Lionel Messi: అర్జెంటీనా స్టార్‌ లియోనల్‌ మెస్సీ మరో అరుదైన రికార్డు

అర్జెంటీనా ఫుట్‌బాల్‌ స్టార్‌ లియోనల్‌ మెస్సీ (Lionel Messi) మరో అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఫుట్‌బాల్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఇచ్చే ప్రతిష్ఠాత్మక ‘బాలన్‌ డి ఓర్‌’ అవార్డును 7 సార్లు అందుకొని చరిత్ర సృష్టించాడు...

Updated : 30 Nov 2021 11:56 IST

ప్యారిస్‌: అర్జెంటీనా ఫుట్‌బాల్‌ స్టార్‌ లియోనల్‌ మెస్సీ (Lionel Messi) మరో అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఫుట్‌బాల్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఇచ్చే ప్రతిష్ఠాత్మక ‘బాలన్‌ డి ఓర్‌’ అవార్డును 7 సార్లు అందుకొని చరిత్ర సృష్టించాడు. బాలన్‌ డి ఓర్‌ అవార్డు 2021కి సంబంధించి ఫ్రాన్స్‌ పుట్‌బాల్‌ ఈ కార్యక్రమానికి ఆతిథ్యం ఇచ్చింది. ప్యారిస్‌లో జరిగిన ఈ వేడుకలో ఈ అవార్డు గెలుచుకునేందుకు 30 మంది ఆటగాళ్లను షార్ట్‌ లిస్ట్‌ చేశారు. చివరగా రాబర్ట్‌ లెవాండోస్కీ, జోర్గిన్హోలను వెనక్కి నెట్టి మెస్సీ ‘బాలన్‌ డి ఓర్‌’ అవార్డును ముద్దాడాడు. మెస్సీ అంతకు ముందు 2009, 2010, 2011, 2012, 2015, 2019 సంవత్సరాల్లో ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు. 2020లో కరోనా కారణంగా ఈ అవార్డుల కార్యక్రమం రద్దయింది.

ఈ అవార్డును గెలుచుకోవడం పట్ల మెస్సీ సంతోషం వ్యక్తం చేశాడు. ‘‘మళ్లీ ఈ అవార్డు అందుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఇదో అపురూపం. రెండేళ్ల కిందట ఈ అవార్డును తీసుకుంటున్నప్పుడు ఇక ఇదే చివరిదని అనుకున్నా. కానీ ఈ అవార్డు సాధించడంలో ‘కోపా అమెరికా కప్‌’ గెలవడం ముఖ్య పాత్ర పోషించింది’’ అని మెస్సీ అన్నాడు. ఇక స్పానిష్ ఫుట్‌బాల్‌ క్రీడాకారిణి, బార్సిలోనా కెప్టెన్‌ అలెక్సియా పుటెల్లాస్‌ మహిళల విభాగంలో ‘బాలన్‌ డి ఓర్‌’ అవార్డును గెలుచుకుంది. ఈ అవార్డు గెలుచుకోవడం ఆమెకిదే తొలిసారి.

34 ఏళ్ల అర్జెంటీనా స్టార్‌ ఆటగాడు మెస్సీ గతేడాది బార్సిలోనా తరఫున 48 మ్యాచుల్లో 38 గోల్స్‌ సాధించాడు. మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా జట్టు ఈ ఏడాదిలో జరిగిన ‘కోపా అమెరికా కప్‌’ ఫైనల్లో బ్రెజిల్‌ను ఓడించింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా 1-0 తేడాతో నెగ్గింది. దీంతో 28 ఏళ్ల తర్వాత అర్జెంటీనాకు మెస్సీ ఓ మెగా టైటిల్‌ను అందించాడు. మెస్సీ ఇటీవలే బార్సిలోనా జట్టును వీడిన సంగతి తెలిసిందే. ఆ జట్టుతో అతడికి సుమారు రెండు దశాబ్దాల అనుబంధం నడిచింది. బార్సిలోనా తరఫున మెస్సీ 778 మ్యాచ్‌ల్లో 672 గోల్స్‌ చేశాడు. ప్రస్తుతం అతడు ప్యారిస్‌ సెయింట్‌ జర్మైన్‌ జట్టుతో కొనసాగుతున్నాడు. మరో దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో షార్ట్‌ లిస్ట్‌లో ఆరో స్థానంలో నిలిచాడు. రొనాల్డో ఈ అవార్డును ఐదుసార్లు అందుకున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని