T20 World Cup: ఒక్క ఐసీసీ ట్రోఫీ గెలవకపోవడం రవిశాస్త్రికి పెద్దలోటు..

కోచ్‌గా రవిశాస్త్రి నేతృత్వంలో విదేశాల్లో ఎన్నో ఘన విజయాలు సాధించిన టీమిండియా.. ఒక్క ఐసీసీ ట్రోఫీ సాధించలేకపోవడం పెద్ద లోటని మాజీ క్రికెటర్‌ ఆకాశ్ చోప్రా అన్నాడు. ‘కోచ్‌గా రవిశాస్త్రి..

Published : 08 Nov 2021 16:43 IST

మాజీ క్రికెటర్‌ ఆకాశ్ చోప్రా

ఇంటర్నెట్ డెస్క్‌: కోచ్‌గా రవిశాస్త్రి నేతృత్వంలో విదేశాల్లో ఎన్నో ఘన విజయాలు సాధించిన టీమిండియా.. ఒక్క ఐసీసీ ట్రోఫీ సాధించలేకపోవడం పెద్ద లోటని మాజీ క్రికెటర్‌ ఆకాశ్ చోప్రా అన్నాడు. ‘కోచ్‌గా రవిశాస్త్రి నేతృత్వంలో భారత్ మూడు ఐసీసీ టోర్నీల్లో పాల్గొంది. అయితే, ఒక్క దాంట్లో కూడా ఛాంపియన్‌గా నిలవలేకపోయింది. ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో అయితే కనీసం సెమీ ఫైనల్‌కి కూడా అర్హత సాధించలేకపోయింది. అయితే, ద్వైపాక్షిక సిరీస్‌ల్లో గొప్పగా రాణిస్తోన్న టీమిండియా.. ఐసీసీ టోర్నమెంట్లలో మాత్రం చతికిలపడుతోంది. కోచ్‌గా అతడికి ప్రస్తుత టీ20 ప్రపంచకప్పే చివరిది. ఇకపై అతడిని టీమిండియా కోచ్‌గా చూడలేం. రవిశాస్త్రి లాంటి గొప్ప కోచ్‌ నేతృత్వంలో భారత్ ఒక్క ట్రోఫీ కూడా సాధించకపోవడం పెద్దలోటే’ అని ఆకాశ్‌ చోప్రా అన్నాడు. 

అయితే, కోచ్‌గా రవిశాస్త్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత టెస్టుల్లో టీమిండియా ఎన్నో మరుపురాని విజయాలు సాధించిందని ఆకాశ్‌ చోప్రా పేర్కొన్నాడు. ‘రవిశాస్త్రి నేతృత్వంలో ఆస్ట్రేలియాలో పర్యటించిన టీమిండియా.. రెండు సార్లు ఆ జట్టును తన సొంత గడ్డపైనే మట్టికరిపించింది. ఇంగ్లాండ్‌ పర్యటనలో కూడా 2-1 ఆధిక్యంలో నిలిచింది. దక్షిణాఫ్రికాలో కూడా టీమిండియా గొప్పగా రాణించింది’ అని ఆకాశ్‌ చోప్రా పేర్కొన్నాడు. రవిశాస్త్రి నేతృత్వంలో ఒక్క న్యూజిలాండ్‌లోనే భారత జట్టు ఇప్పటి వరకు పర్యటించలేదు. త్వరలో టీమిండియా కొత్త కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్న రాహుల్ ద్రావిడ్‌ నేతృత్వంలో భారత జట్టు న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని