
IPL 2021: ఆడటం కష్టమేనన్న స్టోక్స్
ఇంటర్నెట్ డెస్క్: నిరవధికంగా వాయిదా పడిన ఐపీఎల్ తిరిగి ప్రారంభమైనా తాను అందుబాటులో ఉండకపోవచ్చని ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ అన్నాడు. మరో 7-9 వారాల్లో వేలి గాయం నుంచి కోలుకుంటానని ధీమా వ్యక్తం చేశాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచులో స్టోక్స్ గాయపడ్డ సంగతి తెలిసిందే.
‘ఐపీఎల్ తిరిగి మొదలవుతుందో లేదో తెలియదు. ఈసీబీ చెప్పినట్టు ఆటగాళ్లకు సమయం దొరకడం కష్టమే. నిజానికి ఈ ఏడాది పూర్తి సీజన్ ఆడాలనుకున్నా. కానీ, గాయం కావడంతో నిరాశపడ్డాను. మొదట్లో వెనుకాడినా శస్త్రచికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకున్నా. మళ్లీ నేను ఆడే తేదీని కచ్చితంగా చెప్పలేను. మూడు నెలలు పడుతుందని భయపడ్డాను. ఇప్పుడు 7-9 వారాల్లో మెరుగవుతానన్న నమ్మకం ఏర్పడింది’ అని స్టోక్స్ అన్నాడు.
వేలి ఎముక బలం పుంజుకొనేందుకు కాస్త సమయం పడుతుందని స్టోక్స్ చెప్పాడు. ఇదేమీ సాంకేతిక అంశం కాదని.. సమయం పడుతుందని పేర్కొన్నాడు. రాజస్థాన్ రాయల్స్‌కు కోరుకున్న సమయం కన్నా ముందే గుడ్‌బై చెప్పడం కఠినంగా అనిపించిందన్నాడు. ఇప్పుడు వాయిదా పడటంతో అందరూ ముందుగానే కుటుంబ సభ్యులతో కలిసి వెనక్కి వెళ్లిపోవాల్సి వచ్చిందని తెలిపాడు. ప్రస్తుతం భారత్ కఠిన పరిస్థితులను ఎదుర్కొంటోందని వెల్లడించాడు.