ఫ్రాంచైజీలు ఆటగాళ్లను రిటెయిన్‌ చేసుకోవడం, కొత్త జట్లు ముగ్గురేసి ప్లేయర్లను ఎంపిక చేసుకోవడం ఇప్పటికే పూర్తైంది. మిగతా క్రికెటర్లంతా మెగా వేలంలో తమ పేర్లను రిజిస్టర్‌ చేసుకునే గడువు (జనవరి 20) కూడా ముగిసింది. ఈ నేపథ్యంలో వచ్చే మెగా వేలం కోసం 1,214 మంది ఆటగాళ్లు రిజిస్టర్‌ చేసుకున్నట్లు ఐపీఎల్ నిర్వాహకులు పేర్కొన్నారు. ఇందులో 896 మంది భారతీయ క్రికెటర్లు కాగా.. 318 మంది విదేశీయులు ఉన్నారు. 270 మంది క్యాప్‌డ్‌ (జాతీయ జట్టు తరఫున ఆడినవారు), 903 మంది అన్‌క్యాప్‌డ్ (జాతీయ జట్టుకు ఆడని వారు), 41 మంది అసోసియేట్‌ ప్లేయర్లు రిజిస్టర్‌ చేసుకున్నారు.

విదేశీయుల్లో అత్యధికంగా ఆసీస్‌కు చెందిన 59 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు ఐపీఎల్‌ నిర్వాహకులు పేర్కొన్నారు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా (48), శ్రీలంక (36), ఇంగ్లాండ్ (30), న్యూజిలాండ్‌ (29), అఫ్గానిస్థాన్‌ (20) దేశాలు ఉన్నాయి. నేపాల్‌ (15), యూఎస్‌ఏ (14), నమీబియా (5), ఒమన్ (3), భూటాన్‌ (1), యూఏఈ (1), నెదర్లాండ్స్‌ (1), స్కాట్లాండ్‌ వంటి అసోసియేట్ దేశాల ఆటగాళ్లు సైతం మెగా వేలంలో పేర్లను రిజిస్టర్ చేసుకోవడం విశేషం. ప్రతి ఫ్రాంచైజీ తమ జట్టులో గరిష్ఠంగా 25 మంది ఆటగాళ్లను ఉంచుకోవచ్చు. మొత్తం పది జట్లు కలిపి 250 మందిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఫ్రాంచైజీలు కొంతమందిని రిటెయిన్, సెలెక్ట్ చేసుకోవడంతో మెగా వేలం నుంచి 217 మందిని కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. ఫిబ్రవరి రెండో వారంలో మెగా వేలం జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని