Updated : 11/01/2021 19:38 IST

‘డ్రా’ కానే కాదిది.. ఆసీస్‌ పొగరుకు ఓటమి!

శెభాష్‌ టీమ్‌ఇండియా.. శెభాష్‌ యాష్‌, హనుమ, పంత్‌, పుజారా

టెస్టు క్రికెట్‌.. బ్యాటు, బంతి మధ్య సిసలైన పోరాటానికి అసలైన వేదిక. జట్టు సమన్వయం, బృంద స్ఫూర్తికి మొక్కవోని దీక్ష. ఆటగాళ్ల నైపుణ్యానికి శిఖరాగ్ర పరీక్ష. అందుకే సుదీర్ఘ ఫార్మాట్లో మ్యాచ్‌ డ్రా అయినా కొన్నిసార్లు గెలుపుతో సమానమే. సిడ్నీలాంటి మ్యాచుల్లోనైతే అంతకన్నా ఎక్కువే. ఏంటా ఆట..! ఏంటా కసి..! ఏంటా పట్టుదల..! ఏంటా తెగువ..! ఏంటా సాహసం..! ఏంటా సహనం..! ఏంటా డిఫెన్స్‌..! ఏంటా బ్లాకథాన్‌..! శెభాష్ టీమ్‌ఇండియా.. శెభాష్‌!!

‘‘1980 తర్వాత ఒక టెస్టు నాలుగో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 131 ఓవర్లు ఆడటం ఇదే తొలిసారి. ఆస్ట్రేలియాపై అత్యధిక ఓవర్లు ఆడిన ఏకైక ఆసియా జట్టూ  భారతే’’

పై వాక్యానికి చెప్పలేనంత ప్రాముఖ్యం ఉంది. వెలకట్టలేనంత ప్రాధాన్యం ఉంది. అంచనా వేయలేనంత ఎత్తుగడ ఉంది. ఎందుకంటే.. 407 పరుగుల లక్ష్యం.. ఎదురుగా ప్రచండ వేగంతో బంతులు సంధిస్తున్న పేసర్లు.. ఒక్కో ఓవర్‌కు ఒక్కో రకంగా స్పందిస్తున్న పిచ్‌.. దేహం మీదకు దూసుకొస్తున్న బంతులు.. అప్పటికే దెబ్బలు తగిలించుకున్న బ్యాట్స్‌మెన్‌.. వారిద్దరూ ఔటైతే ఓటమి ఖాయం.. బ్యాట్స్‌మెన్‌కు అత్యంత సమీపంగా ఎనిమిది మంది ఫీల్డర్లు.. చేతిలో ఉన్నది ఐదు వికెట్లు.. అందులో పరుగులు చేసేవాడి వేలికి గాయం.. మిగిలింది టెయిలెండర్లు.. చెప్పలేనంత ఒత్తిడి. ఇలాంటి పరిస్థితుల్లో రెండు సెషన్లు నిలవడం తేలికా? అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది టీమ్‌ఇండియా. అందుకే సిడ్నీ టెస్టు  డ్రాగా ముగిసినా విజయ మాత్రం భారత్‌దే అంటున్నారు విశ్లేషకులు.


సజీవంగా సిరీసు

ఆస్ట్రేలియాతో గులాబి టెస్టులో తేలిపోయింది కోహ్లీసేన. ఫలితం 0-1తో సిరీసులో వెనకబాటు. పితృత్వ సెలవులకు వెళ్లిన విరాట్‌. గెలుపు అవకాశాలున్న అడిలైడ్‌లోనే చెత్తగా ఓడారంటే  సిరీసులో 0-4తో క్లీన్‌స్వీప్‌ కావడం పక్కా. ఇదీ ఆసీస్‌ దిగ్గజాలు, మాజీల మైండ్‌గేమ్‌. కానీ భారత్‌ వాటన్నిటికీ తన ఆటతోనే సమాధానమిచ్చింది. మెల్‌బోర్న్‌లో సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఇక సిడ్నీ టెస్టులో ఓటమి పాలైతే టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ఆడటం టీమ్‌ఇండియా ఎంతో కష్టం. అలాంటి టెస్టులో ఐదు రోజుల్లో మూడున్నర రోజులు ఆసీస్‌దే ఆధిపత్యం. స్టీవ్‌స్మిత్‌, లబుషేన్‌, పకోస్కీ పర్యాటక జట్టు బౌలర్లను ఆడుకున్నారు. అయినా మనోళ్లు వణకలేదు. రెండో ఇన్నింగ్స్‌లో కచ్చితమైన లైన్‌ అండ్‌ లెంగ్త్‌లో బంతులు విసిరి ఆరు వికెట్లు పడగొట్టారు. సిడ్నీలో స్పిన్నర్‌ నేథన్‌ లైయన్‌ సహకారంతో 140-150 వేగంతో బంతులు విసురుతున్న పేసర్లను తట్టుకోవడం టీమ్‌ఇండియాకు తేలికేం కాదు. అలాంటి ఆసీస్‌ను తమ పట్టుదల.. కసి.. తెగువతో దెబ్బకొట్టింది. సిరీస్‌ను 1-1తో సజీవంగా ఉంచుకోవడం అంతా శెభాష్‌ అంటున్నారు.


గాయపడ్డా దెబ్బకొట్టాం

అసలు సిడ్నీ టెస్టు ఇంత రసవత్తరంగా సాగడమే ఓ అద్భుతం. నిజానికి టీమ్‌ఇండియా గాయపడ్డ జట్టుగా మారింది. భువి, ఇషాంత్‌ పర్యటనకే రాలేదు. షమి, ఉమేశ్‌ మధ్యలో గాయపడ్డారు. అనుభవజ్ఞులు లేని పేస్‌ దాడిని సిరాజ్‌, సైని అండతో బుమ్రా కొనసాగించాడు. ఇక అశ్విన్‌, జడేజా బౌలింగ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు, ఒక రనౌట్‌తో జడ్డూ అదరగొట్టాడు. ఆతిథ్య జట్టును 338కే కట్టడి చేసింది. అయితే తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేసేటప్పుడు టీమ్‌ఇండియాకు ఎదురు‘దెబ్బలు’ తగిలాయి. పుజారా డిఫెన్స్‌ కకావికలమైంది. రహానె మెరుపుల్లేవ్‌. ముగ్గురు ఆటగాళ్లు రనౌట్‌ అయ్యారు. జడ్డూ బొటనవేలు విరిగిపోయింది. హనుమ విహారి సంగతి సరేసరి. టెయిలెండర్లు ఏం చేయగలరో అందరికీ తెలుసు. ఇలాంటి జట్టు 407 పరుగుల లక్ష్యాన్ని ఏం చేయగలదన్న ఆసీస్‌ ధీమాను టీమ్‌ఇండియా భలే దెబ్బకొట్టింది.


సలాం.. పుజారా+పంత్‌

ఐదోరోజు ఆట ఆరంభమవ్వగానే అజింక్య రహానె పెవిలియన్‌ చేరాడు. మిగతా వాళ్ల ఫామ్‌ను చూస్తే 102/3తో ఉన్న టీమ్‌ఇండియా భారీ తేడాతో ఓటమి పాలవ్వడం ఖాయమే అనిపించింది. కానీ ఇక్కడే పుజారా (77; 205 బంతుల్లో 12×4) తన అనుభవం, పంత్‌ (97; 118 బంతుల్లో 12×4, 3×6) తన విధ్వంసాన్ని కలిపి చూపించారు. ఒకవైపు పంత్‌ భారీ బౌండరీలు, సిక్సర్లతో నేథన్‌ లైయన్‌ సహా బౌలర్లను బెంబేలెత్తించాడు. పుజారా తనదైన శైలిలో పేసర్ల సహనాన్ని పరీక్షించాడు. దొరికిన బంతికి పరుగులూ తీశాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 265 బంతుల్లో 148 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్‌ గెలుపుపై ఆశలు కలిగాయి. ఐదు గంటలు (206 ని+ 118 ని) ఆడిన వీరిద్దరూ వెంటవెంటనే పెవిలియన్‌ చేరడంతో మళ్లీ భయం చొరబడింది. 280/5తో టీమ్‌ఇండియా టీకి వెళ్లినప్పుడు విహారి 4, అశ్విన్‌ 7 పరుగులతో ఉన్నారు. ఆఖరి సెషన్‌లో విజయం కోసం భారత్‌కు 127 పరుగులు, ఆసీస్‌కు 5 వికెట్లు కావాలి.

ఆఖరి ఓవర్‌ వేయకుండా చేయికలిపేందుకు వచ్చిన ఆసీస్‌ ఆటగాళ్లను చూసి హనుమ విహారి నవ్విన చిరునవ్వు, అశ్విన్‌ చూపిన తెగువ కచ్చితంగా వెలకట్టలేనివే.


వెలకట్టలేం యాష్‌+విహారి

ఈ సిరీసులో అశ్విన్‌ బ్యాటుతో రాణించిందేమీ లేదు. ఇక హనుమ విహారి జట్టులో తన చోటు కోసం ఆడాల్సిన పరిస్థితి. పైగా పిక్క కండరాలు పట్టేసి పరుగు తీయలేని దుస్థితి. ఫిజియో వచ్చి రెండు మూడుసార్లు పరీక్షించాడు. అతడు ఔటైతే మరొకరు ఉన్నారా అంటే.. మిగిలింది జడేజా. బొటనవేలు విరిగినా జట్టుకోసం గ్లోవ్స్‌ ధరించాడు. టెయిలెండర్లు పది నిమిషాలు ఆడటమూ కష్టమే. అటు చూస్తే ఆసీస్‌ మోములో గెలుపు దరహాసం. ఇలాంటి పరిస్థితుల్లో 34 ఓవర్లు ఆడింది అశ్విన్‌, హనుమ జోడీ. పట్టుదల, మూర్తిమత్వం, సహనం, తెగువకు మరోపేరుగా నిలిచింది. ఆరో వికెట్‌కు 259 బంతులాడి 62* పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పింది. ఆసీస్‌ ఆటగాళ్లు పదేపదే స్లెడ్జింగ్‌ చేసి ఏకాగ్రత చెడగొడుతున్నా.. బాడీలైన్‌తో దేహం మీదకు బంతులు విసిరుతున్నా.. అశ్విన్‌ రిబ్స్‌కు బంతి తగిలినా.. కదల్లేకపోతున్న విహారిపై అనవసరంగా త్రో విసిరినా విహారి 161, అశ్విన్‌ 128 నిమిషాలు నిలిచారు. గాయాల నొప్పిని భరిస్తూ ఆడారు కాబట్టే ఈ డ్రా టీమ్‌ఇండియాకు గెలుపుగా.. ఆసీస్‌కు ఓటమిగా కనిపిస్తోంది.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

ఇవీ చదవండి
ఆసీస్‌ విజయానికి అడ్డేసిన విహారి, అశ్విన్‌
దెబ్బ అదుర్స్‌ కదూ: సెహ్వాగ్‌
నయావాల్‌.. డీకోడెడ్‌!

 

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని