ఆయనకు భయపడి మూలకు నక్కి తినేవాడిని

ఓ సీనియర్‌ ఆటగాడికి భయపడి ఆయన కంటపడకుండా ఓ మూలకు నక్కేవాడినని టీమ్‌ఇండియా మాజీ సారథి కపిల్‌ దేవ్‌ అన్నారు. సారథిగా ఎంపికైన తర్వాతా ఆయన తనను మందలించేవాడని పేర్కొన్నారు.......

Published : 16 Jul 2020 03:27 IST

కెప్టెన్‌ అయ్యాకా తనను మందలించేవాడన్న హరియాణా హరికేన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ఓ సీనియర్‌ ఆటగాడికి భయపడి ఆయన కంటపడకుండా ఓ మూలకు నక్కేవాడినని టీమ్‌ఇండియా మాజీ సారథి కపిల్‌ దేవ్‌ అన్నారు. సారథిగా ఎంపికైన తర్వాతా ఆయన తనను మందలించేవాడని పేర్కొన్నారు. అయితే.. ఆయనది ప్రేమించే స్వభావమేనని వెల్లడించారు. టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు, మహిళల జట్టు కోచ్‌ డబ్ల్యూవీ రామన్‌తో ముఖాముఖిలో హరియాణా హరికేన్‌ చెప్పిన ఆసక్తికర సంగతులు మీకోసం..!

భారత్‌కు తొలిసారి వన్డే ప్రపంచకప్‌ అందించిన కపిల్‌దేవ్‌ దిగ్గజ స్పిన్నర్‌ బిషన్‌సింగ్‌ బేడీ నాయకత్వంలో అరంగేట్రం చేశారు. సునిల్‌ గావస్కర్‌ సారథ్యంలో ఎక్కువగా ఆడారు. అయితే 1978-79 సీజన్‌లో మాత్రం స్పిన్నర్‌ ఎస్‌.వెంకటరాఘవన్‌ కెప్టెన్సీలో ఆడారు. అప్పుడు కొత్త కుర్రాడు కావడంతో వెంకటరాఘవన్‌ వల్ల చాలా ఇబ్బంది పడ్డానని కపిల్‌ గుర్తుచేసుకున్నారు. తన ముఖం చూస్తేనే ఆయన చిరాకుపడేవారని పేర్కొన్నారు. వీడ్కోలు పలికిన తర్వాత అంపైర్‌గా చేసిన రాఘవన్‌ బౌలర్లు అప్పీల్‌ చేస్తే నాటౌట్‌ అని చెప్పడమూ మందలించినట్టుగానే ఉండేదని వెల్లడించారు.

‘టెస్టు మ్యాచులో సాయంత్రపు విరామాన్ని ఇంగ్లాండ్‌లో తేనీటి విరామం అంటారు. దాన్నెందుకు తేనీటి విరామం అనాలని వెంకటరాఘవన్‌ వాదించేవారు. కొట్లాటకు దిగేవారు. అది టీ, కాఫీ విరామంగా ఉండాలనేవారు. ఆయన్ను చూస్తే నేను చాలా భయపడేవాడిని. ఎందుకంటే ముందు ఆయన కేవలం ఇంగ్లిష్‌లోనే మాట్లాడేవారు. రెండోది ఆయన చాలా ఆవేశపరుడు’ అని కపిల్‌ అన్నారు.

‘1979లో ఇంగ్లాండ్‌కు వెళ్లినప్పుడు వెంటకరాఘవన్‌ సారథి. భయంతో డ్రస్సింగ్‌రూమ్‌లో ఆయనకు కనిపించకుండా ఉండేవాడిని. జట్టులో బేడీ, ప్రసన్న, చంద్రశేఖర్‌ వంటి సీనియర్లు ఉండేవారు. వాళ్లను ఆయన ఏం అనేవారు కాదు. అందుకే నేను కనిపిస్తే అంతే సంగతులు. ఉరిమినట్టు చూసేవారు. సాధారణంగా నేను ఎక్కువగా తింటాను. ఎప్పుడు చూసినా తింటూనే ఉంటానన్నట్టు ఆయన చూపులుండేవి. అందుకే కనిపించకుండా ఓ మూలకు నక్కేవాడిని’ అని కపిల్‌ గుర్తు చేసుకున్నారు.

‘1983లో నా సారథ్యంలో జట్టు వెస్టిండీస్‌కు వెళ్లింది. బార్బడోస్‌లో టెస్టు ఆడుతున్నాం. పిచ్‌ బౌన్సీగా అనిపించడంతో ఎక్కువగా పేసర్లుకు బంతినిచ్చాను. స్పిన్నర్‌గా ముందు రవిశాస్త్రితో వేయించాను. అప్పుడు స్లిప్‌లో ఉన్న రాఘవన్‌.. కపిల్‌ అని నన్ను పిలిచారు. చెప్పండి వెంకీ అని బదులిచ్చాను. అంతకుముందు సర్‌ అనేవాడిని. అప్పుడాయన ‘నేను బౌలింగ్‌ చేయనని చెప్పానా?’ అని ప్రశ్నించారు. అప్పుడు కెప్టెన్‌ ఎవరో నాకర్థం కాలేదు. అయితే ‘సరే వెంకీ.. మీ సమయం వస్తుంది’ అని బదులిచ్చాను. ఆయనది ప్రేమించే స్వభావమే. కెప్టెన్‌ అయినప్పటికీ ఆయన నన్ను మందలించేవారు’ అని కపిల్‌ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని