రాహుల్‌ అండ.. గేల్‌ ప్రోత్సాహం.. కుంబ్లే ఓదార్పు

కోల్‌కతాపై చేసిన అజేయ అర్ధశతకం తనకెంతో ప్రత్యేకమని పంజాబ్‌ ఓపెనర్‌ మన్‌దీప్‌ సింగ్‌ అన్నాడు. తాను లయ అందుకొనేందుకు, స్వేచ్ఛగా ఆడేందుకు కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ ఎంతో అండగా నిలిచాడని పేర్కొన్నాడు....

Published : 27 Oct 2020 15:04 IST

అందువల్లే స్వేచ్ఛగా ఆడలిగానన్న మన్‌దీప్‌

(తల్లితో మన్‌దీప్‌)

షార్జా: కోల్‌కతాపై చేసిన అజేయ అర్ధశతకం తనకెంతో ప్రత్యేకమని పంజాబ్‌ ఓపెనర్‌ మన్‌దీప్‌ సింగ్‌ అన్నాడు. తాను లయ అందుకొనేందుకు, స్వేచ్ఛగా ఆడేందుకు కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ ఎంతో అండగా నిలిచాడని పేర్కొన్నాడు. మ్యాచులో ఎన్ని పరుగులు చేసినా నాటౌట్‌గా నిలవాలనే తన తండ్రి కోరుకొనేవారని వెల్లడించాడు. అర్ధశతకం అందుకోగానే మన్‌దీప్‌ భావోద్వేగానికి గురైన సంగతి తెలిసిందే.

కోల్‌కతా మ్యాచులో మన్‌దీప్‌ 56 బంతుల్లో 66 పరుగులతో అజేయంగా నిలిచాడు. పంజాబ్‌ వరుసగా ఐదో విజయం సాధించేందుకు తన వంతు పాత్ర పోషించాడు. అంతకు ముందు శనివారం దుబాయ్‌ వేదికగా హైదరాబాద్‌తో పంజాబ్‌ తలపడింది. అదే రోజు మన్‌దీప్‌ తండ్రి భారత్‌లో కన్నుమూశారు. బయో బుడగ, క్వారంటైన్‌ ఇబ్బందులతో అతడు స్వదేశానికి వెళ్లలేకపోయాడు. వీడియోకాల్‌ ద్వారా తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యాడు. గుండె దిటవు చేసుకొని హైదరాబాద్‌ మ్యాచులో 17 పరుగులు చేశాడు.

మోర్గాన్‌ సేనపై అర్ధశతకం చేయగానే మన్‌దీప్‌ భావోద్వేగానికి గురయ్యాడు. బ్యాటును, పిడికిలిని ఆకాశం వైపు చూపిస్తూ తండ్రికి నివాళి అర్పించాడు. ఆ సమయంలో అతడి కళ్లలో నీటిచెమ్మ కనిపించింది. దాంతో మరో ఎండ్‌లో ఉన్న క్రిస్‌గేల్‌ సైతం మన్‌దీప్‌ తండ్రికి నివాళి అర్పించి అతడిని ఓదార్చాడు. టైమ్‌ఔట్‌ రాగానే కోచ్‌ అనిల్‌ కుంబ్లే, కెప్టెన్‌ రాహుల్‌, మరికొందరు ఆటగాళ్లు అతడి వద్దకు వచ్చి ప్రత్యేకంగా అభినందించారు. గుండెకు హత్తుకొని ఓదార్చారు. మ్యాచ్‌ ముగిశాక కోల్‌కతా ఆటగాళ్లు సైతం అతడిని పరామర్శించారు.

‘ఇదెంతో ప్రత్యేకమైన ఇన్నింగ్స్‌. ప్రతి మ్యాచులో అజేయంగా నిలవాలని మా నాన్నెప్పుడూ చెబుతుండే వారు. అందుకే ఇదెంతో ప్రత్యేకం. మ్యాచులో 100, 200 చేసినా నాటౌట్‌గా నిలవాలనే చెప్తుండేవారు. మ్యాచ్‌కు ముందు నేను రాహుల్‌తో మాట్లాడాను. గత మ్యాచులో దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించాను. కానీ ఎందుకో సౌకర్యంగా అనిపించలేదు. అందుకే నేను నా శైలిలో కుదురుగా ఆడి మ్యాచును గెలిపిస్తానని, నాపై నమ్మకం ఉంచాలని అడిగాను. అందుకు రాహుల్‌ అంగీకరించాడు. నా సహజ శైలిలో ఆడేందుకు అండగా నిలిచాడు. గేల్‌ సైతం నేను చివరి వరకు ఆడేందుకు ప్రోత్సహించాడు. నువ్వెప్పుడూ రిటైర్‌ అవ్వొద్దని నేను బదులిచ్చాను. అతనెంతో బాగా ఆడాడు’ అని మన్‌దీప్‌ చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని