IPL: విరాట్‌ కోహ్లీతో సమానంగా నిలిచిన కేఎల్ రాహుల్‌

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ కొత్త ఫ్రాంచైజీలు లఖ్‌నవూ, అహ్మదాబాద్‌ జట్ల ముగ్గురేసి..

Published : 23 Jan 2022 01:59 IST

ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ కొత్త ఫ్రాంచైజీలు లఖ్‌నవూ, అహ్మదాబాద్‌ జట్ల ముగ్గురేసి ఆటగాళ్లను ఎంపిక చేసుకునే ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేశాయి. అహ్మదాబాద్‌ జట్టు హార్దిక్‌ పాండ్య, రషీద్‌ ఖాన్‌, శుభ్‌మన్ గిల్‌ను తీసుకోగా.. లఖ్‌నవూ టీమ్‌ కేఎల్‌ రాహుల్‌, మార్కస్ స్టొయినిస్‌, రవి బిష్ణోయిని ఎంచుకుంది. లఖ్‌నవూకు కేఎల్‌ రాహుల్‌, అహ్మదాబాద్‌కు హార్దిక్‌ పాండ్య సారథులుగా వ్యవహరిస్తారు. ఫిబ్రవరి రెండో వారంలో మెగా వేలం నిర్వహించనున్నట్లు ఐపీఎల్‌ తెలిపింది. మొత్తం 1,214 మంది ఆటగాళ్లు మెగా వేలంలోకి వస్తున్నారు.

ఈ క్రమంలో కేఎల్‌ రాహుల్‌ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పారితోషికం అందుకునే వారిలో కోహ్లీ సరసన చేరాడు. 2018లో వేలానికి ముందే కోహ్లీని ఆర్‌సీబీ రూ.17 కోట్లకు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కేఎల్‌ రాహుల్‌కు కూడా అంతే మొత్తాన్ని ఇచ్చి లఖ్‌నవూ సెలెక్ట్‌ చేసుకుంది. స్టోయినిస్‌ రూ.9.2 కోట్లు, రవి బిష్ణోయ్‌ రూ.4 కోట్లు అందుకుంటారు. లఖ్‌నవూ ఫ్రాంచైజీ రూ.59.89 కోట్లతో మెగా వేలంలోకి వచ్చి ఆటగాళ్లను కొనుగోలు చేయనుంది. 

అహ్మదాబాద్‌ సారథిగా ఎంపికైన హార్దిక్‌ పాండ్యకు రూ.15 కోట్లు దక్కనుండగా.. రషీద్‌ ఖాన్‌కు కూడానూ రూ.15  కోట్లు ఇస్తుండటం విశేషం. ఇక శుభ్‌మన్ గిల్‌ రూ.8 కోట్లు అందుకోనున్నాడు. దీంతో మిగతా ఆటగాళ్ల కోసం వేలంలో అహ్మదాబాద్‌ రూ.52 కోట్లను వెచ్చించనుంది. కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్య జట్టు సభ్యుల్లో స్ఫూర్తి నింపుతాడని ఆ జట్టు మెంటార్‌ గ్యారీ కిర్‌స్టెన్ తెలిపాడు. సారథిగా అనుభవం లేకపోయినా రాణిస్తాడనే నమ్మకం మాత్రం తమకుందని పేర్కొన్నాడు. హార్దిక్‌తో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు.

ఈ సారి వీరు లేరు..

ఐపీఎల్‌ మెగా వేలం కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అయితే టాప్‌ ప్లేయర్లు అయిన కొంతమంది ఆటగాళ్లు మెగా వేలంలోకి రాకపోవడం అభిమానులను కాస్త నిరుత్సాహానికి గురి చేసేదే. అందులో యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌, ఆసీస్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌, ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు బెన్‌స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, క్రిస్‌ వోక్స్, సామ్‌ కరన్ వంటి ఆటగాళ్లు ఈసారి రిజిస్టర్‌ చేసుకోలేదు. ఇంగ్లాండ్‌ తరఫున స్వదేశంలో జరిగే సిరీస్‌ల కోసం ఐపీఎల్‌ మెగా వేలంలోకి బెన్ స్టోక్స్‌ రావడం లేదని తెలుస్తోంది. ఇదే విధంగా జో రూట్‌ కూడా మొదట్లో ఆసక్తి కనబరిచినా ఇంగ్లాండ్‌ టెస్టు క్రికెట్‌ కోసం తన పేరు నమోదు చేసుకోలేదు. 

బరిలో నిలిచిన టాప్‌ ప్లేయర్లు

డేవిడ్ వార్నర్, రవిచంద్రన్ అశ్విన్‌, డ్వేన్ బ్రావో, మిచెల్ మార్ష్, శ్రేయస్‌ అయ్యర్, శిఖర్ ధావన్, ఇషాన్‌ కిషన్‌, సురేశ్‌ రైనా, ప్యాట్‌ కమిన్స్, షకిబ్ అల్ హసన్, ట్రెంట్ బౌల్ట్, స్టీవ్ స్మిత్, డికాక్, రబాడ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు సహా 49 మంది బేసిక్ ధర రూ.2 కోట్ల జాబితాలో ఉన్నారు. భారత ఆల్‌రౌండర్‌ షారుక్‌ ఖాన్‌ రూ.20 లక్షలతో బేసిక్‌ ధరతో ఉన్నా వేలంలో భారీ మొత్తం దక్కుతుందని ఆశిస్తున్నాడు. టీమ్‌ఇండియా ఫాస్ట్‌ బౌలర్‌ శ్రీశాంత్ బేసిక్ ధర రూ.50 లక్షల కేటగిరీలో తన పేరును నమోదు చేసుకున్నాడు. నిషేధం పూర్తి చేసుకుని మైదానంలోకి దిగేందుకు ఎదురు చూస్తున్నానని ఇప్పటికే పలుమార్లు శ్రీశాంత్‌ చెప్పాడు.

* బేసిక్ రూ. 1.5 కోట్లు: అమిత్ మిశ్రా, ఇషాంత్ శర్మ, ఆరోన్ ఫించ్‌, ఇయాన్ మోర్గాన్, డేవిడ్ మలన్, టిమ్ సౌథీ, జేమ్స్ నీషమ్

* బేసిక్‌ ధర రూ. కోటి:  అజింక్య రహానె, కుల్‌దీప్ యాదవ్‌, నటరాజన్, హసరంగ, మార్‌క్రమ్, షంసి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని