HCA: ఉద్దేశపూర్వకంగానే నోటీసులు: అజహర్‌

ఉద్దేశపూర్వకంగానే తనకు నోటీసులు ఇచ్చారని హెచ్‌సీఏ అధ్యక్షుడు మహమ్మద్ అజహరుద్దీన్‌ అన్నారు.

Updated : 17 Jun 2021 14:02 IST

హైదరాబాద్‌: ఉద్దేశపూర్వకంగానే తనకు నోటీసులు ఇచ్చారని హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్‌ అజహరుద్దీన్‌ అన్నారు. హెచ్‌సీఏ గౌరవానికి భంగం కలిగేలా తానెప్పుడూ పనిచేయలేదని చెప్పారు. అపెక్స్‌ కౌన్సిల్‌లో తొమ్మిది మంది సభ్యులు ఉంటే వారిలో ఐదుగురు ఓ వర్గంగా ఏర్పడి తాము చేసిందే అపెక్స్‌ కౌన్సిల్‌ నిర్ణయంగా భావిస్తే ఎలా అని ప్రశ్నించారు. హెచ్‌సీఏలో జరుగుతున్న అవినీతిని అరికట్టడానికి సమర్థుడైన వ్యక్తిని అంబుడ్స్‌మెన్‌గా నియమిస్తే ఆ ఐదుగురే తప్పుపట్టారన్నారు. వాళ్ల అవినీతి బయటపడుతుందనే అలా చేశారని అజహర్‌ ఆరోపించారు.

‘హెచ్‌సీఏ రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారు. అడ్డుకోవాలని చూస్తున్న నాపై బురద చల్లుతున్నారు. అపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యులు జాన్‌ మనోజ్‌, విజయానంద్‌, నరేశ్‌ శర్మ, సురేందర్‌ అగర్వాల్‌, అనురాధపై అవినీతి ఆరోపణలున్నాయి. వాళ్ల అవినీతికి నేను అడ్డుపడుతున్నందునే నాకు నోటీసులు ఇచ్చి అపెక్స్‌ కౌన్సిల్‌ జారీ చేసినట్లుగా చెబుతున్నారు’ అని అజహరుద్దీన్‌ అన్నారు.

‘నిజానికి అపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యులకు ఎవరినీ నిషేధించే హక్కు లేదు. అలాగే నోటీసులు ఇచ్చే అధికారం లేదు. మెజారిటీ లేకుండా సమావేశాలు ఎలా నిర్వహిస్తారు? ఆ ఐదుగురు చెప్పిందే అపెక్స్‌ కౌన్సిల్‌ నిర్ణయంగా భావిస్తే ఎలా?’ అని అజహర్‌ ప్రశ్నించారు.

‘పాతికేళ్లుగా వారే  అనేక పదవుల్లో ఉన్నారు. సంఘంలో గుత్తాధిపత్యం చెలాయిస్తున్నారు. బ్లాక్‌మెయిల్‌ చేయడం వారికే తెలుసు. హైకోర్టు ఉత్తర్వులనూ వారు పట్టించుకోవడం లేదు. అయినప్పటికీ వారి బెదిరింపులకు నేను లొంగను. ఎవరు తప్పుడు మార్గంలో వెళ్తున్నారో అందరికీ తెలుసు. నేను దేశం కోసం అత్యుత్తమంగా ఆడాను. క్రికెట్‌ అంటే ఇష్టం కాబట్టే ఆటగాళ్లకు సలహాలు ఇచ్చేందుకు మైదానానికి వస్తాను. రావొద్దని ఎలా చెబుతారు’ అని అజహర్‌ అన్నారు.

‘హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘాన్ని ప్రక్షాళన చేసేందుకు ప్రయత్నిస్తున్నా.  25 ఏళ్లుగా వచ్చిన నిధులతో  ఏం చేశారు? ఉప్పల్‌, జింఖానా తప్ప మిగతా మైదానాలను ఎందుకు అభివృద్ధి చేయలేదు? కేవలం మైదానాలకే నెలకు రూ. 18-19 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు.  రెండు మూడు నెలలు క్రికెట్‌ ఆడితే కోట్లు ఖర్చవుతున్నాయి. స్టేడియాలను ఎందుకు నిర్మించడం లేదు? ఇప్పటికీ ఉప్పల్‌లో ఫైవ్‌ స్టార్‌ సౌకర్యాలు లేవు.  ఇలాగే కొనసాగితే హైదరాబాద్‌ క్రికెట్‌ ఎలా అభివృద్ధి చెందుతుంది’ అని అజహర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. 

 

లోధా సిఫార్సుల మేరకే..: అపెక్స్‌ కౌన్సిల్‌ 

జస్టిస్‌ లోధా సిఫార్సుల మేరకే అజహరుద్దీన్‌పై నోటీసులు జారీచేశామని అపెక్స్‌ కౌన్సిల్‌ తెలిపింది.  కౌన్సిల్‌లోని ఆరుగురిలో ఐదుగురు సభ్యులు  ఆ నిర్ణయం తీసుకున్నారని వివరించింది. వారిని ఓ బృందంగా పోల్చడం సరికాదని వెల్లడించింది. నిజానికి  ఆ ఐదుగురే అపెక్స్‌ కౌన్సిలని, అది ఎన్నికైందని పేర్కొంది. వాస్తవంగా కౌన్సిల్‌లో తొమ్మిది మంది ఉంటారని కౌన్సిల్‌ తెలిపింది. ఒకరు అధ్యక్షుడైన అజహర్‌ కాగా, పురుషుల జట్టు నుంచి ఇద్దరు, మహిళల జట్టు నుంచి ఒకరు ఉంటారంది. ఆ మిగిలిన ఐదుగురే నిజమైన అపెక్స్‌ కౌన్సిలని, వారే నిర్ణయం తీసుకున్నారని వెల్లడించింది. ఈ రోజు నుంచి అజహరుద్దీన్‌ అధ్యక్షుడు కాడని, ఇందులో బీసీసీఐ జోక్యం ఉండదని స్పష్టం చేసింది.  హెచ్‌సీఏ సమావేశాలకు అజహర్‌ అధ్యక్షుడిగా  కాకుండా ఒక వ్యక్తిగా వస్తారని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని