Published : 23/10/2020 09:15 IST

కుడి-ఎడమైనా.. సరిదిద్దగలరు! 

జట్లను గట్టెక్కిస్తున్న ఆపద్బాంధవులు

అప్పటి వరకు పరుగుల వరద పారిస్తున్న జట్టు అకస్మాత్తుగా నెమ్మదిస్తుంది. మధ్య ఓవర్లలో ప్రత్యర్థి బౌలర్ల ధాటికి రన్‌రేట్‌ తగ్గిపోతుంది. టాప్‌, మిడిలార్డర్‌ వికెట్లు టపటపా పడిపోతాయి. తొలి ఇన్నింగ్సైతే భారీ లక్ష్యం నిర్దేశించడం కష్టమే అనిపిస్తుంది. రెండో ఇన్నింగ్స్‌ అయితే లక్ష్యం ఛేదించగలరా అన్న సందేహం వచ్చేస్తుంది. అలాంటి స్థితిలో అవతలి ఎండ్‌లో బ్యాటర్‌కు అండగా నిలుస్తూ.. అవసరమైతే తానే బంతిని చితకబాదే ఆటగాడు అవసరం. ఈ సీజన్‌లోనూ అలా ఆకట్టుకున్న ఆటగాళ్లు కొందరున్నారు.


‘పొలి’ కేక

వెస్టిండీస్‌ బిగ్‌మ్యాన్‌ కీరన్‌ పొలార్డ్‌ క్రీజులో నిలిస్తే ఎంత సునాయాసంగా బంతిని స్టేడియం దాటిస్తాడో ఎవ్వరిని అడిగినా చెప్పేస్తారు. ముంబయి జోరు పెంచాల్సిన ప్రతిసారీ.. వికెట్లు పడకుండా అడ్డుకోవాలన్న ప్రతిసారీ అతడే ఆపద్బాంధవుడిగా అవతరిస్తాడు. తాజా సీజన్‌లోనూ అతడదే పనిచేస్తున్నాడు. 9 మ్యాచులాడిన అతడు ఎవరికీ సాధ్యం కాని రీతిలో 208 సగటు, 200 స్ట్రైక్‌రేట్‌తో 208 పరుగులు చేశాడు. 7 ఇన్నింగ్సుల్లో 6 సార్లు అజేయంగా నిలిచాడంటేనే అతడి పట్టుదలను అర్థం చేసుకోవచ్చు.

బెంగళూరు (201)తో మ్యాచు సూపర్‌ ఓవర్‌కు దారితీసిందంటే పొలార్డే (60*; 24 బంతుల్లో 3×4, 5×6) కారణం. అద్భుతం చేసిన కిషన్‌ (99)కు అండగా నిలిచింది అతడే. పంజాబ్‌తో తొలి మ్యాచులో 48 పరుగుల తేడాతో విజయానికీ అతడే కారణం. రోహిత్‌ (70) అదరగొట్టినా చివర్లో పొలార్డ్‌ (47*; 20 బంతుల్లో 3×4, 4×6) విధ్వంసమే భారీ స్కోరు అందించింది. పంజాబ్‌తో రెండో పోరులోనూ పొలార్డ్‌ (34; 12 బంతుల్లో 1×4, 4×6) అజేయంగానే నిలిచాడు. ముంబయి ప్రతి విజయంలోనూ అతడిదే ప్రధాన పాత్ర కావడం విశేషం. ఈ సీజన్లో అతడు వరుసగా 18, 13*, 60*, 47*, 25*, 11*, 34* పరుగులు చేశాడు.


‘సర్’‌.. జడేజా

ఈ సీజన్లో అభిమానులను పూర్తిగా నిరాశపరిచింది ధోనీసేన. కానీ అందులో అందరినీ మెప్పించిన ఒక ఆటగాడు ఉన్నాడు. అతడే రవీంద్ర జడేజా. టాప్‌ ఆర్డర్‌, మిడిలార్డర్‌ విఫలమైన ప్రతిసారీ నేనున్నానంటూ ముందుకొచ్చాడు. వేగంగా స్కోర్లు చేశాడు. 10 మ్యాచుల్లో 48.50 సగటు, 164.40 స్ట్రైక్‌రేట్‌తో 194 పరుగులు సాధించాడు. ఆడిన పది ఇన్నింగ్సుల్లో ఐదుసార్లు అజేయంగా నిలిచాడంటేనే ఎంత నిలకడగా ఆడుతున్నాడో అర్థం చేసుకోవచ్చు. రాజస్థాన్‌ చేతిలో ఓడి ఫ్లేఆఫ్ అవకాశాలు చేజార్చుకున్న మ్యాచులో 30 బంతుల్లో 35తో అజేయంగా నిలిచిందీ అతడే. లేదంటే చెన్నై ఆ 125 స్కోర్‌ సైతం చేసిది కాదు. షార్జా వేదికగా దిల్లీతో జరిగిన పోరులో డుప్లెసిస్‌ (58), వాట్సన్‌ (36), రాయుడు (45*) ఫర్వాలేదనిపించారు. కానీ జడ్డూ 13 బంతుల్లోనే 4 సిక్సర్ల సాయంతో 33 పరుగులు చేయడంతోనే ధోనీసేన 179/4 స్కోర్‌ చేయగలిగింది. హైదరాబాద్‌తో మ్యాచులోనూ 10 బంతుల్లోనే 25*తో అదరగొట్టాడు. అంతకు ముందు మ్యాచులో హైదరాబాద్‌ నిర్దేశించిన 165 లక్ష్యాన్ని సమీపించేందుకు జడ్డూనే ఆదుకున్నాడు. ధోనీ (47*)తో చక్కని భాగస్వామ్యం నెలకొల్పాడు. 35 బంతుల్లోనే అర్ధశతకం అందుకున్నాడు. కానీ మరెవరూ ఆడకపోవడంతో ఈ మ్యాచులో చెన్నై ఓటమి పాలైంది.


‘స్టన్‌’.. స్టాయినిస్‌‌

తాజా సీజన్లో ఎలాంటి చీకూచింత లేకుండా దిల్లీ ప్లేఆఫ్స్‌కు చేరుకొనే స్థితిలో ఉందంటే అందుకు కారణం మార్కస్‌ స్టాయినిస్‌.  గతంలో ఎప్పుడూ లేనంత భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు. 10 మ్యాచుల్లోనే 28.25 సగటు, 158 స్ట్రైక్‌రేట్‌తో 226 పరుగులు చేసేశాడు. డెత్‌ ఓవర్లలో మెరుపువేగంతో బౌండరీలు బాదేస్తూ భారీ స్కోర్లు అందిస్తున్నాడు. దిల్లీకి ఆపద్బాంధవుడిగా మారాడు. పంజాబ్‌తో జరిగిన తొలి మ్యాచులో దిల్లీ 110 స్కోరైనా చేసేలా కనిపించలేదు. అతడు 7 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 21 బంతుల్లోనే 53 పరుగులు చేయడంతోనే పంజాబ్‌కు 158 లక్ష్యం నిర్దేశించగలిగింది. బెంగళూరుతో తొలి పోరులోనూ అతడిలాగే విధ్వంసం సృష్టించాడు. 26 బంతుల్లో 53తో అజేయంగా నిలిచాడు. దాంతో దిల్లీ 196 స్కోర్‌ చేసింది. ఛేదనలో కోహ్లీసేన తేలిపోయింది. రాజస్థాన్‌పై చేసిన 39 పరుగులూ విలువైనవే. చెన్నై నిర్దేశించిన 180 పరుగుల లక్ష్య ఛేదనలో ధావన్‌ శతకం చేసినప్పటికీ స్టాయినిస్‌ (24; 14 బంతుల్లో 1×4, 2×6) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. రన్‌రేట్‌ను అదుపులో ఉంచాడు. దిల్లీ టైటిల్‌ను అందుకోవాలంటే అతడు ఇదే ఫామ్‌ను కొనసాగించడం కీలకం.


తె‘వాహ్’‌తియా‌

2014లో అరంగేట్రం చేసిన రాహుల్‌ తెవాతియా ఈ సీజన్‌కు ముందు మొత్తంగా ఆడింది 20 మ్యాచులే. అలాంటిది ఒకే ఒక్క ఇన్నింగ్స్‌తో ఇప్పుడు మ్యాచ్‌ విజేతగా అవతరించాడు. రాజస్థాన్‌ జట్టులో శాశ్వత సభ్యుడిగా మారిపోయాడు. ఈ ఏడాది 11 మ్యాచులాడిన తెవాతియా 44.80 సగటు, 143.58 స్ట్రైక్‌రేట్‌తో 224 పరుగులు చేశాడు. స్మిత్‌సేనకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాడు. అవసరమైన ప్రతిసారీ నేనున్నా అంటున్నాడు. పంజాబ్‌ నిర్దేశించిన 224 పరుగుల లక్ష్య ఛేదనలో అతడొక హీరోగా మారాడు. తొలుత 23 బంతుల్లో 17 పరుగులే చేసిన అతడు ఒకే ఓవర్లో 5 సిక్సర్లు బాదేసి 29 బంతుల్లో 47కు చేరుకున్నాడు. 31 బంతుల్లో అర్ధశతకం (53) చేసేశాడు.

హైదరాబాద్‌ నిర్దేశించిన 159 లక్ష్య ఛేదనలోనూ అతడిది కీలక పాత్రే. 78కే 5 వికెట్లు నష్టపోయి కష్టాల్లో పడ్డా.. రియాన్‌ పరాగ్‌ (42*; 26 బంతుల్లో)తో మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు. వికెట్లు పడకుండా అడ్డుకున్నాడు. తొలుత ఆచితూచి ఆడాడు. 28 బంతుల్లో 4 బౌండరీలు, 2 సిక్సర్ల సాయంతో 45తో అజేయంగా నిలిచాడు. విజయం అందించాడు. బెంగళూరుతో మ్యాచులోనూ ఆఖర్లో 12 బంతుల్లోనే 24 పరుగులు చేశాడు. దిల్లీ నిర్దేశించిన 185 లక్ష్య ఛేదనలోనూ తెవాతియా (38; 29 బంతుల్లో 3×4, 2×6)నే టాప్‌ స్కోరర్‌.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

గమనిక‌: గణాంకాలన్నీ అక్టోబర్‌ 21కి నాటికి ఉన్నవే.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని