2018 తర్వాత ఇషాంత్‌ ఎలా ఆడుతున్నాడంటే... 

అరంగేట్రం నుంచి సుదీర్ఘ ఫార్మాట్లో 300 వికెట్లు పడగొట్టిన మూడో భారత పేసర్‌గా నిలిచే వరకూ ఇషాంత్‌ శర్మ ప్రయాణంలో ఒడుదొడుకులు ఎన్నో. 18 ఏళ్ల వయసులో జట్టులోకి దూసుకొచ్చి...

Updated : 09 Feb 2021 08:20 IST

18 ఏళ్ల వయసులో జట్టులోకి దూసుకొచ్చి..

చెన్నై: అరంగేట్రం నుంచి సుదీర్ఘ ఫార్మాట్లో 300 వికెట్లు పడగొట్టిన మూడో భారత పేసర్‌గా నిలిచే వరకూ ఇషాంత్‌ శర్మ ప్రయాణంలో ఒడుదొడుకులు ఎన్నో. 18 ఏళ్ల వయసులో జట్టులోకి దూసుకొచ్చి.. కెరీర్‌ ఆరంభంలో తన వేగంతో సత్తాచాటి జట్టులో ప్రాధాన్య పేసర్‌గా ఎదిగిన అతను.. ఆ తర్వాత వెనకబడ్డాడు. గాయాలు, ఫామ్‌ కోల్పోవడంతో ప్రదర్శన పడిపోతూ వచ్చింది. అయితే ఎదురుదెబ్బలు తగిలినా గట్టిగా నిలబడ్డ అతను.. ఎప్పటికప్పుడూ తన బౌలింగ్‌ను మెరుగు పర్చుకుంటూనే ఉన్నాడు. విదేశాల్లో పేస్‌కు అనుకూలమైన పిచ్‌లపై సత్తాచాటుతూనే.. భారత్‌లోనూ వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత ప్రదర్శన పడిపోవడంతో జట్టులోకి వస్తూ పోయాడు. కానీ 2007లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఇషాంత్‌.. పదేళ్ల తర్వాత సుదీర్ఘ ఫార్మాట్లో తన ప్రదర్శన అత్యుత్తమ స్థాయికి తీసుకెళ్లడం విశేషం. 2010 నుంచి 2017 వరకూ 60 టెస్టుల్లో 37.22  సగటుతో 172 వికెట్లు తీశాడు. కానీ 2018 తర్వాత 13 టెస్టుల్లో 19.78 సగటుతో 52 వికెట్లు పడగొట్టాడు. ఈ కాలంలో అతని సగటు.. రబాడ, అండర్సన్, బౌల్ట్, బ్రాడ్, హేజిల్‌వుడ్‌ కంటే మెరుగ్గా ఉండడం విశేషం. లైన్, లెంగ్త్‌ను సరి చేసుకుని వికెట్ల వేటలో దూసుకెళ్తున్నాడు. తాజాగా ఇంగ్లాండ్‌తో రెండో ఇన్నింగ్స్‌లో లారెన్స్‌ను ఔట్‌ చేసి.. టెస్టుల్లో 300 వికెట్లు తీసిన మూడో భారత్‌ పేసర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. తన కెరీర్‌ గురించి ఈ 32 ఏళ్ల పేసర్‌ మాట్లాడుతూ.. ‘‘నా కెరీర్‌ ఇప్పటివరకు ఒడుదొడుకులతో సాగింది. ఎంతో అనుభవం సాధించా. ఉపఖండంలో, విదేశాల్లో ఎలా బౌలింగ్‌ చేయాలో నేర్చుకున్నా. గాయం నుంచి కోలుకుని కేవలం నాలుగు టీ20లే ఆడి.. నేరుగా ఈ మ్యాచ్‌లో 34 ఓవర్లు బౌలింగ్‌ చేయడంతో కాస్త అలసటగా అనిపిస్తోంది. అయిదో రోజు ఆటలో మాకు మంచి ఆరంభం దక్కితే కచ్చితంగా లక్ష్యాన్ని ఛేదిస్తాం. భయమెరుగని బ్యాటింగ్‌ విభాగం మాకుంది’’ అని పేర్కొన్నాడు.

ఇవీ చదవండి..
ఆ భయాలతోనే ఇంగ్లాండ్ డిక్లేర్‌ చేయలేదా?
మేం ఛేదించగలం: లంబూ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని