T20 League: ప్లేఆఫ్స్‌.. ఘోర పరాభవాలు.. నెట్‌రన్‌రేట్‌పై తీవ్ర ప్రభావం!

టీ20 లీగ్‌ మ్యాచ్‌లు ఆఖరి దశకు చేరుకుంటున్నాయి. ప్లేఆఫ్స్‌ లెక్కలపై జట్లు కుస్తీలు పడుతున్నాయి. నాలుగు స్థానాల్లో ఇప్పటికే గుజరాత్‌ ఒకదానిని..

Published : 12 May 2022 01:42 IST

గత ఐదు మ్యాచుల్లో జట్ల ప్రదర్శనపై ప్రత్యేక కథనం

ఇంటర్నెట్ డెస్క్: టీ20 లీగ్‌ మ్యాచ్‌లు ఆఖరి దశకు చేరుకుంటున్నాయి. ప్లేఆఫ్స్‌ లెక్కలపై జట్లు కుస్తీలు పడుతున్నాయి. నాలుగు స్థానాల్లో  గుజరాత్‌ ఒకదానిని ఎగరేసుకుపోయింది. ఇక మిగిలింది మూడే బెర్తులు. అయితే ఇక్కడే నెట్‌రన్‌రేట్‌ కీలకంగా మారే అవకాశం ఉంది. ఈ క్రమంలో కొన్ని మ్యాచుల్లో భారీ విజయాలు నమోదు కావడంతో అంకెల గారడీ కొనసాగుతోంది. టాప్‌లో ఉన్న జట్ల స్థానాలు తారుమారయ్యేలా ఉన్నాయి. 

ఇప్పటి వరకు టీ20 మెగా టోర్నీ లీగ్‌ దశలో 57 మ్యాచ్‌లు ముగిశాయి. ఈ క్రమంలో ప్లేఆఫ్స్‌ పోరు ఆసక్తికరంగా మారింది. గుజరాత్‌ ఇప్పటికే ప్లేఆప్స్‌ బెర్తు ఖరారు చేసుకోగా.. మిగిలిన మూడు స్థానాల కోసం తీవ్ర పోటీ ఉంది. చెన్నై, ముంబయికి అయితే అవకాశాలు దాదాపు లేనట్లే. మరీ ముఖ్యంగా ఏడు జట్లు ఆశిస్తున్నప్పటికీ.. ఇందులో లఖ్‌నవూ, రాజస్థాన్‌, బెంగళూరు, దిల్లీ, హైదరాబాద్‌, కోల్‌కతా, పంజాబ్‌ బరిలో ఉన్నాయి. అయితే గత మ్యాచుల్లో ఆయా జట్లు భారీ తేడాతో ఓటమిపాలు కావడం కలవరపెడుతోంది. నెట్‌రన్‌రేట్‌ మారిపోయి తమ ప్లేఆఫ్స్‌ ఛాన్స్‌లను ముంచేస్తాయేమోనని ఆందోళన చెందుతున్నాయి. లీగ్‌ దశలో గత ఐదు మ్యాచ్‌లనే పరిగణనలోకి తీసుకుంటే పరిస్థితి ఎలా ఉందో చూద్దాం.. 

అగ్రస్థానం కోసం దిగి...

కొత్త జట్లు గుజరాత్‌, లఖ్‌నవూ అగ్రస్థానం కోసం హోరాహోరీగా తలపడ్డాయి. అయితే లఖ్‌నవూపై గుజరాత్‌ ఆధిపత్యం చెలాయించి ప్రస్తుతానికైతే నంబర్‌ వన్‌ స్థానానికి చేరుకొని ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది. మే 10న జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ 144/4 స్కోరుకే పరిమితమైంది. అనంతరం లక్ష్య ఛేదనలో 82 పరుగులు మాత్రమే చేసి 62 పరుగుల తేడాతో లఖ్‌నవూ ఓటమిపాలైంది. దీంతో మ్యాచ్‌ ముందు వరకు అగ్రస్థానంలో ఉన్న లఖ్‌నవూ పాయింట్లను పెంచుకోకపోగా.. నెట్‌రన్‌రేట్‌ను బాగా తగ్గించుకుంది. ఇవాళ (మే 11) రాజస్థాన్‌, దిల్లీ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లో సంజూ సేన ఘన విజయం సాధిస్తే మాత్రం లఖ్‌నవూ మూడో స్థానానికి పడిపోయే ప్రమాదం ఉంది. అప్పుడు టాప్‌-4 కోసం పోరు మరింత ఆసక్తికరంగా మారుతుంది.


కోల్‌కతా ఆశలకు జీవం పోసి.. 

ప్లేఆఫ్స్‌ ఆశలు ఎలాగూ లేవు. అయినా ఇతర జట్ల అవకాశాలను దెబ్బకొట్టగలిగే స్థానంలో ముంబయి ఉంది. మరోవైపు ప్లేఆఫ్స్‌ రేసులో నిలబడాలంటే కోల్‌కతా కచ్చితంగా గెలవాలి. ఈ క్రమంలో ముంబయిపై కోల్‌కతా అద్భుత విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా 165/9 స్కోరుకు పరిమితం కాగా.. ముంబయిని 113 పరుగులకే ఆలౌట్ చేసి 52 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో 12 మ్యాచుల్లో ఐదు విజయాలతో పది పాయింట్లు సాధించి ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. మిగిలిన రెండు మ్యాచుల్లోనూ ఇదేవిధంగా ఘన విజయాలు నమెదు చేసి నెట్‌రన్‌రేట్‌ను మెరుగుపరుచుకుంటే ప్లేఆఫ్స్‌ బెర్తు దక్కే అవకాశం ఉంది. ముంబయి ఇప్పటి వరకు 11 మ్యాచుల్లో కేవలం రెండు విజయాలను మాత్రమే నమోదు చేసింది.


చెన్నై పరిస్థితి ఇలా.. 

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై ఆరంభం నుంచి  పోరులో వెనుకబడింది. అయితే దిల్లీపై 91 పరుగుల తేడాతో విజయం సాధించడం చెన్నై అభిమానుల్లో ఆశలు రేకెత్తించాయి. ఇదే సమయంలో దిల్లీ ఆశలకు బ్రేకులు పడ్డాయి. ప్రస్తుతం చెన్నై నాలుగు విజయాలతో 8 పాయింట్లు సాధించి తొమ్మిదో స్థానంలో ఉండగా.. దిల్లీ ఐదు విజయాలతో 10 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. చెన్నైపై 91 పరుగులతో ఓటమిబాట పట్టడం దిల్లీ నెట్‌రన్‌రేట్‌ మీద తీవ్ర ప్రభావం చూపింది. ఇంకా మూడు మ్యాచ్‌లు దిల్లీకి ఉన్నాయి. మూడింట్లోనూ గెలిచి ప్లేఆఫ్స్‌ బెర్తు ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు నెట్‌రన్‌రేట్‌ కీలకం కానుంది. ఈ క్రమంలో చెన్నై ఘోర పరాభవం దిల్లీకి అడ్డంకిగా మారే ఛాన్స్‌ ఉంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై 208/6 స్కోరు చేయగా.. దిల్లీ 117 పరుగులకే కుప్పకూలింది. ప్రస్తుత టీ20 లీగ్‌లో ఇప్పటి వరకు అత్యధిక పరుగుల తేడాతో ఓడిపోయిన జట్టు దిల్లీనే కావడం విశేషం.


హైదరాబాద్‌పై బెంగళూరు ప్రతీకారం 

ఈ సీజన్‌లో తొలిసారి హైదరాబాద్‌తో తలపడినప్పుడు ఘోర అవమానం ఎదుర్కొన్న బెంగళూరు అందుకు ప్రతీకారం తీర్చుకుంది. తమ జట్టును ఎంతకైతే ఆలౌట్‌ చేసిందో (68/10) దానికి ఒక్క పరుగు తక్కువతో (67) హైదరాబాద్‌పై బెంగళూరు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు మూడు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. అనంతరం హైదరాబాద్‌ను 125 పరుగులకే ఆలౌట్‌ చేసింది. దీంతో బెంగళూరు (14) తన ప్లేఆఫ్స్‌కు చేరువగా వచ్చింది. అప్పటికీ నెట్‌రన్‌రేట్‌లో బాగా వెనుకబడిన బెంగళూరు ఈ విజయంతో బాగా మెరుగుపరుచుకుంది. మరోవైపు వరుసగా ఐదు గెలిచిన హైదరాబాద్‌ (10) ఆ తర్వాత నాలుగు ఓటములతో ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇక మిగిలిన మూడు మ్యాచుల్లోనూ ఘన విజయం సాధిస్తేనే ప్లేఆఫ్స్‌ బెర్తు దక్కుతుంది. ఈ మ్యాచ్‌ ముందు వరకు ‘+’ల్లో ఉన్న నెట్‌రన్‌రేట్‌ ‘-’ల్లోకి పడిపోయింది. 


ఇలాంటి ఓటములు వద్దు.. 

హ్యాట్రిక్‌ విజయాలతో సూపర్‌ ఫామ్‌లో ఉన్న లఖ్‌నవూను కోల్‌కతా ఢీకొట్టింది. అయితే లఖ్‌నవూ ముందు కోల్‌కతా ఏమాత్రం పోరాడలేక చేతులెత్తేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన లఖ్‌నవూ ఏడు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో కోల్‌కతా 101 పరుగులకే కుప్పకూలి 75 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇదే టోర్నీలో రెండో అత్యధిక పరుగుల తేడాతో ఓడిపోయిన జట్టు కోల్‌కతా. ఈ విజయంతో లఖ్‌నవూకు నెట్‌రన్‌రేట్‌పరంగా బాగా కలిసొచ్చింది. కానీ ఆ తర్వాత గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోర ఓటమితో మళ్లీ రన్‌రేట్‌ను తగ్గించుకుంది. మరోవైపు కోల్‌కతా కూడా అంతకుముందు మ్యాచ్‌లో రాజస్థాన్‌పై విజయం సాధించి ఊపు మీదున్నప్పటికీ లఖ్‌నవూను అడ్డుకోవడంలో విఫలమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని