
IPL 2021: ఫైనల్లో రసెల్ ఎందుకు ఆడలేదంటే..?
ఇంటర్నెట్ డెస్క్: చెన్నై సూపర్ కింగ్స్‌తో శుక్రవారం జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ విధ్వంసకర ఆటగాడు ఆండ్రూ రసెల్‌ను ఎందుకు పక్కన పెట్టారో ఆ జట్టు కోచ్ బ్రెండన్ మెక్ కల్లమ్ వెల్లడించాడు. గాయం కారణంగానే అతడు ఫైనల్ మ్యాచ్ ఆడలేకపోయాడని తెలిపాడు. ‘ఐపీఎల్ మలి దశ ఆరంభంలో గాయపడ్డ రసెల్.. ఆ గాయం నుంచి కోలుకునేందుకు చాలా శ్రమించాడు. అయితే, పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధించకుండా అతడితో ఆడించి రిస్క్ చేయడం సరికాదనిపించింది. అందుకే అతడిని ఫైనల్ మ్యాచ్‌కి దూరం పెట్టాల్సి వచ్చింది’ అని మెక్ కల్లమ్ పేర్కొన్నాడు.
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో కోల్‌కతా జట్టు ఓటమిపై మెక్ కల్లమ్ స్పందించాడు. ‘మా బౌలర్లు చెన్నై జట్టు భారీ స్కోరు చేయకుండా కట్టడి చేయగలిగారు. ఫీల్డింగ్ కూడా బాగానే ఉంది. మా ఓపెనర్లు అద్భుతంగా రాణించారు. దురదృష్టవశాత్తూ మిడిలార్డర్ కుప్పకూలడంతో మ్యాచ్‌పై ఆశలు వదులుకోవాల్సి వచ్చింది. మిడిలార్డర్‌లో ఎంతో అనుభవమున్న ఆటగాళ్లున్నా.. కొన్నిసార్లు ఇలా జరుగుతుంది. అద్భుత ఫామ్‌లో ఉన్న రాహుల్ త్రిపాఠి గాయపడటం కూడా మాకు చేటు చేసింది. అయినా మా ఆటగాళ్లు పోరాడిన తీరు పట్ల గర్వంగా ఉంది. అసలు ఆశలే లేని స్థితి నుంచి లక్ష్యం అంచువరకు రాగలిగాం’ అని మెక్ కల్లమ్ పేర్కొన్నాడు.
కరోనా కారణంగా ఐపీఎల్ అర్ధాంతరంగా రద్దయ్యే సమయానికి కోల్‌కతా జట్టు పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. అయితే, మలి దశలో గొప్పగా పుంజుకుని వరుస విజయాలతో ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. కేకేఆర్ విజయాల్లో కీలకంగా వ్యవహరించిన వెంకటేశ్ అయ్యర్‌పై మెక్ కల్లమ్ ప్రశంసలు కురిపించాడు. అతడు గొప్ప ఆటగాడని ప్రశంసించాడు. ఈ సీజన్లో 10 మ్యాచులు ఆడిన అయ్యర్ 370 పరుగులు చేశాడు.