Lionel Messi: వీడిన సందిగ్ధత.. పీఎస్‌జీ క్లబ్‌లో చేరనున్న మెస్సీ!

ప్రముఖ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు లియోనెల్‌ మెస్సీకి బార్సిలోనా క్లబ్‌తో అనుబంధానికి తెరపడిన అనంతరం అతడు ఏ క్లబ్‌లో చేరబోతున్నాడనే చర్చ ప్రపంచవ్యాప్తంగా మొదలైంది. అయితే సందిగ్ధతకు తెరపడినట్లే కనిపిస్తోంది....

Updated : 10 Aug 2021 22:04 IST

(ఫొటో సోర్స్: లియోనెల్‌ మెస్సీ ట్విటర్‌)

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు లియోనెల్‌ మెస్సీకి బార్సిలోనా క్లబ్‌తో అనుబంధానికి తెరపడిన అనంతరం అతడు ఏ క్లబ్‌లో చేరబోతున్నాడనే చర్చ ప్రపంచవ్యాప్తంగా మొదలైంది. అయితే సందిగ్ధతకు తెరపడినట్లే కనిపిస్తోంది. లియోనెల్‌ మెస్సీ ప్యారిస్‌ సెయింట్‌ జర్మన్‌ (పీఎస్‌జీ) క్లబ్‌లో చేరబోతున్నాడని తెలుస్తోంది. ఈ విషయాన్ని మెస్సీ తండ్రి, అతడికి ఏజెంట్‌గా వ్యవహరిస్తున్న జార్జ్‌ మెస్సీ వెల్లడించారు. బార్సెలోనా విమానాశ్రయంలో విలేకరులు అడిన ప్రశ్నకు జార్జ్‌ మెస్సీ సమాధానమిచ్చారు. ఈ ఉత్తమ క్రీడాకారుడితో ఒప్పందం కుదుర్చుకునేందుకు పీఎస్‌జీ కొద్ది రోజులుగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే అతడి తండ్రి ఈ విషయాన్ని వెల్లడించారు. కాగా మెస్సీ ఈ విషయాన్ని ధ్రువీకరించాల్సి ఉంది.

అర్జెంటీనాకు చెందిన మెస్సీకి బార్సిలోనా క్లబ్‌తో దాదాపు రెండు దశాబ్దాల అనుబంధం. తన 17 ఏట 2004 క్లబ్‌లోకి వచ్చిన అతడు మొత్తం 17 సీజన్లు ఆడాడు. వివిధ లీగుల్లో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. క్లబ్ తరఫున 778 మ్యాచ్‌ల్లో 672 గోల్స్‌ సాధించాడు. కాగా మెస్సీతో తమ కాంట్రాక్టును పునరుద్ధరించలేమని బార్సిలోనా గత గురువారం ప్రకటించింది. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని