Kapil Dev: హార్దిక్‌ను ఆల్‌రౌండర్‌గా పిలవొచ్చా..? నాకైతే వారిద్దరి ఆటంటే ఇష్టం: కపిల్‌

బౌలింగ్‌ చేసేందుకు ఇబ్బంది పడుతున్న హార్దిక్‌ పాండ్యను ఆల్‌రౌండర్‌గా పరిగణించవచ్చా? అని భారత జట్టు మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌...

Published : 26 Nov 2021 18:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్: బౌలింగ్‌ చేసేందుకు ఇబ్బంది పడుతున్న హార్దిక్‌ పాండ్యను ఆల్‌రౌండర్‌గా పరిగణించవచ్చా? అని భారత జట్టు మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ ప్రశ్నించారు. వైట్‌బాల్‌ క్రికెట్‌లో కీలకంగా మారతాడని భావించిన పాండ్య ఇటీవల టీ20 ప్రపంచకప్‌లో కేవలం రెండు మ్యాచుల్లోనే బౌలింగ్ చేశాడు. టీమ్‌ఇండియా గ్రూప్‌ దశలోనే నిష్క్రమించింది. అంతకుముందు జరిగిన ఐపీఎల్‌లోనూ అసలు బౌలింగ్‌ చేయలేకపోయాడు. మరో వైపు బ్యాటింగ్‌లో కూడా పెద్దగా రాణించిందీ లేదు. ఈ క్రమంలో పాండ్య ఫిట్‌నెస్‌పై విమర్శలు వచ్చాయి. దీంతో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేయలేదు. ఈ క్రమంలో పాండ్య పాత్రపై కపిల్‌ స్పందించాడు. 

‘‘ఎవరైనా క్రికెటర్‌ను ఆల్‌రౌండర్‌గా పిలవాలంటే బౌలింగ్‌, బ్యాటింగ్ చేయగలగాలి. అయితే పాండ్య బౌలింగ్‌ చేయడం లేదు కాబట్టి అతడిని ఆల్‌రౌండర్‌ అని పిలుస్తామా? గాయం నుంచి కోలుకున్న పాండ్యను మొదట బౌలింగ్‌ చేయనివ్వండి. టీమ్‌ఇండియాకు పాండ్య చాలా ముఖ్యమైన బ్యాటర్‌. అలానే ఎక్కువ మ్యాచుల్లో బౌలింగ్‌ చేయాలి. ఇటు బ్యాటింగ్‌, బౌలింగ్‌లో ప్రదర్శన చేస్తే అప్పుడు ఆల్‌రౌండర్‌గా పిలవొచ్చు’’ అని కపిల్‌ పేర్కొన్నాడు. తన ఫేవరేట్‌ ఆల్‌రౌండర్లు ఎవరని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఇద్దరు పేర్లను చెప్పాడు. రవిచంద్రన్ అశ్విన్‌, రవీంద్ర జడేజా తనకిష్టమైన ఆల్‌రౌండర్లని తెలిపాడు. అయితే జడేజా బ్యాటింగ్‌లో మెరుగుపడ్డాడని, బౌలింగ్‌లో కాస్త వెనుకబాటుకు గురైనట్లు అనిపిస్తోందని వివరించాడు. ఆరంభంలో అద్భుతంగా బౌలింగ్ చేసేవాడు, ఇప్పుడు సూపర్‌గా బ్యాటింగ్‌ చేస్తున్నాడని పేర్కొన్నాడు. అయితే ప్రతిసారి అతడు టీమ్‌ఇండియాకు అవసరమయ్యే ఆటగాడని వివరించాడు.

భారత ప్రధాన కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ ఎంపికను ఈ మాజీ సారథి ప్రశంసించాడు. అపార అనుభవమున్న క్రికెటర్‌గా కంటే కూడా ద్రవిడ్‌ కోచ్‌గా విజయవంతమవుతాడని విశ్లేషించాడు. కివీస్‌తో టీ20 సిరీస్‌ నుంచి రాహుల్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. 2023 వన్డే ప్రపంచకప్‌ వరకు పదవిలో ఉంటాడు. ద్రవిడ్‌పై ప్రశంసల వర్షం కురిపించిన కపిల్ ‘‘వ్యక్తిగతంగా ద్రవిడ్‌ చాలా మంచి వ్యక్తి. ఇటు క్రికెటర్‌గానూ అనుభవజ్ఞుడు. క్రికెటర్‌గా కంటే కోచ్‌గా ఇంకా సక్సెస్‌ అవుతాడు. ఎందుకంటే క్రికెట్‌లో అతని కంటే మెరుగ్గా ఎవరూ రాణించలేదు. అయితే ఒక్క సిరీస్‌కే అతడి సామర్థ్యాన్ని జడ్జ్‌ చేయకూడదు. అతడి పదవీకాలంలో చాలా చేస్తాడు. జస్ట్‌ మనమంతా సానుకూల దృక్పథంతో ఉండాలి’’ అని కపిల్‌ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు