Olympics: భారత్‌ గర్వపడేలా ఏర్పాట్లు చేస్తున్నాం

మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు అథ్లెట్లకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ఈ విషయంలో ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందించాలని...

Published : 23 May 2021 01:30 IST

ఒలింపిక్స్‌ అథ్లెట్లకు సహకరించాలని ప్రధాని మోదీ ఆదేశం

దిల్లీ: మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు అథ్లెట్లకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ఈ విషయంలో ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారని కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు తెలిపారు. కరోనా కారణంగా ఏడాది పాటు వాయిదా పడిన టోక్యో ఒలింపిక్స్‌ ఈ ఏడాది జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ఆ మెగా ఈవెంట్‌లో పాల్గొనేందుకు భారత్‌ నుంచి అనేక మంది అథ్లెట్లు సిద్ధమవుతున్నారు.

‘మన క్రీడాకారులంతా సంతోషంగా ఒలింపిక్స్‌కు సన్నద్ధమవుతున్నారు. భారత్‌ గర్వపడేలా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ వారి కోసం ప్రభుత్వం చేయాల్సిందలా చేస్తోంది. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ కలగజేసుకొని అథ్లెట్లకు పూర్తి సహకారం అందించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు’ అని రిజిజు ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. అదే పోస్టులో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన పీవీ సింధు, రెజ్లర్‌ భజ్‌రంగ్‌ పునియా, భవాని దేవీ లాంటి క్రీడాకారులు భారత ప్రభుత్వానికి, స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాకు కృతజ్ఞతలు చెప్పారు. కాగా, ఇప్పటికే అన్ని క్రీడా రంగాల్లో కలిపి మొత్తం 148 మంది క్రీడాకారులకు టీకా తొలిడోస్‌ ఇచ్చినట్లు ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ పేర్కొంది. అందులో 17 మందికి రెండో డోస్‌ కూడా అందించినట్లు వివరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని